ముడి చమురు మంటలు! | Oil hits seven-year high but shares rebound on Russia war | Sakshi
Sakshi News home page

ముడి చమురు మంటలు!

Published Fri, Feb 25 2022 6:09 AM | Last Updated on Fri, Feb 25 2022 9:50 AM

Oil hits seven-year high but shares rebound on Russia war - Sakshi

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. ముడి చమురు మంటలకు ఆజ్యం పోశాయి. క్రూడాయిల్‌ ధరలు ఎకాయెకిన ఏడేళ్ల గరిష్ట స్థాయికి ఎగిశాయి. బ్యారెల్‌ రేటు 104 డాలర్లపైకి చేరింది. 2014 ఆగస్టు 14 తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే ప్రథమం. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే క్రూడాయిల్‌ రేటు 150 డాలర్లకు కూడా వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని అంచనాలు నెలకొన్నాయి. రెండేళ్ల క్రితం.. 2020 ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య ముడిచమురు రేటు బ్యారెల్‌కు 39.3 డాలర్లుగా ఉండేది.  మరోవైపు, రష్యా నుంచి భారత్‌కు పెద్దగా క్రూడాయిల్‌ సరఫరాలు లేకపోవడం వల్ల ఈ వివాదం మరింతగా ముదిరినా మనకు సరఫరా పరంగా పెద్ద సమస్యలు ఉండబోవని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయంగా రేట్లు భారీగా ఎగిసినా దేశీయంగా ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్‌ సంస్థలు .. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ ధరలను కట్టడి చేస్తుండటంతో ప్రస్తుతానికైతే వినియోగదారులపై పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చని ఆయన వివరించారు. కానీ, ఇదే పరిస్థితి కొనసాగితే ఏదో ఒక దశలో రేట్లు పెరగక తప్పదని పేర్కొన్నారు. ‘రష్యా–ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల కారణంగా సరఫరా వ్యవస్థలేమీ దెబ్బతినలేదు. మనకు సరఫరా చేసే దేశాలపై ప్రభావమేమీ లేదు. ఉద్రిక్తతలు మరింత ఉధృతమైనా ఈ విషయంలో పెద్దగా మార్పేమీ ఉండదు. అయితే, ప్రస్తుతానికి రిటైల్‌ ధరలను అదుపులోనే ఉంచినప్పటికీ.. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ రేట్లు పెరిగితే ఏదో ఒక దశలో వాటిని పెంచక తప్పకపోవచ్చు‘ అని అధికారి వివరించారు.  

ధరల మోత భయాలు...
సరఫరాపరమైన సమస్యలు లేకపోయినప్పటికీ.. రష్యా–ఉక్రెయిన్‌ ఉద్రిక్త పరిణామాలతో అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధర పెరిగిపోతే ఆ ప్రభావం దేశీయంగా గట్టిగానే కనిపించనుంది. చమురు రిటైల్‌ రేట్లు పెరిగి .. తత్ఫలితంగా మిగతా ఉత్పత్తుల ధరలు ఆకాశాన్ని అంటుతాయనే భయాలు పెరుగుతున్నాయి. దేశీయంగా ఇంధనాల ధరలు .. అంతర్జాతీయ ఆయిల్‌ రేట్లకు అనుగుణంగా ప్రతి రోజూ మారుతుంటాయి. ఈ మధ్య కాలంలో అంతర్జాతీయంగా ధర పెరుగుతున్నా.. వివిధ కారణాల రీత్యా రికార్డు స్థాయిలో దేశీయంగా దాదాపు 113 రోజులుగా దేశీయంగా మాత్రం రిటైల్‌ రేట్లు మారలేదు. బ్యారెల్‌ 82–83 డాలర్ల రేటు స్థాయిలోనే కొనసాగుతున్నాయి.

ఉత్తర్‌ ప్రదేశ్, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌ .. ధరలను అదుపులో ఉంచుతున్నాయి. వచ్చే నెల ఎన్నికలు ముగిసిపోతే చాలు ఇక రేట్లకు రెక్కలొస్తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  గతంలో 2018 మే నెలలో కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇంధన రిటైల్‌ సంస్థలు అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ రేటు బ్యారెల్‌కు 5 డాలర్ల పైగా పెరిగినా.. 19 రోజుల పాటు పెట్రోల్, డీజిల్‌ రేట్లను పెంచలేదు. ఎన్నికలు అలా ముగిశాయో లేదో ప్రతిరోజూ పెంచుకుంటూ పోయాయి. 16 రోజుల వ్యవధిలో పెట్రోల్‌ రేటు లీటరుకు రూ. 3.8, డీజిల్‌ రేటు రూ. 3.38 మేర పెరిగిపోయింది. 2020లో పెట్రోల్‌పై లీటరుకు రూ. 10, డీజిల్‌పై రూ. 13 చొప్పున ఎక్సైజ్‌ డ్యూటీని పెంచడంతో ఇంధనాల రేట్లు పెరిగిపోయాయి. ప్రజా వ్యతిరేకత భయంతో మధ్యలో ఒకసారి సుంకాన్ని కొంత తగ్గించినప్పటికీ దేశీయంగా రేటు మాత్రం భారీ స్థాయిలోనే కొనసాగుతోంది.  

