వాషింగ్టన్: రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. రష్యా మొండి వైఖరిపై అగ్రరాజ్యం అమెరికా కన్నెర్ర చేస్తోంది. ఉక్రెయిన్‌కు అండగా నేరుగా రంగంలోకి దిగుతోంది. పరిస్థితి చెయ్యి దాటితే ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టేందుకు వీలుగా అమెరికా సైన్యాన్ని యూరప్‌నకు తరలించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. నార్త్ కరోలినాలోని ఫోర్ట్‌బ్రాగ్ నుంచి 2,000 మంది సైనికులను పోలాండ్, జర్మనీకి తరలించాలని అధ్యక్షుడు జో బైడెన్ రక్షణ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇప్పటికే జర్మనీలోని విల్‌సెక్‌లో ఉన్న 1,000 మందికి పైగా జవాన్లను రొమేనియా తరలించాలని చెప్పారు.
వారం రోజుల్లోగా బలగాల తరలింపు పూర్తయ్యే అవకాశం ఉంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్(నాటో)లో భాగస్వామి అయిన రొమేనియా రష్యాకు సమీపంలోనే ఉంది. ఒకవేళ ఉక్రెయిన్‌పై రష్యా దాడికి పాల్పడితే వెంటనే ప్రతిదాడి చేసేలా తమ సైన్యాన్ని సర్వసన్నద్ధంగా ఉంచాలన్నదే బైడెన్ ఆలోచన అని పెంటగాన్ వర్గాలు గురువారం వెల్లడించాయి. తమ సైన్యాన్ని నేరుగా ఉక్రెయిన్‌కు పంపించడం లేదని వైట్‌హౌజ్ మీడియా కార్యదర్శి జెన్‌సాకీ చెప్పారు. 2014లో ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తినప్పటి నుంచి యూరప్ దేశాల్లో తన సైనిక బలగాల సంఖ్యను అమెరికా పెంచుకుంటూనే ఉంది.
బోరిస్ జాన్సన్‌కు పుతిన్ ఫోన్
రష్యా సమీపంలోని యూరప్ దేశాలకు అమెరికా సైన్యాన్ని తరలించాలన్న జో బైడెన్ ఆదేశాల పట్ల రష్యా తీవ్రంగా స్పందించింది. అది విధ్వంసకర చర్య అంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇరువురు నేతల మధ్య చర్చల్లో ఎలాంటి పురోగతి లభించలేదని సమాచారం. ఉక్రెయిన్ సరిహద్దుల్లో లక్ష మంది సైనికులను రష్యా మోహరించడం పట్ల బోరిస్ జాన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు.
రష్యా దూకుడును తప్పుపట్టారు. అమెరికా అనాలోచిత చర్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయని రష్యా సీనియర్ అధికారులు ఒకరు వ్యాఖ్యానించారు. సైనికపరంగా ఉద్రిక్తతలకు ఆజ్యం పోసే ప్రయత్నాలను అమెరికా మానుకోవాలని రష్యా విదేశాంగ శాఖ మంత్రి ఉపమంత్రి అలెగ్జాండర్ గ్రుస్కో సూచించారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా నుంచి పోలాండ్‌కు సైన్యాన్ని తరలించాలన్న బైడెన్ నిర్ణయం పట్ల పోలాండ్ రక్షణ మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
మిత్ర దేశానికి అండగా...
ఉక్రెయిన్‌కు బాసటగా పలు యూరప్ దేశాలు ముందుకొస్తున్నాయి. రొమేనియాకు సైన్యాన్ని పంపాలని ఫ్రాన్స్ సైతం నిర్ణయించింది. డెన్మార్క్‌ఇప్పటికే ఎఫ్–16 యుద్ధ విమానాలను లిథ్వేనియాకు తరలించింది. స్పెయిన్ 4 ఫైటర్ జెట్లను బల్గేరియాకు, 3 నౌకలను నల్ల సముద్రానికి పంపించింది. ఇక నెదర్లాండ్స్ సైతం 2 ఎఫ్–35 యుద్ధ విమానాలను బల్గేరియాకు తరలించేందుకు సన్నద్ధమవుతోంది.
బెలారస్‌లో రష్యా సైన్యం, ఆయుధాలు
ఉక్రెయిన్ చుట్టుపక్కల రష్యా సైనిక బలగాల కదలికల పట్ల ‘నాటో’ సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. బెలారస్‌లోనూ కొన్ని రోజులుగా రష్యా పెద్ద సంఖ్యలో సైన్యాన్ని, ఆయుధాలను మోహరిస్తోందని చెప్పారు. 30 ఏళ్ల క్రితం జరిగిన ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత రష్యా ఈ స్థాయిలో మరోదేశంలో తమ సైన్యాన్ని దింపడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. బెలారస్‌లో ప్రస్తుతం 30 వేల మంది రష్యా సైనికులు ఉన్నారని, అత్యాధునిక ఫైటర్ జెట్లు, షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్, నేల నుంచి గాల్లోకి ప్రయోగించే ఎస్–400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయని తెలిపారు.
యూఎస్ యుద్ధ విమానంలో ఆయుధ సామాగ్రి
Comments
Please login to add a commentAdd a comment