t
-
16న శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని పర్యటన
సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో పర్యటించనున్నారు. ఆరోజు మధ్యాహ్నం ప్రధాని పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్‌ను సందర్శిస్తారు. అనంతరం జరిగే సభలో పాల్గొంటారు. ప్రధాని పర్యటనకు ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి శనివారం అధికారులతో సమీక్షించారు. ప్రధాన మంత్రి పర్యటనలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. ప్రధాని పర్యటనకు పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని డీజీపీకి చెప్పారు. భద్రత, రవాణా, వసతి, వైద్యసేవలు వంటివి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి జిల్లా యంత్రాంగం తరఫున పాస్‌లు జారీ చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. ఈ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తొలుత జీఏడీ ముఖ్య కార్యదర్శి ఆర్.ముత్యాలరాజు శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ఎస్ఐబీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్, ఐ అండ్ పీఆర్ జేడీ పి.కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు, ఎస్పీ మాధవరెడ్డి, ప్రొటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, డీఎంఈ డాక్టర్ నరసింహం, ఐ అండ్ పీఆర్ జేడీ కస్తూరి, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ డి.మురళి వర్చువల్‌గా హాజరయ్యారు. ప్రధాని పర్యటన ఇలా 16న మధ్యాహ్నం ప్రధాని మోదీ పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్‌లోని యాంటీక్యూస్ స్మగ్లింగ్ స్టడీ సెంటర్‌ను, నార్కోటిక్స్ స్టడీ సెంటర్‌ను సందర్శిస్తారు. తర్వాత వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఎక్స్– రే, బ్యాగేజ్ స్క్రీనింగ్ కేంద్రాన్ని సందర్శిస్తారు. తదుపరి అకాడమీ బ్లాకు వద్ద రుద్రాక్ష మొక్కలు నాటి, అక్కడ భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడతారు. వారితో గ్రూప్ ఫొటో దిగుతారు. అనంతరం 74, 75వ బ్యాచ్‌ల ఆఫీసర్ ట్రైనీలతో ముఖాముఖిలో పాల్గొంటారు. తదుపరి పబ్లిక్ ఫంక్షన్లో ‘ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం అకాడమీ కేంద్రానికి అక్రెడిటేషన్ సర్టిఫికెట్‌ను అందిస్తారు. ఆ తర్వాత జరిగే సభలో ప్రసంగించిన అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళతారు. -
ముకేశ్ అంబానీకి బెదిరింపులు
ముంబై: కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఇందుకు సంబంధించి అంబానీ సంస్థకు చెందిన ఓ ఈ–మొయిల్ ఐడీకి శుక్రవారం మెయిల్ వచ్చింది. ‘మా దగ్గర మంచి షూటర్లు ఉన్నారు. రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం’అని ఆ మెయిల్ సారాంశం. దీంతో, ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్చార్జ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి నుంచి ఆ మెయిల్ వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నారు. గత ఏడాది సైతం ముకేశ్ కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. 2022 ఓ వ్యక్తి రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న హర్‌కిసాన్‌దాస్ ఆస్పత్రికి ఫోన్ చేసి ‘ఆసుపత్రిని పేల్చేస్తాం. అంబానీ కుటుంబాన్ని చంపేస్తాం’అని బెదిరించాడు. 2021లో ముంబైలోని అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం తీవ్ర కలకలం సృష్టించిన విషయం విదితమే. -
Teesta Setalvad: తీస్తా బెయిల్ పొడిగింపు
న్యూఢిల్లీ: 2002 గోధ్రా అనంతర అల్లర్ల కేసులో హక్కుల కార్యకర్త తీస్తా సీతల్వాద్ బెయిల్‌ను జూలై 19 దాకా సుప్రీంకోర్టు పొడిగించింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, ఎ.ఎస్.»ొపన్న, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం బుధవారం ఈ మేరకు నిర్ణం వెలువరించింది. పిటిషనర్ మహిళ గనుక గుజరాత్ హైకోర్టే బెయిల్ రూపంలో ఆమెకు ఎంతో కొంత రక్షణ కల్పించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను జూలై 19కి వాయిదా వేసింది. సీతల్వాద్‌కు జూలై 1న సుప్రీంకోర్టు వారం పాటు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. -
లక్నో కోర్టు ఆవరణలో గ్యాంగ్‌స్టర్ హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సివిల్ కోర్టు ఆవరణలో పట్టపగలే దారుణం జరిగింది. గ్యాంగ్‌స్టర్ సంజీవ్ మహేశ్వరి జీవా దారుణ హత్యకు గురయ్యాడు. లాయర్ దుస్తుల్లో వచ్చిన షూటర్లు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనలో ఒక పోలీసు, ఓ మైనర్ బాలిక గాయపడ్డారని, నిందితుడిని అక్కడికక్కడే పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ క్రిమినల్ కేసులో జీవాను కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకొచ్చిన సమయంలో ఈ ఘటన జరిగిందని లక్నో పోలీస్ కమిషనర్ ఎస్బీ శిరాద్కర్ తెలిపారు. కాల్పులు అనంతరం కోర్టు ఆవరణలో పోలీసులను భారీగా మోహరించారు. గాయపడిన కానిస్టేబుల్, బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా, కానిస్టేబుల్ ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. వివాదాస్పద నేత ముక్తార్ అన్సారీకి అనుచరుడైన జీవా (48) ముజఫర్‌నగర్ జిల్లా వాసి. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌రాయ్, మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బ్రహ్మ్ దత్తా ద్వివేది హత్య కేసులో నిందితుడు. మరో 24 కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. 1997 ఫిబ్రవరిలో ఫరూఖాబాద్ జిల్లాలో ద్వివేది హత్యకు గురయ్యాడు. ద్వివేదితోపాటు అతని గన్‌మెన్ హత్య కేసులో ట్రయల్‌కోర్టు జీవాను దోషిగా నిర్ధారించింది. జీవిత ఖైదు విధించింది. కోర్టు ఆవరణలోనే కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులకు వ్యతిరేకంగా న్యాయవాదులు ఆందోళనకు దిగారు. శాంతిభద్రతల పరిరక్షణలో, భద్రతా ఏర్పాట్లో్ల విఫలమయ్యాయని ఆరోపించారు. -
కేఎస్‌బీఎల్, ప్రమోటర్లపై ఏడేళ్ల నిషేధం..
న్యూఢిల్లీ: క్లయింట్ల నిధులను దుర్వినియోగం చేసిన కేసులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్), దాని ప్రమోటర్ కొమండూర్ పార్థసారథి ఏడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లో లావాదేవీలు జరపకుండా సెబీ నిషేధించింది. కేఎస్‌బీఎల్‌కు రూ. 13 కోట్లు, పార్థసారథికి రూ. 8 కోట్లు జరిమానా కూడా విధించింది. అలాగే పార్థసారథి ఏ లిస్టెడ్ కంపెనీలోనూ కీలక మేనేజర్ హోదాల్లో పని చేయకుండా పదేళ్ల పాటు నిషేధించింది. కేఎస్‌బీఎల్‌కు చెందిన మరో ఇద్దరు డైరెక్టర్లయిన భగవాన్ దాస్ నారంగ్, జ్యోతి ప్రసాద్‌లకు ఇది రెండేళ్ల పాటు వర్తిస్తుంది. అటు కేఎస్‌బీఎల్ నుంచి తీసుకున్న రూ. 1,443 కోట్ల మొత్తాన్ని మూడు నెలల్లోగా వాపసు చేయాలంటూ కార్వీ రియల్టీ, కార్వీ క్యాపిటల్‌ను సెబీ ఆదేశించింది. లేని పక్షంలో ఆ మొత్తాన్ని రాబట్టేందుకు రెండు సంస్థల ఆస్తులను ఎన్ఎస్ఈ తన అధీనంలోకి తీసుకుంటుందని సెబీ స్పష్టం చేసింది. క్లయింట్లు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీలను దుర్వినియోగం చేసి వారి షేర్లను తనఖా పెట్టి, కార్వీ సొంత అవసరాల కోసం నిధులను సమీకరించిందని ఆరోపణలు ఉన్నాయి. కేఐఎస్ఎల్పై ఆంక్షలు: నిబంధనల ఉల్లంఘన కేసులో కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా కార్వీ ఇన్వెస్టర్ సర్వీసెస్ (కేఐఎస్‌ఎల్)పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వర్తిస్తుందని పేర్కొంది. 2021–22 మధ్య కాలంలో డెట్ సెక్యూరిటీల పబ్లిక్ ఇష్యూలకు సంబంధించి కంపెనీ పలు నిబధనలను ఉల్లంఘించినట్లు సెబీ విచారణలో తేలింది. మర్చంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఉద్యోగులు గానీ, భౌతిక మౌలిక సదుపాయాలు గానీ కేఐఎస్ఎల్కు లేవని కూడా వెల్లడైంది. పైగా 2022 డిసెంబర్ నుంచి 2025 డిసెంబర్ వరకూ చెల్లుబాటయ్యేలా రెన్యువల్ ఫీజును కూడా కంపెనీ కట్టలేదని 13 పేజీల ఎక్స్‌పార్టీ మధ్యంతర ఉత్తర్వుల్లో సెబీ పేర్కొంది. ఇలాంటి సంస్థల కార్యకలాపాల వల్ల సెక్యూరిటీల మార్కెట్ సమగ్రత, ఇన్వెస్టర్ల ప్రయోజనాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానించింది. -
కరోనాతో జాగ్రత్త: కేంద్ర ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి మళ్లీ వేగంగా పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, అదనపు ముఖ్య కార్యదర్శులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా వ్యవహరించాలని, కోవిడ్–19 మేనేజ్మెంట్ కోసం సన్నద్ధం కావాలని సూచించారు. కరోనా లక్షణాలు ఎక్కడ అధికంగా వ్యాప్తిలో ఉన్నాయో ఎప్పటికప్పుడు గుర్తించాలని చెప్పారు. ఎమర్జెన్సీ హాట్స్పాట్లలో నివారణ చర్యలు చేపట్టాలన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలతోపాటు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన నమూనాల జినోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచాలని కోరారు. కోవిడ్–19 వ్యాప్తి, నియంత్రణ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. ప్రజా చైతన్యం ద్వారానే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేయాలి గతంలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేశాయని, చక్కని ఫలితాలు సాధించాయని మాండవీయ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో సమన్వయంతో పనిచేయాలన్నారు. పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆరోగ్య శాఖ సన్నద్ధతపై ఈ నెల 8, 9న జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించాలని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులకు పిలుపునిచ్చారు. 10, 11న ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై మాక్‌డ్రిల్స్ నిర్వహించాలన్నారు. కొత్త వేరియంట్లతో సంబంధం లేకుండా వైరస్ నియంత్రణకు ఐదు అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని వివరించారు. టెస్ట్–ట్రాక్–ట్రీట్–వ్యాక్సినేట్‌తోపాటు కోవిడ్–19 నియంత్రణ చర్యల పటిష్ట అమలుతో సత్ఫలితాలు లభిస్తాయని వెల్లడించారు. అర్హులైన వారందరికీ కరోనా టీకాలు ఇవ్వాలన్నారు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని సూచించారు. కోవిడ్–19 బాధితులకు ఆసుపత్రుల్లో సరిపడా పడకలు సిద్ధంగా ఉండేలా, ఔషధాలు లభ్యమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమీక్షా సమావేశంలో పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావుతోపాటు వివిధ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు పాల్గొన్నారు. 6 వేల మార్కు దాటిన కోవిడ్ కేసులు దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం 203 రోజుల తర్వాత 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,050 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో యాక్టివ్ కేసులు 28,303కు చేరుకున్నట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ 16న 6,298 కేసులు వెలుగులోకి వచ్చినట్లు పేర్కొంది. మొత్తం కేసులు 4.47 కోట్లకు చేరాయి. దీంతోపాటు, మరో 14 మరణాలు నమోదు కావడంతో మొత్తం మరణాలు 5,30,943కు చేరాయి. రోజువారీ పాజిటివిటీ రేట్ 3.39%కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.06%గా ఉంది. ప్రతి 10 లక్షల జనాభాకు 100 టెస్టులు ఎక్స్‌బీబీ.1.5తోపాటు బీక్యూ.1, బీఏ.2.75, సీహెచ్.1.1, ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీఎఫ్, ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒమిక్రాన్, దాని ఉప వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని వెల్లడించింది. ఇతర వేరియంట్ల ప్రభావం బాగా తగ్గిందని పేర్కొంది. ఎక్స్‌బీబీ.1.16 అనే వేరియంట్ వ్యాప్తి ఫిబ్రవరిలో 21.6 శాతం ఉండగా, మార్చిలో 35.8 శాతానికి చేరిందని వివరించింది. అయితే, వైరస్ వ్యాప్తి పెరిగినప్పటికీ ఆసుపత్రుల్లో చేరికలు, మరణాలు పెద్దగా నమోదు కాలేదని స్పష్టం చేసింది. దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు నిత్యం సగటున 100 కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని కోరింది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, హరియాణాలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు పేర్కొంది. -
గోద్రా దోషికి బెయిల్
న్యూఢిల్లీ: 2002 నాటి గోద్రా రైలు దహనం కేసులో దోషి, యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఫరూఖ్‌కు సుప్రీంకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. అతడు గత 17 ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్నాడని, అందుకే బెయిల్ ఇస్తున్నట్లు వెల్లడించింది. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఫరూఖ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసులోని కొన్ని వాస్తవాలు, పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అతడి బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. 2002 ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోద్రా స్టేషన్లో ఆగిన సబర్మతి ఎక్స్‌ప్రెస్‌పై దుండుగులు నిప్పు పెట్టారు. ఎస్56 కోచ్ పూర్తిగా దహనమయ్యింది. అందులోని 59 మంది ప్రయాణికులు మరణించారు. రాళ్లు రువ్విన ఘటనలో ఫరూఖ్‌సహా కొందరు దోషులుగా తేలారు. -
సినిమానే నా ఊపిరి
‘‘సినిమానే మన ఊపిరి అని మా గురువు దాసరి నారాయణరావుగారు అనేవారు.. అలా సినిమానే మా ఊపిరి.. నా ఊపిరి. కళామతళ్లి మాకు భోజనం పెట్టింది. ‘జిన్నా’ సినిమా గొప్ప హిట్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు అన్నారు. విష్ణు మంచు హీరోగా, పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘జిన్నా’. ఈశాన్ సూర్య దర్శకత్వం వహించారు. అవ్రామ్ భక్త మంచు సమర్పణలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ మూవీ ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘జిన్నా జాతర’ పేరుతో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో మంచు మోహన్ బాబు మాట్లాడుతూ–‘‘జిన్నా’లో విష్ణు ఎంతో రిస్కీ షాట్స్ చేశాడు.. జీవితంలో అలాంటి సన్నివేశాలు చేయడం మంచిది కాదని చెప్పాను. ‘ఢీ’ కంటే పది రెట్ల హిట్‌ని ‘జిన్నా’ అందుకోవాలి. విష్ణుని ఛోటా కె.నాయుడు అద్భుతంగా చూపించాడు. మంచి మ్యూజిక్ ఇచ్చిన అనూప్‌కి థ్యాంక్స్. అరియానా– వీవీయానా ఇంత అద్భుతంగా పాడతారని కలలో కూడా ఊహించలేదు. ఈ సినిమా ద్వారా సూర్య గొప్ప డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నా. నాకు ఎన్నో హిట్ పాటలకు డ్యాన్స్‌లు సమకూర్చిన ప్రభుదేవా ‘జిన్నా’ లో విష్ణుకి నృత్యరీతులు సమకూర్చారు.. మా ఫ్యామిలీలో ఒకడిగా, మాపై ఉన్న గౌరవంతో తను డబ్బు తీసుకోకుండా చేసినందుకు థ్యాంక్స్’’ అన్నారు. విష్ణు మంచు మాట్లాడుతూ–‘‘జిన్నా’ సినిమాకి ముందుగా కోన వెంకట్‌గారికి థ్యాంక్స్. ఛోటాగారితో ఎప్పటి నుంచో పనిచేయాలని అనుకుంటున్నాను.. ఇప్పుడు కుదిరింది. ‘జిన్నా’ నా మనసుకి బాగా దగ్గరైన సినిమా. నా కెరీర్లో బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన అనూప్ రూబెన్స్‌కి థ్యాంక్స్. అరియానా–వీవీయానా తొలిసారి అయినా అద్భుతంగా పాడారు. ఇంత మంచి సినిమా ఇచ్చిన సూర్యకి థ్యాంక్స్. అందరూ మా సినిమాని చూసి, మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. ‘జిన్నా’ కథా రచయిత జి.నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ–‘‘జిన్నా’ రషెస్ చూసినప్పుటి నుంచి ఒక బ్లాక్‌బస్టర్ వైఫై నా చుట్టూ తిరుగుతోంది.. ఇది వందశాతం నిజం. సినిమా బ్లాక్ బస్టర్. ఇండస్ట్రీలో హిట్ చూసిన ఎవరైనా సరే.. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మోహన్ బాబు, చిరంజీవిగార్లు.. ఎవరైనా ఫ్లాప్ చూస్తారు.. కానీ, ఫ్లాప్‌ని ఎదుర్కొనే దమ్ము ఉండాలి. ఆ దమ్ము మోహన్‌బాబుగారి ద్వారా విష్ణుకి వచ్చింది.. తను ఎదుర్కొన్నాడు.. ‘జిన్నా’ తో బ్లాక్ బస్టర్ కొడతాడు’’ అన్నారు.‘‘జిన్నా’ సినిమా కాదు.. మా అన్నయ్య(మోహన్‌బాబు)గారు నాపై పెట్టిన బాధ్యత. ఈ చిత్రం వందశాతం ప్రేక్షకుల్ని సంతృప్తి పరుస్తుంది’’ అన్నారు చిత్ర క్రియేటివ్ ప్రొడ్యూసర్, స్క్రిప్ట్ రైటర్ కోన వెంకట్. ఈ సమావేశంలో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, నటులు అలీ, చమ్మక్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
‘గ్రీన్‌కార్డు’ సిఫార్సుల్లో కీలక కదలిక
వాషింగ్టన్: గ్రీన్ కార్డ్ దరఖాస్తుల ప్రాసెసింగ్, కేటాయింపు సమయాన్ని ఆర్నెల్లకు కుదించడంతో పాటు పెండింగ్ దరఖాస్తులన్నింటినీ 2023 ఏప్రిల్ కల్లా క్లియర్ చేయాలన్న సిఫార్సులపై అమెరికా దృష్టి నిశితంగా సారించింది. ఇవి ప్రస్తుతం డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్ పరిశీలనలో ఉన్నాయి. అక్కడ ఆమోదం పొందితే తుది నిర్ణయం కోసం అధ్యక్షుడు జో బైడెన్ వద్దకు వెళ్తాయి. ఈ సిఫార్సులు అమలుకు నోచుకుంటే వేలాదిమంది భారతీయులకు లబ్ధి చేకూరనుంది. ఆసియా అమెరికన్లు తదితరులకు సంబంధించిన సలహా కమిషన్ గత మే నెలలో ఈ కీలక సిఫార్సులు చేయడం తెలిసిందే. భారతీయ మూలాలున్న పారిశ్రామికవేత్త అజయ్ జైన్ భుటోరియా కమిషన్ తొలి భేటీలో ఈ ప్రతిపాదనలు చేయగా ఏకగ్రీవ ఆమోదం లభించింది. బైడెన్‌కు భుటోరియా తొలినుంచీ గట్టి మద్దతుదారు. -
