వాషింగ్టన్: యూరప్‌లో యుద్ధ భయాల నడుమ చివరి ఆశగా శాంతి యత్నాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై అమెరికా, రష్యా అధ్యక్షులు జో బైడెన్, వ్లాదిమిర్ పుతిన్ మరోసారి చర్చలు జరిపే సూచనలు కని్పస్తున్నాయి. సంక్షోభాన్ని చల్లార్చేందుకు పుతిన్‌తో భేటీకి బైడెన్ సూత్రప్రాయంగా అంగీకరించారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకీ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలన్నదే ముందునుంచీ తమ వైఖరి అన్నారు. అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు ఆంటోనీ బ్లింకెన్, సెర్గీ లవ్రోవ్ ఈ వారం భేటీ కానున్నారని గుర్తు చేశారు. అయితే ఈ రెండు భేటీలూ ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగని పక్షంలో మాత్రమే జరుగుతాయన్నారు.
దీనిపై రష్యా ఆచితూచి స్పందించింది. అధ్యక్షుల సమావేశం జరిగే ఆస్కారముందన్న పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్, ‘‘అయితే అవి ఎప్పుడు, ఎలా జరుగుతాయన్న దానిపై ఈ దశలో మాట్లాడటం తొందరపాటే అవుతుంది’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘‘భేటీ జరగడం మంచిదేనని అధ్యక్షులిద్దరూ భావిస్తేనే జరుగుతుంది. విదేశాంగ మంత్రుల స్థాయిలో చర్చలు కొనసాగించాల్సిన అవసరముందన్న వరకూ మాత్రం ప్రస్తుతానికి స్పష్టత ఉంది’’ అన్నారు. చర్చలకు తామెప్పుడూ సిద్ధమేనని, కాదని యుద్ధానికే దిగితే దీటుగా స్పందించేందుకు రెడీగా ఉన్నామని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ అన్నారు.
జోరుగా రష్యా సైనిక విన్యాసాలు
రెబెల్స్ ముసుగులో ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యాపైకి కవి్వంపు చర్యలకు దిగి, ఆ సాకుతో దాడి చేయడం పుతిన్ వ్యూహమని అమెరికా ఆరోపిస్తూ వస్తోంది. శనివారం నాటి అణు పరీక్షలకు కొనసాగింపుగా బెలారుస్‌తో రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు సోమవారమూ పెద్ద ఎత్తున జరిగాయి. తూర్పు ఉక్రెయిన్‌లో కాల్పులు, బాంబుల మోతలు మరింతగా పెరిగాయి. ఇవన్నీ పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీస్తాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. బెలారుస్ సరిహద్దుల నుంచి కేవలం 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా విరుచుకుపడుతుందని నాటో అనుమానిస్తోంది. విన్యాసాల పేరిట 30 వేల దాకా సైన్యాన్ని బెలారుస్‌కు ఇప్పటికే తరలించిందని ఆరోపిస్తోంది. ఉక్రెయిన్‌కు మూడువైపులా మోహరించిన దాదాపు రెండు లక్షల సైన్యం నెమ్మదిగా ముందుకే కదులుతోందని అమెరికా, పశి్చమ దేశాలు ఆరోపిస్తున్నాయి. దాడికి దిగితే రష్యాపై విధించాల్సిన కఠినమైన ఆంక్షల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్టు యూరోపియన్ యూనియన్ ప్రకటించింది.
మాక్రాన్ మధ్యవర్తిత్వం
బైడెన్, పుతిన్ తాజా భేటీ ప్రయత్నాలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్యవర్తిత్వం వహించారు. బైడెన్, పుతిన్‌తో ఆయన మాట్లాడారని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. ‘‘అధ్యక్షుల భేటీలో చర్చించాల్సిన అంశాలను అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు గురువారం సమావేశమై ఖరారు చేస్తారు. వీటితో పాటు ఉక్రెయిన్ విషయమై ఇరు దేశాల మధ్య ఇతర స్థాయిల్లో కూడా చర్చలు కొనసాగుతాయి’’ అని వివరించింది. ఈలోగా ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగకూడదన్నదే ఈ చర్చలన్నింటికీ ఏకైక షరతని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment