![NO NATO membership, NO return to pre 2014 borders says US defence secretary](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/pate-h.jpg.webp?itok=Seh_UdE9)
ఆ దేశం చర్చలు, శాంతి ఒప్పందానికి సిద్ధపడాలి
రష్యా స్వాధీనమైన భూభాగం తిరిగి రాదు
అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్ సంచలన వ్యాఖ్యలు
బ్రస్సెల్స్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని వెంటనే ఆపుతానంటూ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఆ దిశగా స్పష్టమైన సంకేతాలిస్తున్నారు. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మొదటిసారిగా బుధవారం నాటో ప్రధాన కార్యాలయంలో ‘ఉక్రెయిన్ డిఫెన్స్ కాంటాక్ట్ గ్రూప్’సమావేశంలో ఇందుకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం అసాధ్యమన్నారు. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వంతో శాంతి ఒప్పందం కార్యరూపం దాలుస్తుందనే విశ్వాసం తనకు లేదన్నారు. అంతర్జాతీయ బలగాల దన్నుతో ఆ దేశం రష్యాతో చర్చలకు, శాంతి ఒప్పందానికి సిద్ధ పడాలని సూచించారు.
అంతేకాదు, 2014 తర్వాత రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాలను వదులు కోవాల న్నారు. ట్రంప్ ప్రభుత్వం ఉక్రెయిన్‌కు ఏ మేరకు సైనిక, ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధంగా ఉందో తెలుసుకోవాలనుకున్న నాటో దేశాలకు ఈ వ్యాఖ్యలు మింగుడు పడటం లేదు. అంతేకాదు, ఉక్రెయిన్ రక్షణ, ఆర్థిక, సైనిక పరమైన అంశాలను ఇకపై యూరప్ దేశాలే చూసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారని కూడా హెగ్సెత్ బాంబు పేల్చారు. ఒక వేళ శాంతి పరిరక్షక బలగాల అవసరముంటే అందులో అమెరికా బలగాల పాత్ర ఉండబోదని కూడా తేల్చేశారు.
ఈ బలగాలతో రష్యా ఆర్మీకి ఘర్షణ తలెత్తే సందర్భాల్లో అమెరికా లేదా నాటో దేశాల నుంచి ఎటువంటి రక్షణలు కల్పించలేమన్నారు. ఉక్రెయిన్ కోరుతున్న భూభాగంలో కొంత ప్రాంతాన్ని రష్యా ఉంచుకుంటుందన్నారు. ‘ బదులుగా సమర్థమైన యూరప్, లేదా నాన్ యూరప్ బలగాలతో భద్రత కల్పించడం మంచిది. ఏదేమైనా, ఎలాంటి భద్రతా ఒప్పందం కుదిరినా ఉక్రెయిన్‌లో అమెరికా బలగాలను మోహరించబోం.
ఉక్రెయిన్‌లో భవిష్యత్తులో చేపట్టే ఎలాంటి మిలటరీ మిషన్‌కైనా నాటోకు, సభ్య దేశాలకు ఎలాంటి పాత్రా ఉండదు. నాటోలోని ఏ దేశంపై దాడి జరిగినా మిగతా దేశాలన్నీ రక్షణగా నిలవాలన్న ప్రాథమిక సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. ఉక్రెయిన్‌కు భవిష్యత్తులో అవసరమయ్యే సైనిక, ఇతరత్రా సాయంలో ఎక్కువ భాగాన్ని యూరప్ దేశాలే చూసుకోవాల్సి ఉంటుంది’అని కుండబద్దలు కొట్టారు. అయితే, హెగ్సెత్ చెప్పిన అంశాలు త్వరలోనే మూనిక్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా ఇతర అధికారులతో జరిగే సదస్సులో జరిగే చర్చలను మరింత సంక్లిష్టంగా మారు స్తాయని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment