వాషింగ్టన్: భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సైన్యాన్ని యుద్ధానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మీకున్న శక్తియుక్తులన్నింటినీ యుద్ధంపైనే నిమగ్నం చేయండని చైనా ఆర్మీతో జిన్‌పింగ్ చెప్పినట్టుగా సీఎన్‌ఎన్ ఒక కథనాన్ని ప్రచురించింది. గాంగ్‌డాంగ్‌లో మంగళవారం ఒక సైనిక స్థావరాన్ని సందర్శించిన జిన్‌పింగ్ అక్కడ సైనికులతో మాట్లాడుతూ దేశం పట్ల విశ్వసనీయంగా వ్యవహరించండంటూ వారికి హితబోధ చేశారు.
‘‘మీకున్న శక్తిని, మేధస్సుని యుద్ధ వ్యూహ రచనపై కేంద్రీకరించండి. అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండండి. యుద్ధానికి సిద్ధంగా ఉండండి ’’అని జిన్‌పింగ్ చెప్పినట్టుగా సీఎన్‌ఎన్ తన కథనంలో పేర్కొంది. అయితే ఏ దేశంపైన, ఎప్పుడు దండెత్తడానికి జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారన్న దానిపై స్పష్టత లేదు. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌తో ఉద్రిక్తతలు, అగ్రరాజ్యం అమెరికాతో విభేదాలతో పాటుగా దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి సంబంధించి ఇతర దేశాలతో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) నావికాదళ జవాన్లతో జిన్‌పింగ్ మాట్లాడారు. మరోవైపు చైనా మీడియా మాత్రం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మరింత బలోపేతం కావడానికి, సైనికుల్లో ఆత్మ విశ్వాసాన్ని నెలకొల్పడానికి జిన్‌పింగ్ సైనిక స్థావరాన్ని సందర్శించారని చెబుతోంది. ఇప్పటివరకు భారత్, చైనా ఏడు రౌండ్లు చర్చలు జరిగినప్పటికీ ఉద్రిక్తతల నివారణకు చర్యలు అమలు చేయడంలో చైనా వెనుకడుగ వేస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో జిన్‌పింగ్ నోటి వెంట యుద్ధం ప్రస్తావన తేవడం మరింత ఆందోళనని పెంచుతోంది.
Comments
Please login to add a commentAdd a comment