హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల ఫలితాలపై దేశీ మార్కెట్ల తీరుతెన్నులు ఆధారపడి ఉంటాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సీఐవో ఎస్ నరేన్ తెలిపారు. ఉద్రిక్తతలు తగ్గి, పరిస్థితి సద్దుమణిగితే మార్కెట్లలో ఒక్కసారిగా ర్యాలీకి అవకాశం ఉందని పేర్కొన్నారు. అదే గానీ జరిగితే మార్కెట్ల ఫోకస్ మళ్లీ అమెరికా ఫెడ్ రేట్ల పెంపు తదితర పాత అంశాల పైకి మళ్లుతుందని చెప్పారు. మరో మారు మార్కెట్లో ఒడిదుడుకులకు ఇది దారితీయొచ్చన్నారు.
అలా కాకుండా ఉద్రిక్తతలు ఇంకా పెరిగితే, మరింత కరెక్షన్ చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదని నరేన్ వివరించారు. క్రూడాయిల్ ధర భారీగా పెరిగిపోవడం భారత్‌కి ప్రతికూల పరిణామమే కాగలదన్నారు. ‘‘దీర్ఘకాల ఇన్వెస్టర్లు, సిస్టమాటిక్‌గా వచ్చే 12–18 నెలల పాటు పెట్టుబడులు పెట్టేందుకు ప్రస్తుత మార్కెట్ కరెక్షన్ మంచి అవకాశం కాగలదు. దీర్ఘకాలికంగా భారత్ వృద్ధి అవకాశాలు సానుకూలంగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు ఇటు ఈక్విటీ, అటు డెట్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ పద్ధతిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అసెట్ అలోకేషన్‌లో సమతుల్యత ఉండేలా చూసుకోవాలి’’ అని నరేన్ చెప్పారు.
మెరుగ్గా లార్జ్ క్యాప్స్ ..
ప్రస్తుతం మిడ్, స్మాల్ క్యాప్స్‌తో పోలిస్తే లార్జ్ క్యాప్ స్టాక్స్ మెరుగ్గా ఉన్నట్లుగా కనిపిస్తోందని నరేన్ తెలిపారు. గడిచిన ఆరు నెలల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) .. ప్రతి నెలా దేశీయంగా ఈక్విటీలను నికరంగా విక్రయిస్తూనే ఉన్నారని.. ఇప్పటి వరకూ 15.41 బిలియన్ డాలర్ల ఈక్విటీలను విక్రయించారని ఆయన చెప్పారు. 2008 తర్వాత ఎఫ్‌పీఐలు ఇంత సుదీర్ఘకాలం పాటు అమ్మకాలు జరపడం ఇదే ప్రథమం అని నరేన్ తెలిపారు. సాధారణంగా ఎఫ్‌పీఐలు ఎక్కువగా లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి.
ఇప్పటి వరకూ భారీ స్థాయిలో అమ్మకాల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రస్తుతం లార్జ్ క్యాప్ స్టాక్స్ మెరుగ్గా కనిపిస్తున్నాయని నరేన్ చెప్పారు. మార్కెట్లలో మధ్యమధ్యలో వచ్చే ఒడిదుడుకుల కారణంగా వచ్చే 2–3 ఏళ్లలో వేల్యూ ఇన్వెస్టింగ్‌కు మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కాబట్టి వేల్యూ స్టాక్స్ ఆధారిత స్కీమ్‌లలో పెట్టుబడులు పెట్టడాన్ని ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చని నరేన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment