Tensions Prevention
-
ఉద్రిక్తతలు తగ్గితే మార్కెట్ ర్యాలీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల ఫలితాలపై దేశీ మార్కెట్ల తీరుతెన్నులు ఆధారపడి ఉంటాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సీఐవో ఎస్ నరేన్ తెలిపారు. ఉద్రిక్తతలు తగ్గి, పరిస్థితి సద్దుమణిగితే మార్కెట్లలో ఒక్కసారిగా ర్యాలీకి అవకాశం ఉందని పేర్కొన్నారు. అదే గానీ జరిగితే మార్కెట్ల ఫోకస్ మళ్లీ అమెరికా ఫెడ్ రేట్ల పెంపు తదితర పాత అంశాల పైకి మళ్లుతుందని చెప్పారు. మరో మారు మార్కెట్లో ఒడిదుడుకులకు ఇది దారితీయొచ్చన్నారు. అలా కాకుండా ఉద్రిక్తతలు ఇంకా పెరిగితే, మరింత కరెక్షన్ చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదని నరేన్ వివరించారు. క్రూడాయిల్ ధర భారీగా పెరిగిపోవడం భారత్‌కి ప్రతికూల పరిణామమే కాగలదన్నారు. ‘‘దీర్ఘకాల ఇన్వెస్టర్లు, సిస్టమాటిక్‌గా వచ్చే 12–18 నెలల పాటు పెట్టుబడులు పెట్టేందుకు ప్రస్తుత మార్కెట్ కరెక్షన్ మంచి అవకాశం కాగలదు. దీర్ఘకాలికంగా భారత్ వృద్ధి అవకాశాలు సానుకూలంగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు ఇటు ఈక్విటీ, అటు డెట్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ పద్ధతిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అసెట్ అలోకేషన్‌లో సమతుల్యత ఉండేలా చూసుకోవాలి’’ అని నరేన్ చెప్పారు. మెరుగ్గా లార్జ్ క్యాప్స్ .. ప్రస్తుతం మిడ్, స్మాల్ క్యాప్స్‌తో పోలిస్తే లార్జ్ క్యాప్ స్టాక్స్ మెరుగ్గా ఉన్నట్లుగా కనిపిస్తోందని నరేన్ తెలిపారు. గడిచిన ఆరు నెలల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) .. ప్రతి నెలా దేశీయంగా ఈక్విటీలను నికరంగా విక్రయిస్తూనే ఉన్నారని.. ఇప్పటి వరకూ 15.41 బిలియన్ డాలర్ల ఈక్విటీలను విక్రయించారని ఆయన చెప్పారు. 2008 తర్వాత ఎఫ్‌పీఐలు ఇంత సుదీర్ఘకాలం పాటు అమ్మకాలు జరపడం ఇదే ప్రథమం అని నరేన్ తెలిపారు. సాధారణంగా ఎఫ్‌పీఐలు ఎక్కువగా లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇప్పటి వరకూ భారీ స్థాయిలో అమ్మకాల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రస్తుతం లార్జ్ క్యాప్ స్టాక్స్ మెరుగ్గా కనిపిస్తున్నాయని నరేన్ చెప్పారు. మార్కెట్లలో మధ్యమధ్యలో వచ్చే ఒడిదుడుకుల కారణంగా వచ్చే 2–3 ఏళ్లలో వేల్యూ ఇన్వెస్టింగ్‌కు మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కాబట్టి వేల్యూ స్టాక్స్ ఆధారిత స్కీమ్‌లలో పెట్టుబడులు పెట్టడాన్ని ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చని నరేన్ పేర్కొన్నారు. -
ముడి చమురు మంటలు!
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. ముడి చమురు మంటలకు ఆజ్యం పోశాయి. క్రూడాయిల్ ధరలు ఎకాయెకిన ఏడేళ్ల గరిష్ట స్థాయికి ఎగిశాయి. బ్యారెల్ రేటు 104 డాలర్లపైకి చేరింది. 2014 ఆగస్టు 14 తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే ప్రథమం. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే క్రూడాయిల్ రేటు 150 డాలర్లకు కూడా వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని అంచనాలు నెలకొన్నాయి. రెండేళ్ల క్రితం.. 2020 ఏప్రిల్–డిసెంబర్ మధ్య ముడిచమురు రేటు బ్యారెల్‌కు 39.3 డాలర్లుగా ఉండేది. మరోవైపు, రష్యా నుంచి భారత్‌కు పెద్దగా క్రూడాయిల్ సరఫరాలు లేకపోవడం వల్ల ఈ వివాదం మరింతగా ముదిరినా మనకు సరఫరా పరంగా పెద్ద సమస్యలు ఉండబోవని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా రేట్లు భారీగా ఎగిసినా దేశీయంగా ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్ సంస్థలు .. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను కట్టడి చేస్తుండటంతో ప్రస్తుతానికైతే వినియోగదారులపై పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చని ఆయన వివరించారు. కానీ, ఇదే పరిస్థితి కొనసాగితే ఏదో ఒక దశలో రేట్లు పెరగక తప్పదని పేర్కొన్నారు. ‘రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతల కారణంగా సరఫరా వ్యవస్థలేమీ దెబ్బతినలేదు. మనకు సరఫరా చేసే దేశాలపై ప్రభావమేమీ లేదు. ఉద్రిక్తతలు మరింత ఉధృతమైనా ఈ విషయంలో పెద్దగా మార్పేమీ ఉండదు. అయితే, ప్రస్తుతానికి రిటైల్ ధరలను అదుపులోనే ఉంచినప్పటికీ.