మనకు క్రూడ్‌ ఎక్కడి నుంచి వస్తుందంటే..
చమురును అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్‌.. ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. దేశీయంగా క్రూడాయిల్‌ లభ్యత నామమాత్రమే కావడం వల్ల ఏకంగా 85 శాతం ముడి చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటోంది. దిగుమతి చేసుకున్న ముడిచమురును పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ ఉత్పత్తుల కింద మారుస్తారు. భారత్‌ దిగుమతి చేసుకునే ఆయిల్లో 63.1 శాతం భాగం సౌదీ అరేబియా, ఇరాక్, ఇతర మధ్య ప్రాచ్య దేశాల నుంచి వస్తోంది. ఆ తర్వాత ఆఫ్రికా వాటా 14 శాతం, మరో 13.2 శాతం వాటా ఉత్తర అమెరికా నుంచి ఉంటోంది. భారత్‌ కొనుగోలు చేసే ఇండియన్‌ బాస్కెట్‌ క్రూడాయిల్‌ రేటు నవంబర్‌లో 80.64 డాలర్లుగా ఉండగా, డిసెంబర్‌లో 73.30 డాలర్లకు తగ్గింది. జనవరిలో 84.87 డాలర్లకు, అటుపైన ఫిబ్రవరి 16 నాటికి 94.68 డాలర్లకు ఎగిసింది.  

రష్యా నుంచి చమురు దిగుమతులు నామమాత్రమే..
యూరప్‌లో సహజ వాయువు ఉత్పత్తిలో రష్యాకు మూడో వంతు వాటా ఉంటుంది. అంతర్జాతీయంగా ఆయిల్‌ ఉత్పత్తిలో దాదాపు 12 శాతం వాటా ఉంటుంది. ప్రపంచ ఇంధన రంగంలో రష్యా ముఖ్య పాత్ర వహిస్తున్నప్పటికీ  .. సంక్లిష్టమైన క్రూడాయిల్‌ రకం, వ్యయాలు తదితర కారణాల రీత్యా ఆ దేశం నుంచి భారత్‌కు చమురు దిగుమతులు నామమాత్రంగానే ఉంటున్నాయి. భారత్‌ దిగుమతి చేసుకునే చమురులో రష్యా ఆయిల్‌ పరిమాణం కేవలం ఒక్క శాతం స్థాయిలో ఉంటుంది. 2021లో ఇది 43,400 బ్యారెళ్లుగా ఉంది. అలాగే, గతేడాది రష్యా నుంచి భారత్‌ 1.8 మిలియన్‌ టన్నుల బొగ్గు కొనుగోలు చేసింది. ఇది మొత్తం బొగ్గు దిగుమతుల్లో 1.3 శాతం మాత్రమే. ఇవి కాకుండా ఏడాదికి 2.5 మిలియన్‌ టన్నుల ధ్రువీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ)ని భారత్‌ దిగుమతి చేసుకుంటోంది.  

ఏయే ఉత్పత్తుల ధరలు పెరగవచ్చంటే ..  
టోకు ధరల సూచీలో క్రూడాయిల్‌ సంబంధిత ఉత్పత్తుల వాటా తొమ్మిది శాతం పైగా ఉంటుంది. చమురు రేట్లు 10 శాతం మేర పెరిగితే టోకు ద్రవ్యోల్బణం 0.9 శాతం మేర పెరగవచ్చని అంచనా. ఇంధనాల రేట్లు పెరగడం వల్ల రవాణా వ్యయాలు పెరుగుతాయి. ఫలితంగా కూరగాయలు మొదలుకుని తయారీ ఉత్పత్తుల వరకూ అన్నింటి ధరలూ పెరుగుతాయి. క్రూడ్‌ సంబంధిత ముడిపదార్థాలు వాడే పెయింట్లు, టైర్లు, ఇంజినీరింగ్‌ ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్, కేబుల్స్‌ మొదలైన వాటి ధరలూ ఎగుస్తాయి. విద్యుదుత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. మొత్తం మీద చమురు రేట్ల పెరుగుదల, రష్యా–ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల వల్ల వంట నూనెలు, కిరోసిన్, ఎల్‌పీజీ, విద్యుత్, గోధుమలు, లోహ ఉత్పత్తుల రేట్లు పెరుగుతాయని పరిశ్రమ వర్గాల అంచనా. ముడిచమురు కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం వల్ల క్రూడాయిల్‌ రేట్లు పెరిగితే దిగుమతుల బిల్లు, వాణిజ్య లోటు, ద్రవ్య లోటు మొదలైనవి కూడా పెరుగుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో 85.54 బిలియన్‌ డాలర్ల విలువ చేసే క్రూడాయిల్‌ను భారత్‌ దిగుమతి చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల వ్యవధితో పోలిస్తే ఇది ఏకంగా 121 శాతం అధికం.  

ప్రస్తుతం ఇంధన రిటైల్‌ రేట్లు ఇలా
దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సయిజ్‌ సుంకాలు, వ్యాట్‌ రేటును తగ్గించిన తర్వాత ప్రస్తుతం అక్కడ పెట్రోల్‌ రేటు లీటరుకు రూ. 95.41గా, డీజిల్‌ ధర రూ. 86.67గా ఉంది. 2021 అక్టోబర్‌ 26 నాటి క్రూడాయిల్‌ ధర 86.40 (బ్యారెల్‌కు) స్థాయికి ఇది అనుసంధానమై ఉంది. ముడిచమురు రేటు డిసెంబర్‌లో 68.87 డాలర్లకు పడిపోయినా ఆ తర్వాత నుంచి క్రమంగా పెరగడం మొదలైంది. ఫిబ్రవరిలోనే 12 శాతం పెరిగిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఇప్పటికే ఇంధనాల రేటులో లీటరుకు రూ. 10 పైగా వ్యత్యాసం ఉందని, ఎన్నికల తర్వాత ధరల పెంపుతో ద్రవ్యోల్బణం భారీగా ఎగుస్తుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. మొత్తం మీద చూస్తే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్‌ రేట్లు 18–20 శాతం మేర పెరగవచ్చని అంచనాలు ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement