రష్యా గ్యాస్‌కు వ్యతిరేకంగా ప్రదర్శన
బ్రసెల్స్: గ్యాస్ సరఫరాకు ప్రధానంగా రష్యాపై ఆధారపడుతూ వస్తున్న యూరప్ ఇకపై దానికి చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య శుక్రవారం కీలక వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. యూరప్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈయూ ఉన్నతాధికారులతో కలిసి ఒప్పంద వివరాలను వెల్లడించారు.
దీని ప్రకారం యూరప్ దేశాల ఇంధన, ముఖ్యంగా గ్యాస్ అవసరాలను చాలావరకు అమెరికా, ఇతర దేశాలు తీరుస్తాయి. యూరప్‌కు అమెరికా, ఇతర దేశాలు వార్షిక గ్యాస్ ఎగుమతులను మరో 15 బిలియన్ క్యూబిక్ మీటర్ల మేరకు పెంచాలన్నది తాజా ఒప్పంద సారాంశం. దీన్ని మున్ముందు మరింత పెంచుతారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని అంగీకారం కుదిరింది. యూరప్ తన గ్యాస్ అవసరాల్లో దాదాపుగా 40 శాతం రష్యా నుంచే దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే.
కొత్త ఒప్పందాలు: జర్మనీ
బొగ్గు, గ్యాస్, చమురు కోసం రష్యాపై ఆధారపడటాన్ని వీలైనంతగా తగ్గించుకుంటామని జర్మనీ ప్రకటించింది. ఇందుకోసం కొత్త సప్లయర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు ఆ దేశ ఆర్థిక మంత్రి రాబర్ట్ హెబెక్ వెల్లడించారు. జర్మనీ గ్యాస్ అవసరాల్లో 45 శాతానికి పైగా రష్యానే తీరుస్తోంది. తమతో స్నేహపూర్వకంగా మసులుకోని దేశాలు గ్యాస్ బిల్లులను రష్యా కరెన్సీ రూబుల్స్‌లోనే చెల్లించాల్సి ఉంటుందన్న పుతిన్ వ్యాఖ్యలపై యూరప్ దేశాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
ఇది ఒప్పందాల ఉల్లంఘనేనని, ఆచరణసాధ్యం కాదని జర్మనీ చాన్స్‌లర్ ఒలాప్ స్కోల్జ్, ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ ప్రకటించారు. రష్యాతో నిమిత్తం లేకుండా యూరప్ గ్యాస్ అవసరాలను అమెరికా, ఇతర దేశాలు తీర్చడం సా ధ్యమేనా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిం ది. ఎందుకంటే అమెరికా ఇప్పటికే యూరప్‌కు భారీగా గ్యాస్ సరఫరా చేస్తోంది. తాజా ఒప్పందం నేపథ్యంలో అంతకుమించి సరఫరా చేసేందుకు అమెరికా సిద్ధపడ్డా దాన్ని దిగుమతి చేసుకునే, పంపిణీ చేసే వ్యవస్థలు యూరప్‌లో ప్రస్తుతానికి లేవు.
Comments
Please login to add a commentAdd a comment