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు పెరిగితే ఏదో ఒక దశలో వాటిని పెంచక తప్పకపోవచ్చు‘ అని అధికారి వివరించారు. ధరల మోత భయాలు... సరఫరాపరమైన సమస్యలు లేకపోయినప్పటికీ.. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్త పరిణామాలతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర పెరిగిపోతే ఆ ప్రభావం దేశీయంగా గట్టిగానే కనిపించనుంది. చమురు రిటైల్ రేట్లు పెరిగి .. తత్ఫలితంగా మిగతా ఉత్పత్తుల ధరలు ఆకాశాన్ని అంటుతాయనే భయాలు పెరుగుతున్నాయి. దేశీయంగా ఇంధనాల ధరలు .. అంతర్జాతీయ ఆయిల్ రేట్లకు అనుగుణంగా ప్రతి రోజూ మారుతుంటాయి. ఈ మధ్య కాలంలో అంతర్జాతీయంగా ధర పెరుగుతున్నా.. వివిధ కారణాల రీత్యా రికార్డు స్థాయిలో దేశీయంగా దాదాపు 113 రోజులుగా దేశీయంగా మాత్రం రిటైల్ రేట్లు మారలేదు. బ్యారెల్ 82–83 డాలర్ల రేటు స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ .. ధరలను అదుపులో ఉంచుతున్నాయి. వచ్చే నెల ఎన్నికలు ముగిసిపోతే చాలు ఇక రేట్లకు రెక్కలొస్తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో 2018 మే నెలలో కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇంధన రిటైల్ సంస్థలు అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేటు బ్యారెల్‌కు 5 డాలర్ల పైగా పెరిగినా.. 19 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచలేదు. ఎన్నికలు అలా ముగిశాయో లేదో ప్రతిరోజూ పెంచుకుంటూ పోయాయి. 16 రోజుల వ్యవధిలో పెట్రోల్ రేటు లీటరుకు రూ. 3.8, డీజిల్ రేటు రూ. 3.38 మేర పెరిగిపోయింది. 2020లో పెట్రోల్‌పై లీటరుకు రూ. 10, డీజిల్‌పై రూ. 13 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని పెంచడంతో ఇంధనాల రేట్లు పెరిగిపోయాయి. ప్రజా వ్యతిరేకత భయంతో మధ్యలో ఒకసారి సుంకాన్ని కొంత తగ్గించినప్పటికీ దేశీయంగా రేటు మాత్రం భారీ స్థాయిలోనే కొనసాగుతోంది. మనకు క్రూడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే.. చమురును అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్.. ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. దేశీయంగా క్రూడాయిల్ లభ్యత నామమాత్రమే కావడం వల్ల ఏకంగా 85 శాతం ముడి చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటోంది. దిగుమతి చేసుకున్న ముడిచమురును పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ఉత్పత్తుల కింద మారుస్తారు. భారత్ దిగుమతి చేసుకునే ఆయిల్లో 63.1 శాతం భాగం సౌదీ అరేబియా, ఇరాక్, ఇతర మధ్య ప్రాచ్య దేశాల నుంచి వస్తోంది. ఆ తర్వాత ఆఫ్రికా వాటా 14 శాతం, మరో 13.2 శాతం వాటా ఉత్తర అమెరికా నుంచి ఉంటోంది. భారత్ కొనుగోలు చేసే ఇండియన్ బాస్కెట్ క్రూడాయిల్ రేటు నవంబర్‌లో 80.64 డాలర్లుగా ఉండగా, డిసెంబర్లో 73.30 డాలర్లకు తగ్గింది. జనవరిలో 84.87 డాలర్లకు, అటుపైన ఫిబ్రవరి 16 నాటికి 94.68 డాలర్లకు ఎగిసింది. రష్యా నుంచి చమురు దిగుమతులు నామమాత్రమే.. యూరప్‌లో సహజ వాయువు ఉత్పత్తిలో రష్యాకు మూడో వంతు వాటా ఉంటుంది. అంతర్జాతీయంగా ఆయిల్ ఉత్పత్తిలో దాదాపు 12 శాతం వాటా ఉంటుంది. ప్రపంచ ఇంధన రంగంలో రష్యా ముఖ్య పాత్ర వహిస్తున్నప్పటికీ .. సంక్లిష్టమైన క్రూడాయిల్ రకం, వ్యయాలు తదితర కారణాల రీత్యా ఆ దేశం నుంచి భారత్‌కు చమురు దిగుమతులు నామమాత్రంగానే ఉంటున్నాయి. భారత్ దిగుమతి చేసుకునే చమురులో రష్యా ఆయిల్ పరిమాణం కేవలం ఒక్క శాతం స్థాయిలో ఉంటుంది. 2021లో ఇది 43,400 బ్యారెళ్లుగా ఉంది. అలాగే, గతేడాది రష్యా నుంచి భారత్ 1.8 మిలియన్ టన్నుల బొగ్గు కొనుగోలు చేసింది. ఇది మొత్తం బొగ్గు దిగుమతుల్లో 1.3 శాతం మాత్రమే. ఇవి కాకుండా ఏడాదికి 2.5 మిలియన్ టన్నుల ధ్రువీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ)ని భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఏయే ఉత్పత్తుల ధరలు పెరగవచ్చంటే .. టోకు ధరల సూచీలో క్రూడాయిల్ సంబంధిత ఉత్పత్తుల వాటా తొమ్మిది శాతం పైగా ఉంటుంది. చమురు రేట్లు 10 శాతం మేర పెరిగితే టోకు ద్రవ్యోల్బణం 0.9 శాతం మేర పెరగవచ్చని అంచనా. ఇంధనాల రేట్లు పెరగడం వల్ల రవాణా వ్యయాలు పెరుగుతాయి. ఫలితంగా కూరగాయలు మొదలుకుని తయారీ ఉత్పత్తుల వరకూ అన్నింటి ధరలూ పెరుగుతాయి. క్రూడ్ సంబంధిత ముడిపదార్థాలు వాడే పెయింట్లు, టైర్లు, ఇంజినీరింగ్ ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్, కేబుల్స్ మొదలైన వాటి ధరలూ ఎగుస్తాయి. విద్యుదుత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. మొత్తం మీద చమురు రేట్ల పెరుగుదల, రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతల వల్ల వంట నూనెలు, కిరోసిన్, ఎల్పీజీ, విద్యుత్, గోధుమలు, లోహ ఉత్పత్తుల రేట్లు పెరుగుతాయని పరిశ్రమ వర్గాల అంచనా. ముడిచమురు కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం వల్ల క్రూడాయిల్ రేట్లు పెరిగితే దిగుమతుల బిల్లు, వాణిజ్య లోటు, ద్రవ్య లోటు మొదలైనవి కూడా పెరుగుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో 85.54 బిలియన్ డాలర్ల విలువ చేసే క్రూడాయిల్‌ను భారత్ దిగుమతి చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల వ్యవధితో పోలిస్తే ఇది ఏకంగా 121 శాతం అధికం. ప్రస్తుతం ఇంధన రిటైల్ రేట్లు ఇలా దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సయిజ్ సుంకాలు, వ్యాట్ రేటును తగ్గించిన తర్వాత ప్రస్తుతం అక్కడ పెట్రోల్ రేటు లీటరుకు రూ. 95.41గా, డీజిల్ ధర రూ. 86.67గా ఉంది. 2021 అక్టోబర్ 26 నాటి క్రూడాయిల్ ధర 86.40 (బ్యారెల్‌కు) స్థాయికి ఇది అనుసంధానమై ఉంది. ముడిచమురు రేటు డిసెంబర్లో 68.87 డాలర్లకు పడిపోయినా ఆ తర్వాత నుంచి క్రమంగా పెరగడం మొదలైంది. ఫిబ్రవరిలోనే 12 శాతం పెరిగిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఇప్పటికే ఇంధనాల రేటులో లీటరుకు రూ. 10 పైగా వ్యత్యాసం ఉందని, ఎన్నికల తర్వాత ధరల పెంపుతో ద్రవ్యోల్బణం భారీగా ఎగుస్తుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. మొత్తం మీద చూస్తే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ రేట్లు 18–20 శాతం మేర పెరగవచ్చని అంచనాలు ఉన్నాయి. -
ఉక్రెయిన్ ఉద్రిక్తతలు.. పుతిన్‌తో చర్చలకు బైడెన్ ఓకే
వాషింగ్టన్: యూరప్‌లో యుద్ధ భయాల నడుమ చివరి ఆశగా శాంతి యత్నాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై అమెరికా, రష్యా అధ్యక్షులు జో బైడెన్, వ్లాదిమిర్ పుతిన్ మరోసారి చర్చలు జరిపే సూచనలు కని్పస్తున్నాయి. సంక్షోభాన్ని చల్లార్చేందుకు పుతిన్‌తో భేటీకి బైడెన్ సూత్రప్రాయంగా అంగీకరించారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకీ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలన్నదే ముందునుంచీ తమ వైఖరి అన్నారు. అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు ఆంటోనీ బ్లింకెన్, సెర్గీ లవ్రోవ్ ఈ వారం భేటీ కానున్నారని గుర్తు చేశారు. అయితే ఈ రెండు భేటీలూ ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగని పక్షంలో మాత్రమే జరుగుతాయన్నారు. దీనిపై రష్యా ఆచితూచి స్పందించింది. అధ్యక్షుల సమావేశం జరిగే ఆస్కారముందన్న పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్, ‘‘అయితే అవి ఎప్పుడు, ఎలా జరుగుతాయన్న దానిపై ఈ దశలో మాట్లాడటం తొందరపాటే అవుతుంది’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘‘భేటీ జరగడం మంచిదేనని అధ్యక్షులిద్దరూ భావిస్తేనే జరుగుతుంది. విదేశాంగ మంత్రుల స్థాయిలో చర్చలు కొనసాగించాల్సిన అవసరముందన్న వరకూ మాత్రం ప్రస్తుతానికి స్పష్టత ఉంది’’ అన్నారు. చర్చలకు తామెప్పుడూ సిద్ధమేనని, కాదని యుద్ధానికే దిగితే దీటుగా స్పందించేందుకు రెడీగా ఉన్నామని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ అన్నారు. జోరుగా రష్యా సైనిక విన్యాసాలు రెబెల్స్ ముసుగులో ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యాపైకి కవి్వంపు చర్యలకు దిగి, ఆ సాకుతో దాడి చేయడం పుతిన్ వ్యూహమని అమెరికా ఆరోపిస్తూ వస్తోంది. శనివారం నాటి అణు పరీక్షలకు కొనసాగింపుగా బెలారుస్తో రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు సోమవారమూ పెద్ద ఎత్తున జరిగాయి. తూర్పు ఉక్రెయిన్‌లో కాల్పులు, బాంబుల మోతలు మరింతగా పెరిగాయి. ఇవన్నీ పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీస్తాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. బెలారుస్ సరిహద్దుల నుంచి కేవలం 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా విరుచుకుపడుతుందని నాటో అనుమానిస్తోంది. విన్యాసాల పేరిట 30 వేల దాకా సైన్యాన్ని బెలారుస్‌కు ఇప్పటికే తరలించిందని ఆరోపిస్తోంది. ఉక్రెయిన్‌కు మూడువైపులా మోహరించిన దాదాపు రెండు లక్షల సైన్యం నెమ్మదిగా ముందుకే కదులుతోందని అమెరికా, పశి్చమ దేశాలు ఆరోపిస్తున్నాయి. దాడికి దిగితే రష్యాపై విధించాల్సిన కఠినమైన ఆంక్షల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్టు యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. మాక్రాన్ మధ్యవర్తిత్వం బైడెన్, పుతిన్ తాజా భేటీ ప్రయత్నాలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్యవర్తిత్వం వహించారు. బైడెన్, పుతిన్‌తో ఆయన మాట్లాడారని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. ‘‘అధ్యక్షుల భేటీలో చర్చించాల్సిన అంశాలను అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు గురువారం సమావేశమై ఖరారు చేస్తారు. వీటితో పాటు ఉక్రెయిన్ విషయమై ఇరు దేశాల మధ్య ఇతర స్థాయిల్లో కూడా చర్చలు కొనసాగుతాయి’’ అని వివరించింది. ఈలోగా ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగకూడదన్నదే ఈ చర్చలన్నింటికీ ఏకైక షరతని వెల్లడించింది. -
ఉద్రిక్తతలకు కారణం నాటో పీటముడి?!
ఒకప్పుడు కలిసిఉన్న దేశానికి వ్యతిరేకంగా ఏర్పడిన కూటమిలో చేరాలని ఉక్రెయిన్ ఉబలాటపడుతోంది. ఎలాగైనా ఈ చేరికను అడ్డుకోవాలని రష్యా యత్నిస్తోంది. రష్యాను తిరస్కరించి ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకోవాలని యూఎస్, మిత్రపక్షాలు ఆశపడుతున్నాయి. అసలేంటీ నాటో? ఎందుకు ఇందులో చేరడానికి ఉక్రెయిన్‌కు తొందర? దీనివల్ల రష్యాకు నష్టమేంటి? అమెరికాకు లాభమేంటి? నాటో కూటమే ఉక్రెయిన్ ఉద్రిక్తతలకు కారణమా? ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా లక్షకు పైగా బలగాలను మోహరించింది. పరిస్థితి చూస్తే ఏ క్షణమైనా యుద్ధం కమ్మే సూచనలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ను ఆక్రమించే ఉద్దేశం లేదని రష్యా చెబుతున్నా, అటు పాశ్చాత్య దేశాలు, ఇటు ఉక్రెయిన్ నమ్మడం లేదు. రష్యా, యూఎస్ కూటమికి మధ్య ఈ ఉద్రిక్తతలకు అసలు కారణం నాటో కూటమేనంటున్నారు నిపుణులు. ఉక్రెయిన్ సంక్షోభం సమసిపోవాలంటే నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వకూడదని రష్యా షరతు పెడుతోంది. అయితే యూఎస్ మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. నాటోలో ఉక్రెయిన్ చేరిక అన్ని పక్షాలకు ఎందుకు ఇంత ప్రాధాన్యాంశంగా మారిందంటే నాటో చరిత్రను, ఉక్రెయిన్ ప్రాముఖ్యతను తెలుసుకోవాల్సిందే! ఏంటీ నాటో? రెండో ప్రపంచ యుద్ధానంతరం రష్యాకు వ్యతిరేకంగా అమెరికా, యూకే, ఫ్రాన్స్‌తో పాటు మరో ఎనిమిది యూరోపియన్ యూనియన్ దేశాలు 1949లో నాటో ( ద నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్)ను ఏర్పాటు చేశాయి. అనంతరం అనేక దేశాలు ఈ కూటమిలో చేరుతూ వచ్చాయి. తాజాగా 2020లో ఉత్తరమాసిడోనియా నాటోలో చేరింది. ఈ కూటమి ప్రధాన కార్యాలయం బ్రస్సెల్స్‌లో ఉంది. కేవలం యుద్ధ పరిస్థితులు ఎదురైతే కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు ఈ కూటమి ఏర్పడింది. ఐరాస లాగా ఇతర అభివృద్ధి తదితర కార్యక్రమాల్లో నాటో పాల్గొనదు. నాటోలో చేరిన దేశాలకు మాత్రమే కూటమి రక్షణ ఉంటుంది. కనుక ఒకవేళ రష్యా ఉక్రెయిన్ను ఆక్రమిస్తే, ఉక్రెయిన్ కూటమిలో సభ్యురాలు కాదు కనుక నాటో నేరుగా స్పందించలేదు. అందుకే ఎలాగైనా ఉక్రెయిన్ను కూటమిలో చేర్చుకునేందుకు యూఎస్, మిత్రదేశాలు తొందరపడుతున్నాయి. ఉక్రెయిన్ అవసరాలు 1992 నుంచి నాటోతో ఉక్రెయిన్ సంబంధం కొనసాగుతోంది. 1997లో ఉక్రెయిన్– నాటో కమిషన్ ఏర్పాటైంది. అయితే అధికారికంగా నాటోలో ఇంతవరకు ఉక్రెయిన్ చేరలేదు. రష్యా తమను ప్రత్యేకంగా మిగల్చదని ఉక్రెయిన్ రాజకీయనాయకుల భావన. నాటోలో చేరడం ద్వారా నేరుగా నాటో కూటమి రక్షణ పొందవచ్చని వీరి ఆలోచన. సభ్యదేశాలు కానివాటి రక్షణపై నాటోకు పరిమితులున్నాయి. అందువల్ల రష్యా ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్‌పై దండెత్తితే నాటో స్పందన భిన్నంగా ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా కూటమిలో చేరాలని ఉక్రెయిన్ భావిస్తోంది. అలాగే నాటోలో చేరడం ద్వారా యూరోపియన్ యూనియన్‌లో కూడా సభ్యత్వం పొందవచ్చని ఉక్రెయిన్ నేతల ఆలోచన. దీనివల్ల యూఎస్ తదితర దేశాలతో మరింత బలమైన సంబంధాలు ఏర్పడడంతో పాటు పాశ్చాత్య దేశాల ఆర్థిక అండదండలు లభిస్తాయి. అయితే నాటోలో సభ్యత్వం పొందడం అంత సులువు కాదు. కూటమిలో అన్ని దేశాలు విస్తరణకు ఆమోదం తెలపాలి. నాటోలో కొత్తగా చేరబోయే దేశం మెంబర్షిప్ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలి. 2008లో ఉక్రెయిన్ ఈ ప్లాన్‌కు దరఖాస్తు చేసుకుంది. అయితే 2010లో రష్యా అనుకూల నేత ఉక్రెయిన్ అధిపతి కావడంతో ప్రక్రియ అటకెక్కింది. 2014 క్రిమియా ఆక్రమణ అనంతరం ఉక్రెయిన్‌కు నాటోలో చేరాలన్న కోరిక పెరిగింది. 2017లో నాటో సభ్యత్వం కోసం ఆ దేశం రాజ్యాంగ సవరణ కూడా చేసింది. రష్యా బాధలు నాటో విస్తరణపై రష్యా తీవ్ర అభ్యంతరాలు వెలిబుచ్చుతోంది. ఈ కూటమి విస్తరణ తమకు హాని కలిగిస్తుందని రష్యా వాదన. అలాంటి కూటమిలో తమ సరిహద్దులోని, తమతో ఒకప్పుడు భాగమైన దేశం సభ్యత్వం తీసుకుంటే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని రష్యా నాయకత్వం భావిస్తోంది. అందుకే నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వవద్దని డిమాండ్ చేస్తోంది. యూఎస్, మిత్రదేశాలు ఈ డిమాండ్‌ను తోసిపుచ్చడంతో వాటిపై ఒత్తిడి తెచ్చేందుకు యుద్ధసన్నాహాలు చేస్తోంది. నాటో వద్ద తమ దరఖాస్తు చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి గతేడాది వ్యాఖ్యానించారు. దీంతో అప్రమత్తమైన రష్యా ఈ బంధం బలపడకుండా చూసేందుకు యత్నిస్తోంది. అలాగే నాటోలో చేరబోయే దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి, సరిహద్దు సమస్యలుండకూడదు. అప్పుడే సభ్యదేశాలు నూతన సభ్యత్వాన్ని పరిశీలిస్తాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ సరిహద్దుల్లో బలగాలను మోహరించడం ద్వారా ఉక్రెయిన్ సభ్యత్వ పరిశీలనకు రష్యా అడ్డంపడుతోంది. కోల్డ్‌వార్ టైమ్‌లో కీలకపాత్ర ‘సంయుక్త సంరక్షణ’(కలెక్టివ్ డిఫెన్స్) అనేది నాటో ప్రధాన ఉద్దేశం. అంటే కూటమిలో సభ్యులెవరిపై దాడి జరిగినా కూటమిపై దాడి జరిగినట్లు భావించి ఎదురుదాడి చేస్తారు. నాటో చరిత్రలో ఒక్కసారి మాత్రమే సంయుక్త సంరక్షణ సూత్రాన్ని వాడారు. 2001 అమెరికాపై దాడుల అనంతరం నాటో దేశాల మిలటరీ విమానాలన్నీ యూఎస్ ఆకాశవీధుల్లో కాపలా తిరిగాయి. యూగోస్లోవియా, ఇరాక్, అఫ్గాన్ యుద్ధాల్లో నాటో రాజకీయ కారణాలతో పాల్గొన్నది. రష్యాతో ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో అమెరికా, మిత్రపక్షాలకు నాటో చాలా ఉపయోగపడింది. అయితే రష్యా ప్రభ కోల్పోయి, అమెరికా ఏకైక సూపర్ పవర్‌గా మిగిలిన తర్వాత నాటోకు ప్రాధాన్యం తగ్గింది. ప్రస్తుతం మరలా ఉక్రెయిన్ విషయంలో నాటో గురించి చర్చ ఆరంభమైంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
అమెరికా వర్సెస్ రష్యా: కమ్ముకొంటున్న యుద్ధమేఘాలు!
వాషింగ్టన్: రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. రష్యా మొండి వైఖరిపై అగ్రరాజ్యం అమెరికా కన్నెర్ర చేస్తోంది. ఉక్రెయిన్‌కు అండగా నేరుగా రంగంలోకి దిగుతోంది. పరిస్థితి చెయ్యి దాటితే ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టేందుకు వీలుగా అమెరికా సైన్యాన్ని యూరప్‌నకు తరలించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. నార్త్ కరోలినాలోని ఫోర్ట్‌బ్రాగ్ నుంచి 2,000 మంది సైనికులను పోలాండ్, జర్మనీకి తరలించాలని అధ్యక్షుడు జో బైడెన్ రక్షణ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇప్పటికే జర్మనీలోని విల్సెక్లో ఉన్న 1,000 మందికి పైగా జవాన్లను రొమేనియా తరలించాలని చెప్పారు. వారం రోజుల్లోగా బలగాల తరలింపు పూర్తయ్యే అవకాశం ఉంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్(నాటో)లో భాగస్వామి అయిన రొమేనియా రష్యాకు సమీపంలోనే ఉంది. ఒకవేళ ఉక్రెయిన్‌పై రష్యా దాడికి పాల్పడితే వెంటనే ప్రతిదాడి చేసేలా తమ సైన్యాన్ని సర్వసన్నద్ధంగా ఉంచాలన్నదే బైడెన్ ఆలోచన అని పెంటగాన్ వర్గాలు గురువారం వెల్లడించాయి. తమ సైన్యాన్ని నేరుగా ఉక్రెయిన్‌కు పంపించడం లేదని వైట్‌హౌజ్ మీడియా కార్యదర్శి జెన్‌సాకీ చెప్పారు. 2014లో ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తినప్పటి నుంచి యూరప్ దేశాల్లో తన సైనిక బలగాల సంఖ్యను అమెరికా పెంచుకుంటూనే ఉంది. బోరిస్ జాన్సన్‌కు పుతిన్ ఫోన్ రష్యా సమీపంలోని యూరప్ దేశాలకు అమెరికా సైన్యాన్ని తరలించాలన్న జో బైడెన్ ఆదేశాల పట్ల రష్యా తీవ్రంగా స్పందించింది. అది విధ్వంసకర చర్య అంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఇరువురు నేతల మధ్య చర్చల్లో ఎలాంటి పురోగతి లభించలేదని సమాచారం. ఉక్రెయిన్ సరిహద్దుల్లో లక్ష మంది సైనికులను రష్యా మోహరించడం పట్ల బోరిస్ జాన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా దూకుడును తప్పుపట్టారు. అమెరికా అనాలోచిత చర్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయని రష్యా సీనియర్ అధికారులు ఒకరు వ్యాఖ్యానించారు. సైనికపరంగా ఉద్రిక్తతలకు ఆజ్యం పోసే ప్రయత్నాలను అమెరికా మానుకోవాలని రష్యా విదేశాంగ శాఖ మంత్రి ఉపమంత్రి అలెగ్జాండర్ గ్రుస్కో సూచించారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా నుంచి పోలాండ్‌కు సైన్యాన్ని తరలించాలన్న బైడెన్ నిర్ణయం పట్ల పోలాండ్ రక్షణ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. మిత్ర దేశానికి అండగా... ఉక్రెయిన్‌కు బాసటగా పలు యూరప్ దేశాలు ముందుకొస్తున్నాయి. రొమేనియాకు సైన్యాన్ని పంపాలని ఫ్రాన్స్ సైతం నిర్ణయించింది. డెన్మార్క్ఇప్పటికే ఎఫ్–16 యుద్ధ విమానాలను లిథ్వేనియాకు తరలించింది. స్పెయిన్ 4 ఫైటర్ జెట్లను బల్గేరియాకు, 3 నౌకలను నల్ల సముద్రానికి పంపించింది. ఇక నెదర్లాండ్స్ సైతం 2 ఎఫ్–35 యుద్ధ విమానాలను బల్గేరియాకు తరలించేందుకు సన్నద్ధమవుతోంది. బెలారస్లో రష్యా సైన్యం, ఆయుధాలు ఉక్రెయిన్ చుట్టుపక్కల రష్యా సైనిక బలగాల కదలికల పట్ల ‘నాటో’ సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. బెలారస్‌లోనూ కొన్ని రోజులుగా రష్యా పెద్ద సంఖ్యలో సైన్యాన్ని, ఆయుధాలను మోహరిస్తోందని చెప్పారు. 30 ఏళ్ల క్రితం జరిగిన ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత రష్యా ఈ స్థాయిలో మరోదేశంలో తమ సైన్యాన్ని దింపడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. బెలారస్లో ప్రస్తుతం 30 వేల మంది రష్యా సైనికులు ఉన్నారని, అత్యాధునిక ఫైటర్ జెట్లు, షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్, నేల నుంచి గాల్లోకి ప్రయోగించే ఎస్–400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయని తెలిపారు. యూఎస్ యుద్ధ విమానంలో ఆయుధ సామాగ్రి -
బైడెన్–జిన్‌పింగ్ భేటీకి రంగం సిద్ధం
వాషింగ్టన్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధినేత జీ పిన్‌పింగ్ భేటీకి రంగం సిద్ధమయ్యింది. వారిద్దరూ సోమవారం సాయంత్రం వర్చువల్‌గా సమావేశం కానున్నారు. వీడియో కాల్ ద్వారా ఇరువురు నేతలు మాట్లాడుకోనున్నారు. బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాతో సంబంధాలు క్షీణించాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతలు నివురు గప్పిన నిప్పులా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో బైడెన్, జిన్‌పింగ్ సమావేశం పట్ల సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ భేటీ ద్వారా పెద్దగా ఆశించాల్సింది ఏమీ ఉండదని వైట్‌హౌస్ అధికార వర్గాలు పరోక్షంగా సంకేతాలిస్తున్నాయి. అమెరికా, చైనా ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణకు కలిసి పనిచేసే దిశగా బైడెన్, జిన్‌పింగ్ ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉన్నట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకీ చెప్పారు. అమెరికా ఉద్దేశాలు, ప్రాధాన్యతలను బైడెన్ చైనా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లనున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా ఇరువురు నేతలు మాట్లాడుకుంటుండడం ఇది మూడోసారి. ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు అమెరికా సహకరిస్తుందని తాము ఆశిస్తున్నట్లు చైనా వెల్లడించింది. -
చైనాకు క్వాడ్ పరోక్ష హెచ్చరికలు
వాషింగ్టన్: ఇండో–ఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొల్పడానికి కృషి చేస్తామని క్వాడ్ సదస్సు ప్రతిజ్ఞ చేసింది. వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ప్రాంతంలో అంతర్జాతీయ నిబంధనలు అమలు కావాలని పిలుపునిచ్చింది. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల కూటమి క్వాడ్ సదస్సు శుక్రవారం వైట్‌హౌస్‌లో జరిగింది. తొలిసారిగా నాలుగు దేశాధినేతలు ప్రత్యక్షంగా పాల్గొన్న ఈ సందస్సులో ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో తమ లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇదో అవకాశమని నేతలు చెప్పారు. భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిడె సుగా సదస్సు అనంతరం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో చైనా పట్టు బిగిస్తున్న నేపథ్యంలో క్వాడ్ సదస్సు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ సంయుక్త ప్రకటనలో నేరుగా చైనా పేరు ప్రస్తావించకుండా అంతర్జాతీయ నిబంధనలకు లోబడే ఏ దేశమైనా ప్రవర్తించాలని పేర్కొన్నారు. ‘ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛగా వాణిజ్యం జరగాలి. వివాదాలు శాంతియుతంగా పరిష్కారం కావాలి. దేశాల ప్రజాస్వామ్య విలువలు, ప్రాదేశిక సమగ్రత కాపాడేలా కలసికట్టుగా కృషి చేస్తాం’’అని ఆ సంయుక్త ప్రకటన పేర్కొంది. అక్టోబర్ నుంచి భారత్ వ్యాక్సిన్ ఎగుమతుల్ని పునరుద్ధరించాలన్న నిర్ణయాన్ని క్వాడ్ సదస్సు స్వాగతించింది. పేద దేశాలకు కూడా వ్యాక్సిన్ అందేలా కృషి చేయనున్నాయి. 2022 నాటికల్లా వంద కోట్ల వ్యాక్సిన్లను ఇతర దేశాలకు అందజేయనున్నాయి. ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాణిజ్యం జరగడానికి వీలుగా మౌలిక సదుపాయాల కల్పనలో పరస్పరం సహకరించుకోనున్నాయి. వాతావరణ మార్పుల్ని ఎదుర్కోవడానికి పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని ఒక నిర్ణయానికొచ్చాయి. -
మయన్మార్‌లో బాంబుల వర్షం
-
Myanmar: గ్రామంపై బాంబుల వర్షం
మయన్మార్: మయన్మార్‌లో మిలటరీ, ప్రజల మధ్య జరుగుతున్న పోరు కారణంగా ఉద్రిక్త పరిస్థితులు చెలరేగుతూ ఉండటంతో అది అంతర్యుద్ధానికి దారి తీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మిలటరీ అరాచకాలకు నిరసనగా వేలాదిమంది రోడ్లపైకి వస్తున్నారు. కాగా, కేఎన్‌యూ సాయుధ సంస్థ నియంత్రణలో ఉన్న గ్రామంపై సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రాణాలు పోయినట్లు స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. గ్రామంపై మయన్మార్ ఆర్మీ బాంబుల వర్షం యాంగాన్: మయన్మార్‌లో మిలటరీ కరేన్ నేషనల్ యూనియన్ (కేఎన్‌యూ) సాయుధ సంస్థ నియంత్రణలో ఉన్న గ్రామంపై బాంబుల వర్షం కురిపించింది. మరోవైపు దేశవ్యాప్తంగా నిరసనకారులు ఆదివారం రోడ్లపైకి వచ్చారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిం చాలని నినదించారు. మరోవైపు థాయ్ సరిహద్దుల్లోని గ్రామంపై మయన్మార్ మిలటరీ ప్రతీకార దాడులకు దిగింది. పపూన్ జిల్లాలో ఓ గ్రామంపై వైమానిక దాడులు చేసి బాంబుల వర్షం కురిపించింది. దీంతో గ్రామస్తులు ప్రాణాలరచేతుల్లో పట్టుకొని పరుగులు తీశారు. ఈ దాడిలో పిల్లలు సహా పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఓ సంస్థ వెల్లడించింది. కేఎన్‌యూకి చెందిన కొంతమంది శనివారం ఒక ఆర్మీ బేస్‌పై దాడి చేసి లెఫ్ట్‌నెంట్ కల్నల్ సహా 10 మంది సైనికుల్ని చంపేశారు. ప్రతీకారంగా సైన్యం ఈ దాడి చేసింది. యాంగాన్‌లో రోడ్లపై ప్రజాస్వామ్యవాదులు ఏర్పాటు చేసిన అడ్డంకులు -
యుద్ధానికి సిద్ధంకండి!
వాషింగ్టన్: భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సైన్యాన్ని యుద్ధానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మీకున్న శక్తియుక్తులన్నింటినీ యుద్ధంపైనే నిమగ్నం చేయండని చైనా ఆర్మీతో జిన్‌పింగ్ చెప్పినట్టుగా సీఎన్ఎన్ ఒక కథనాన్ని ప్రచురించింది. గాంగ్‌డాంగ్‌లో మంగళవారం ఒక సైనిక స్థావరాన్ని సందర్శించిన జిన్‌పింగ్ అక్కడ సైనికులతో మాట్లాడుతూ దేశం పట్ల విశ్వసనీయంగా వ్యవహరించండంటూ వారికి హితబోధ చేశారు. ‘‘మీకున్న శక్తిని, మేధస్సుని యుద్ధ వ్యూహ రచనపై కేంద్రీకరించండి. అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండండి. యుద్ధానికి సిద్ధంగా ఉండండి ’’అని జిన్‌పింగ్ చెప్పినట్టుగా సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది. అయితే ఏ దేశంపైన, ఎప్పుడు దండెత్తడానికి జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారన్న దానిపై స్పష్టత లేదు. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌తో ఉద్రిక్తతలు, అగ్రరాజ్యం అమెరికాతో విభేదాలతో పాటుగా దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి సంబంధించి ఇతర దేశాలతో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) నావికాదళ జవాన్లతో జిన్‌పింగ్ మాట్లాడారు. మరోవైపు చైనా మీడియా మాత్రం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మరింత బలోపేతం కావడానికి, సైనికుల్లో ఆత్మ విశ్వాసాన్ని నెలకొల్పడానికి జిన్‌పింగ్ సైనిక స్థావరాన్ని సందర్శించారని చెబుతోంది. ఇప్పటివరకు భారత్, చైనా ఏడు రౌండ్లు చర్చలు జరిగినప్పటికీ ఉద్రిక్తతల నివారణకు చర్యలు అమలు చేయడంలో చైనా వెనుకడుగ వేస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో జిన్‌పింగ్ నోటి వెంట యుద్ధం ప్రస్తావన తేవడం మరింత ఆందోళనని పెంచుతోంది. -
ఉద్రిక్తతలను నివారిద్దాం!
భారత్, పాక్ నిర్ణయం జమ్మూ: భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు, ప్రశాంతత నెలకొల్పడానికి కృషి చేయాలని ఇరు దేశాల సీనియర్ సైనిక అధికారులు నిర్ణయించారు. కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టర్ పరిధిలో చకన్ దా బాగ్‌లో జరిగిన భేటీలో ఇరుదేశాలు ఒక అవగాహనకు వచ్చాయని భారత రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. కాల్పుల ఉల్లంఘన, పౌరులపై దాడులు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు పేర్కొన్నారు. కాల్పులు, మోర్టార్ దాడులతో పాక్ విరుచుకుపడిన 20 రోజుల తర్వాత ఇరుదేశాల బ్రిగేడియర్ స్థాయి అధికారుల మధ్య జరిగిన తొలి భేటీ ఇది. ‘దుశ్చర్యలు ఆపితేనే సత్సంబంధాలు’ సాంబా(కశ్మీర్): భారత్‌తో సత్సంబంధాలు కావాలనుకుంటే ఉగ్రవాదం, సరిహద్దులనుంచి చొరబాట్లు, సరిహద్దుల ఉల్లంఘన వంటి దుశ్చర్యలను నిలిపివేయాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పాకిస్తాన్, చైనాలకు స్పష్టంచేశారు. పొరుగుదేశాలపై ఆక్రమణలకు పాల్పడే ఉద్దేశాలు భారత్‌కు లేవని పేర్కొన్నారు. భారత్ ఇరుగు, పొరుగు దేశాలతో ఎప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటుందని చెప్పారు. సోమవారం ఆయన జమ్మూకశ్మీర్‌లో సరిహద్దులవద్ద కొత్తగా నిర్మించిన ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసుల కేంద్రాన్ని ప్రారంభించి ప్రసంగించారు.