అరకొరగానే వరి! కారణాలివేనా? కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. గత దశాబ్ద కాలంలో తొలిసారిగా ఈ ఏడాది వరి సాగు 24 శాతం మేర తగ్గినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే జూలై 8 నాటికి తెలంగాణలోనూ వరి సాగు తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. జూన్‌లో రుతుపవనాల రాకలో జాప్యం జరగడం, పప్పు ధాన్యాలు, నూనెగింజల మద్దతు ధరలను ప్రభుత్వం భారీగా పెంచిన నేపథ్యంలో వాటి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నట్లు కేంద్రం అంచనా వేస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఈ నెల 8న వ్యవసాయ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. గత ఏడాది ఈ సమయానికి దేశవ్యాప్తంగా 94.99 లక్షల హెక్టార్లలో వరి నాట్లు వేశారు. అయితే ఈ ఏడాది కేవలం 72.24 లక్షల హెక్టార్లలో (24% తక్కువ) మాత్రమే వరి నాట్లు పడ్డాయి. 2012 జూలై 11 నాటికి 96.7 లక్షల హెక్టార్లలో వరి సాగవగా, ఆ తర్వాత ఏడాదిలో గరిష్టంగా 1.25 కోట్ల హెక్టార్ల మేర సాగు జరిగింది. వరి ఎక్కువగా సాగు చేసే ఛత్తీస్‌గఢ్‌లో గత ఏడాది ఇదే సమయానికి 15.14 లక్షల హెక్టార్లలో సాగు జరగ్గా, ఈ ఏడాది ఏకంగా 6.19 లక్షల హెక్టార్ల మేర తగ్గి కేవలం 8.95 లక్షల హెక్టార్లకే పరిమితం అయ్యింది. తెలంగాణలో గత ఏడాది జూలై 8 నాటికి 93 వేల హెక్టార్లలో వరి వేయగా, ఈ ఏడాది కేవలం 53 వేల హెక్టార్లలో మాత్రమే సాగయ్యింది. వరికి స్వల్పం..ఇతర పంటలకు భారీగా.. రుతుపవనాల వైఫల్యానికి తోడు ఈ ఏడాది వరి మద్దతు ధరను కేవలం రూ.100 మాత్రమే పెంచడం..రైతులు వరి సాగుకు మొగ్గు చూపక పోవడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. మరోవైపు వంట నూనెలు, పప్పుధాన్యాల దిగుమతిని తగ్గించేందుకు, దేశీయంగా నూనె గింజల దిగుబడిని పెంచేలా వాటి మద్దతు ధరలను కేంద్రం గణనీయంగా పెంచింది. ఈ కారణంగానే రైతులు వరి సాగును తగ్గించినట్లు తెలుస్తోంది. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం వరి సాగు విస్తీర్ణం తగ్గితే దాని ప్రభావం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద నిరుపేదలకు సరఫరా చేసే బియ్యం పంపిణీపై పడే ప్రమాదముంది. ఈ దృష్ట్యా రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వరి నాట్లు పెంచాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్రాలను కోరారు. దేశంలో బియ్యం నిల్వలకు కొరత లేదని, అంతర్జాతీయ డిమాండ్ దృష్ట్యా, ఎక్కువ ఉత్పత్తి చేస్తే మంచి ధర వస్తుందని తెలిపారు. -
World Games 2022: సురేఖ జంటకు కాంస్యం
బర్మింగ్‌హామ్ (అమెరికా): వరల్డ్ గేమ్స్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత్ పతకాల బోణీ చేసింది. అమెరికాలోని అలబామా రాష్ట్రంలోని బర్మింగ్‌హామ్ పట్టణంలో జరుగుతున్న ఈ క్రీడల్లో... శనివారం జరిగిన కాంపౌండ్ మిక్స్డ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) జోడీ కాంస్య పతకం సాధించింది. వరల్డ్ గేమ్స్ ఆర్చరీ చరిత్రలో భారత్‌కిదే తొలి పతకం కావడం విశేషం. కాంస్య పతక మ్యాచ్‌లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ ద్వయం 157–156తో ఆండ్రియా బెసెరా–మిగెల్ బెసెరా (మెక్సికో) జంటపై గెలిచింది. -
చదువుకున్నంత మాత్రాన పని చేయాలనేం లేదు
ముంబై: చదువుకున్నంత మాత్రాన మహిళలను ఉద్యోగం చేసి తీరాలని ఒత్తిడి చేసే అధికారం ఎవరికీ లేదని ముంబై హైకోర్టు పేర్కొంది. పని చేయాలా, ఇల్లు చక్కదిద్దుకోవడానికే పరిమితం కావాలా అన్నది పూర్తిగా ఆమె ఇష్టమేనని న్యాయమూర్తి జస్టిస్ భారతీ డాంగ్రే స్పష్టం చేశారు. ఓ విడాకుల కేసులో భార్యకు మనోవర్తి చెల్లించాలన్న ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఓ వ్యక్తి పెట్టుకున్న రివిజన్ పిటిషన్‌ను శుక్రవారం ఆమె విచారించారు. డిగ్రీ చేసిన తన మాజీ భార్యకు సంపాదించుకునే సామర్థ్యముంది గనుక మనోవర్తి చెల్లించాలన్న ఆదేశాలు సరికాదన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చారు. ‘‘ఈ రోజు నేను న్యాయమూర్తిని. రేపు బహుశా ఇంట్లో కూర్చోవాల్సి రావచ్చు. న్యాయమూర్తిగా పని చేయగల సామర్థ్యముంది గనుక అలా ఊరికే ఉండొద్దని చెప్తారా మీరు?’’అని ప్రశ్నించారు. తన భార్యకు స్థిరమైన ఆదాయ వనరు ఉన్నా ఆ వాస్తవాన్ని దాచిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై వచ్చే వారం తదుపరి విచారణ జరగనునుంది. -
కస్టడీలో వ్యక్తికి పోలీసుల కరెంట్ షాక్
బదౌన్: పశువుల దొంగతనం కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు 20 ఏళ్ల యువకుడిని కరెంట్ షాక్‌తో చిత్రహింసలకు గురిచేశారు. బాధితుడు ఆస్పత్రి పాలయ్యాడు. ఘటనకు సంబంధించి ఐదుగురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. రెహాన్ అనే రోజుకూలీ ఈ నెల 2వ తేదీన సాయంత్రం ఇంటికి వెళ్తుండగా బదౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశువుల దొంగల ముఠాకు సహకరిస్తున్నాడంటూ అతడిని చిత్రహింసలు పెట్టారు. కరెంట్ షాక్‌కు గురి చేయడంతోపాటు లాఠీతో తీవ్రంగా కొట్టడంతో నడవలేని, కనీసం మాట్లాడలేని పరిస్థితికి చేరుకున్నాడని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. అతడిని విడిపించేందుకు రూ.5 వేలు లంచం ఇవ్వాల్సి వచ్చిందన్నారు. తీవ్రంగా గాయపడిన అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
Russia-Ukraine war: రష్యా గ్యాస్‌కు యూరప్ గుడ్‌బై!
బ్రసెల్స్: గ్యాస్ సరఫరాకు ప్రధానంగా రష్యాపై ఆధారపడుతూ వస్తున్న యూరప్ ఇకపై దానికి చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య శుక్రవారం కీలక వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. యూరప్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈయూ ఉన్నతాధికారులతో కలిసి ఒప్పంద వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం యూరప్ దేశాల ఇంధన, ముఖ్యంగా గ్యాస్ అవసరాలను చాలావరకు అమెరికా, ఇతర దేశాలు తీరుస్తాయి. యూరప్‌కు అమెరికా, ఇతర దేశాలు వార్షిక గ్యాస్ ఎగుమతులను మరో 15 బిలియన్ క్యూబిక్ మీటర్ల మేరకు పెంచాలన్నది తాజా ఒప్పంద సారాంశం. దీన్ని మున్ముందు మరింత పెంచుతారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని అంగీకారం కుదిరింది. యూరప్ తన గ్యాస్ అవసరాల్లో దాదాపుగా 40 శాతం రష్యా నుంచే దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. కొత్త ఒప్పందాలు: జర్మనీ బొగ్గు, గ్యాస్, చమురు కోసం రష్యాపై ఆధారపడటాన్ని వీలైనంతగా తగ్గించుకుంటామని జర్మనీ ప్రకటించింది. ఇందుకోసం కొత్త సప్లయర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు ఆ దేశ ఆర్థిక మంత్రి రాబర్ట్ హెబెక్ వెల్లడించారు. జర్మనీ గ్యాస్ అవసరాల్లో 45 శాతానికి పైగా రష్యానే తీరుస్తోంది. తమతో స్నేహపూర్వకంగా మసులుకోని దేశాలు గ్యాస్ బిల్లులను రష్యా కరెన్సీ రూబుల్స్‌లోనే చెల్లించాల్సి ఉంటుందన్న పుతిన్ వ్యాఖ్యలపై యూరప్ దేశాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇది ఒప్పందాల ఉల్లంఘనేనని, ఆచరణసాధ్యం కాదని జర్మనీ చాన్స్‌లర్ ఒలాప్ స్కోల్జ్, ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ ప్రకటించారు. రష్యాతో నిమిత్తం లేకుండా యూరప్ గ్యాస్ అవసరాలను అమెరికా, ఇతర దేశాలు తీర్చడం సా ధ్యమేనా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిం ది. ఎందుకంటే అమెరికా ఇప్పటికే యూరప్‌కు భారీగా గ్యాస్ సరఫరా చేస్తోంది. తాజా ఒప్పందం నేపథ్యంలో అంతకుమించి సరఫరా చేసేందుకు అమెరికా సిద్ధపడ్డా దాన్ని దిగుమతి చేసుకునే, పంపిణీ చేసే వ్యవస్థలు యూరప్‌లో ప్రస్తుతానికి లేవు. -
మా నాన్నను విడిపించండి
న్యూఢిల్లీ: భారతదేశంలో జన్మించిన తమ తండ్రిని అన్యాయంగా పాకిస్తాన్ జాతీయుడిగా నిర్ధారించి జైలుశిక్ష విధించారని, శిక్షాకాలం ముగిసినా నిర్బంధించారని, ఆయనను విడిపించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన అక్కాతమ్ముడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొహమ్మద్ ఖమర్(62)ను యూపీలోని మీరట్‌లో 2011 ఆగస్టు 8న పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ జాతీయుడైన ఖమర్ అక్కడి పాస్పోర్టుతో భారత్‌కు వచ్చాడని, వీసా గడువు ముగిసినా ఇంకా దేశంలో ఉంటున్నాడని కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయస్థానం అతడికి మూడున్నరేళ్ల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించింది. 2015 ఫిబ్రవరి 6న జైలుశిక్ష ముగిసింది. అతడిని తీసుకెళ్లేందుకు పాకిస్తాన్ నిరాకరించడంతో అధికారులు 2015లో∙లాంపూర్‌లోని నిర్బంధ కేంద్రానికి తరలించారు. దీంతో ఖమర్ ఏడేళ్లుగా నిర్బంధంలోనే కొనసాగుతున్నాడు. భారతీయురాలిని వివాహమాడిన ఖమర్‌కు భారత్‌లోనే ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు జన్మించారు. తమ తండ్రి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని, తక్షణమే విముక్తి కలిగించాలని ఖమర్ కుమార్తె, కుమారుడు తాజాగా సుప్రీంను ఆశ్రయించారు. -
అభివృద్ధికి విఘాతం కలిగిస్తే సహించం
జమ్మూ: జమ్మూకశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచి పెట్టేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని హోం మంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. సాధారణ పౌరులను ముష్కరులు హత్య చేస్తున్నారని, ఇలాంటి ఘోరాలకు చరమగీతం పాడుతామని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి, అభివృద్ధికి విఘాతం కలిగిస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ ప్రాంతానికి ప్రధాని మోదీ హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఇప్పటికే 12,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 2022 నాటికి మరో రూ.51,000 కోట్ల పెట్టుబడులు రప్పిస్తామని, వీటితో జమ్మూకశ్మీర్‌లో 5 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం జమ్మూకశ్మీర్‌కు వచ్చిన అమిత్ షా ఆదివారం భగవతీ నగర్లో ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఏడు దశాబ్దాల పాటు ఇక్కడ పరిపాలన సాగించిన మూడు కుటుంబాలు ప్రజలకు చేసిందేమీ లేదని పరోక్షంగా కాంగ్రెస్, నేషనల్, కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ)పై మండిపడ్డారు. ఈరోజు రూ.15,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశానని, ఆ మూడు కుటుంబాలు కలిసి వారి మొత్తం పాలనా కాలంలో ఇలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. అమిత్ షా ఆదివారం జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దును సందర్శించారు. విధి నిర్వహణలో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లతో సంభాషించారు. మీ కుటుంబాల బాగోగులను నరేంద్ర మోదీ ప్రభుత్వం చక్కగా చూసుకుంటుందని, ఎలాంటి ఆందోళన చెందకుండా దేశ రక్షణ బాధ్యతలను నిర్వర్తించాలని కోరారు. సరిహద్దులోని చిట్టచివరి కుగ్రామం మక్వాల్‌లో అమిత్ షా పర్యటించారు. సరిహద్దు ప్రాంతాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు గ్రామస్తులతో చెప్పారు. ఐఐటీ కొత్త క్యాంపస్ ప్రారంభం రూ.210 కోట్లతో నిర్మించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)–జమ్మూ క్యాంపస్‌ను అమిత్ షా ప్రారంభించారు. -
రన్నరప్ తరుణ్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సైప్రస్ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ ప్లేయర్ కాటం తరుణ్ రెడ్డి రన్నరప్‌గా నిలిచాడు. నికోసియాలో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 20 ఏళ్ల తరుణ్ రెడ్డి 20–22, 21–9, 11–21తో నాలుగో సీడ్ దిమిత్రీ పనారిన్ (కజకిస్తాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. అంతకుముందు తొలి రౌండ్లో అన్‌సీడెడ్ తరుణ్ రెడ్డి 21–17, 21–10తో ఎనిమిదో సీడ్ ఒస్వాల్డ్ ఫంగ్ (ఇంగ్లండ్)పై, సెమీఫైనల్లో 21–14, 21–15తో రెండో సీడ్ జోయల్ కోనిగ్ (స్విట్జర్లాండ్)పై సంచలన విజయాలు సాధించాడు. -
Shafali Verma: వన్డేల కోసం శైలి మార్చుకుంటా
న్యూఢిల్లీ: టి20 క్రికెట్లో ఒక్కసారిగా దూసుకొచ్చిన తార షఫాలీ వర్మ. దూకుడైన ఆటకు మారుపేరైన షఫాలీ భారత్ తరఫున తన 22 మ్యాచ్‌ల స్వల్ప కెరీర్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఏకంగా 148.31 స్ట్రైక్‌రేట్‌తో 617 పరుగులు చేసిన ఈ హరియాణా టీనేజర్... అంతర్జాతీయ క్రికెట్లో అతి పిన్న వయసులో అర్ధ సెంచరీ సాధించిన భారత బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తొలి సారి భారత వన్డే టీమ్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరిగే ఏకైక టెస్టు కోసం కూడా ఎంపికైంది. అయితే తన విధ్వంసక శైలిని పరిస్థితి అనుగుణంగా మార్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నానని షఫాలీ చెప్పింది. ముఖ్యంగా 50 ఓవర్ల మ్యాచ్‌లో సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడగలిగితేనే జట్టుకు తాను ఉపయోగపడగలనని ఆమె అభిప్రాయ పడింది. టెస్టు మ్యాచ్ ఆడే తుది జట్టులో అవకాశం లభిస్తే అక్కడా సత్తా చాటగలనని షఫాలీ విశ్వాసం వ్యక్తం చేసింది. మిథాలీ రాజ్ నేతృత్వం లోని భారత జట్టు 2014 తర్వాత తొలి సారి టెస్టు మ్యాచ్ ఆడనుంది. ‘ఏడేళ్ల తర్వాత మన టీమ్‌కు టెస్టు ఆడే అవకాశం లభించింది. టెస్టు టీమ్‌లో నాకూ చోటు దక్కడం సంతోషం. ఆ మ్యాచ్ ద్వారా ఎంతో నేర్చుకునే అవకాశం నాకు కలుగుతుంది. సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజ్‌లో గడిపే ఓపికతో పాటు ఎలా పడితే అలా బాదేయకుండా సరైన బంతులను ఎంచుకునేందుకు కావాల్సిన అవగాహన కలుగుతుంది. మూడు ఫార్మాట్లు కూడా దేనికదే భిన్నం. కాబట్టి టెస్టు, వన్డేలనుంచి కూడా కొత్త అంశాలు తెలుసుకోగలను. ఎక్కువ మ్యాచ్‌లలో నాకు అవకాశం దక్కాలని కోరుకుంటా. అప్పుడే బాగా ఆడి నన్ను నేను నిరూపించుకోగలను. నాకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకొని కెరీర్లో ముందుకు వెళ్లగలను. తొలి సారి అవకాశం (వన్డే, టెస్టు) అనేది ఎవరికైనా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రాబోయే సిరీస్‌లో బాగా ఆడి జట్టును గెలిపించగలిగితే అంతకంటే కావాల్సిందేముంది’ అని షఫాలీ తన మనసులో మాట చెప్పింది. బ్యాటింగ్ కోచ్‌గా శివ్ సుందర్ దాస్ భారత మహిళల క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా మాజీ ఆటగాడు శివ్ సుందర్ దాస్ ఎంపికయ్యాడు. త్వరలో జరిగే ఇంగ్లండ్ పర్యటన కోసం దాస్‌ను బీసీసీఐ నియమించింది. గత కొన్నేళ్లుగా జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రాహుల్ ద్రవిడ్‌తో కలిసి కోచ్‌గా అతను పని చేస్తున్నాడు. 2020లో జరిగిన పట్నాలో జరిగిన నాలుగు దేశాల టోర్నీలో భారత మహిళల ‘ఎ’ జట్టుకు పని చేసిన అనుభవం దాస్‌కు ఉంది. సీనియర్ టీమ్‌తో జత కట్టడం మాత్రం ఇదే తొలిసారి. 2000–2002 మధ్య కాలంలో భారత్ తరఫున ఓపెనర్‌గా 23 టెస్టులు ఆడిన శివ్ సుందర్ దాస్ 34.89 సగటుతో 2 సెంచరీలు సహా 1326 పరుగులు చేశాడు. మరో 4 వన్డేల్లో కూడా అతను జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మహిళల జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా అభయ్ శర్మను ఎంపిక చేసిన బోర్డు...బరోడాకు చెందిన రాజ్‌కువర్‌దేవి గైక్వాడ్‌ను మేనేజర్‌గా నియమించింది. ఈ పర్యటనలో భాగంగా భారత్ ఒక టెస్టు, 3 వన్డేలు, 3 టి20ల్లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది. -
దీర్ఘకాల పెట్టుబడులకు భారత్ బెస్ట్
న్యూఢిల్లీ: దీర్ఘకాలిక పెట్టుబడులకు భారతదేశం అత్యుత్తమమైనదని ప్రధాని నరేంద్రమోదీ గురువారం పేర్కొన్నారు. వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్‌టేబుల్ (వీజీఐఆర్) 2020 సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, ప్రపంచంలోనే అతి తక్కువ కార్పొరేట్ పన్ను ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని తెలిపారు. ‘‘విశ్వసనీయ రిటర్న్స్‌ను మీరు కోరుకుంటున్నట్లయితే, ఇందుకు భారత్ చక్కటి దేశం. ప్రజాస్వామ్యయుతంగా వ్యవస్థలు నడిచే విషయంలో భారత్ చక్కటి ప్రదేశం. మీరు సుస్థిరతను కోరుకుంటే అందుకు భారత్ అనువైన దేశం. దీర్ఘకాలంలో మంచి వృద్ధి అవకాశాలను కోరుకుంటే, భారత్ ఇందుకు సరైన మార్గం’’ అని మోదీ అన్నారు. పటిష్ట ప్రజాస్వామ్యం, యువత, డిమాండ్, వైవిద్యం వంటి విశిష్ట అంశాలను భారత్ ఆఫర్ చేస్తోందన్నారు. వైవిధ్యమైన మార్కెట్లను ఒకే మార్కెట్లో చూడగలుగుతారని విదేశీ పెట్టుబడిదారులకు సూచించారు. ప్రపంచాభివృద్ధి, సంక్షేమంపై భారత్ బహుముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు. దిగ్గజ దేశాల ప్రతినిధులు... ఈ సదస్సులో అమెరికా, యూరోప్, కెనడా, కొరియా, జపాన్, పశ్చిమాసియా, ఆస్ట్రేలియా, సింగపూర్‌లకు చెందిన దాదాపు 20 మంది ఉన్నత స్థాయి వ్యవస్థాగత ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. వీరి నిర్వహణలో ఉన్న పెన్షన్ అండ్ సావరిన్ వెల్త్ ఫండ్స్ విలువ దాదాపు ఆరు ట్రిలియన్ డాలర్లను ఒక అధికారిక ప్రకటన తెలిపింది. భారత ఆర్థిక మంత్రిత్వశాఖ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ సంయుక్తంగా ఈ రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తదితరులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. గ్లోబల్ ఇన్వెస్టర్లకు ప్రధాని పిలువు -
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ సమావేశంలో రచ్చరచ్చ
దేవ్రియా: ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌రియాలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దేవ్రియా అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను ముకుంద్ భాస్కర్‌మణికి ఖరారు చేశారు. దీనిపై నిర్వహించిన సమావేశంలో రేపిస్టుకు టికెట్ ఇవ్వడం ఏమిటని ఆగ్రహిస్తూ తారా యాదవ్ అనే మహిళా కార్యకర్త నిరసన వ్యక్తం చేశారు. సచిన్ నాయక్ అనే నేతపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. మిగిలిన కార్యకర్తలు తారా యాదవ్‌ను అడ్డుకున్నారు. ఇది సోషల్ మీడియా లో వైరలైంది. దీనిపై తారా నాయక్ నలుగురు కాంగ్రెస్ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తనను కొట్టి, అవమానించారని ఆరోపించారు. మహిళపై దాడి చేయడాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ తీవ్రంగా పరిగణించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ డీజీపీకి లేఖ రాశారు. -
త్రీ డేస్ బ్రాండ్ డేస్
స్టార్స్‌కు సినిమాలతో పాటు బ్రాండ్ అడ్వటైజ్మెంట్లు కీలకం. తరచూ ఏదో ఒక ఉత్పత్తిని ప్రమోట్ చేస్తూ టీవీల్లోనో, హోర్డింగ్స్లోనో కనిపిస్తూనే ఉంటారు. సూపర్ స్టార్స్‌కి అయితే ఈ డీల్స్ చాలా ఎక్కువ. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ కూడా చాలా ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఈ లాక్‌డౌన్‌లోనూ కొన్ని కొత్త ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారామె. అయితే లాక్డౌన్ కారణంగా ఈ యాడ్ల చిత్రీకరణ నిలిచిపోయింది. ఆగిపోయిన యాడ్ షూటింగ్స్ అన్నీ ఆగకుండా పూర్తి చేయాలని ‘త్రీ డేస్ – బ్రాండ్ డేస్’ ప్లాన్ చేశారామె. ఈ వారంలో ఓ మూడు రోజుల పాటు యాడ్ షూటింగ్స్‌కే కేటాయించారట. ఈ మూడు రోజులూ నిర్విరామంగా షూటింగ్స్ చేస్తుంటారట దీపిక. ఈ యాడ్స్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత తన తదుపరి సినిమా చిత్రీకరణ కోసం గోవా ప్రయాణమవ్వనున్నారు దీపికా పదుకోన్. -
టీసీఎస్ లాభం 8,049 కోట్లు
ముంబై: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.8,049 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్)సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో ఆర్జించిన నికర లాభం (రూ.8,126 కోట్లు)తో పోల్చి తే 1 శాతం మేర తగ్గిందని టీసీఎస్ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.38,010 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.39,946 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర లాభం 3 శాతం వృద్ధితో రూ.32,340 కోట్లకు, ఆదాయం 7 శాతం ఎగసి రూ.1,56,949 కోట్లకు పెరిగాయి. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.6 తుది డివిడెండ్‌ను(600 శాతం) ప్రకటించింది. మరిన్ని వివరాలు... ► ఇతర ఆదాయం తక్కువగా రావడం, అధిక వడ్డీ వ్యయాలు, లాక్డౌన్ విధింపు(దేశీయంగా, అంతర్జాతీయంగా) లాభదాయకతపై ప్రభావం చూపాయి. ► డాలర్ల పరంగా చూస్తే, ఆదాయం 3 శాతం తగ్గి 544 కోట్ల డాలర్లకు తగ్గింది. స్థిర కరెన్సీ పరంగా చూస్తే, ఆదాయం 3 శాతం పెరిగింది. ఆదాయం అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 13 శాతం, గత క్యూ3లో 7 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ► గత క్యూ4లో ఎబిట్ అర శాతం వృద్ధితో (సీక్వెన్షియల్‌గా) రూ.10,025 కోట్లకు పెరిగింది. మార్జిన్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 25.1 శాతానికి చేరింది. ► పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2019–20) ఎబిట్ 3 శాతం వృద్ధితో రూ.38,580 కోట్లకు పెరగ్గా, మార్జిన్ మాత్రం 1 శాతం మేర తగ్గి 24.58 శాతానికి చేరింది. ► గత క్యూ4లో మొత్తం 1,789 మందికి ఉద్యోగాలిచ్చింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి 24,179 మందికి కొలువులిచ్చింది. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,48,464కు పెరిగింది. ఉద్యోగుల వలస (అట్రిషన్ రేటు) 12.1 శాతంగా ఉంది. ► గత ఆర్థిక సంవత్సరంలో నికరంగా రూ.37,702 కోట్ల మేర డివిడెండ్లు చెల్లించింది. ఈ మార్చి క్వార్టర్లో ఒక్కో షేర్‌కు రూ. 12 మధ్యంతర డివిడెండ్‌ను ఇచ్చింది. తాజాగా ప్రకటించిన రూ.6 తుది డివిడెండ్‌ను కూడా కలుపుకుంటే, ఈ మార్చి క్వార్టర్లో కంపెనీ మొత్తం డివిడెండ్ ఒక్కో షేర్‌కు రూ.18కు పెరుగుతుంది. మార్కెట్ ముగిసిన తర్వాత టీసీఎస్ ఫలితాలు వచ్చాయి. ఫలితాలపై అనిశ్చితితో బీఎస్ఈలో టీసీఎస్ షేర్ 1 శాతం నష్టంతో రూ. 1,715 వద్ద ముగిసింది. ఉద్యోగాల కోత ఉండదు.. కరోనా ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఉద్యోగాల్లో కోత విధించే యోచనేదీ లేదని టీసీఎస్ ఎండీ రాజేశ్ గోపీనాథన్ వెల్లడించారు. అయితే, ఈ ఏడాది జీతాల పెంపు మాత్రం ఉండదని తెలిపారు. మరోవైపు, ముందుగా ఆఫర్లు ఇచ్చిన సుమారు 40,000 మందిని రిక్రూట్ చేసుకుంటామని స్పష్టం చేశారు. కరోనా కాటేసింది.... మార్చి క్వార్టర్ మొదట్లో చాలా వ్యాపార విభాగాలు శుభారంభం చేశాయి. కానీ ఆ సానుకూలతలన్నింటినీ కరోనా మహమ్మారి ధ్వంసం చేసింది. గుడ్డిలో మెల్లలా కొన్ని భారీ డీల్స్‌ను సాధించగలిగాం. కంపెనీ చరిత్రలోనే అత్యధిక ఆర్డర్లను ఈ క్వార్టర్‌లోనే సాధించాం. –రాజేశ్ గోపీనాథన్, టీసీఎస్ సీఈఓ, ఎమ్డీ సంతృప్తికరంగానే సేవలు... కార్యకలాపాల నిర్వహణలో కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ, క్లయింట్లకు సంతృప్తికరమైన స్థాయిల్లోనే ఐటీ సేవలందిస్తున్నాం. అత్యవసర సేవలే కాక, అన్ని విభాగాల సేవలను అందిస్తున్నాం. –ఎన్. గణపతి సుబ్రహ్మణ్యం, టీసీఎస్ సీఓఓ, ఈడీ -
12 శాతం తగ్గిన కర్ణాటక బ్యాంక్ లాభం
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కర్ణాటక బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) మూడో త్రైమాసిక కాలంలో 12 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.140 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.123 కోట్లకు తగ్గిందని కర్ణాటక బ్యాంక్ వెల్లడించింది. మొండి బకాయిలు పెరగడంతో నికర లాభం తగ్గిందని పేర్కొంది. మొత్తం ఆదాయం మాత్రం రూ.1,816 కోట్ల నుంచి రూ.2,024 కోట్లకు పెరిగిందని వివరించింది. గత క్యూ3లో 4.45 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 4.99 శాతానికి పెరిగాయని బ్యాంక్ తెలియజేసింది. నికర మొండి బకాయిలు 3 శాతం నుంచి 3.75 శాతానికి చేరాయి. కేటాయింపులు రూ.209 కోట్ల నుంచి రూ.315 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కర్ణాటక బ్యాంక్ షేర్ 0.6 శాతం లాభంతో రూ.78 వద్ద ముగిసింది. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఆదాయం రూ.2,188 కోట్లు ప్రైవేట్ రంగ సౌత్ ఇండియన్ బ్యాంక్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) డిసెంబర్ క్వార్టర్లో రూ.91 కోట్ల నికర లాభం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో వచ్చిన నికర లాభం రూ.84 కోట్లతో పోలిస్తే 8 శాతం వృద్ధి సాధించామని సౌత్ ఇండియన్ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,922 కోట్ల నుంచి రూ.2,188 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ బ్యాంక్ స్థూల మొండి బకాయిలు స్వల్పంగా పెరిగాయి. గత క్యూ3లో 4.88 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 4.96 శాతానికి పెరిగాయి. అయితే నికర మొండి బకాయిలు మాత్రం 3.54 శాతం నుంచి 3.44 శాతానికి తగ్గాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో సౌత్ ఇండియన్ బ్యాంక్ షేర్ 1.5 శాతం లాభంతో రూ.11 వద్ద ముగిసింది. -
మహిళపై సిద్దరామయ్య ఫైర్
మైసూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మహిళా కార్యకర్తతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ కార్యకర్తపై సిద్ధరామయ్య గట్టిగా కేకలు వేయడం, మైక్‌ను లాగినపుడు ఆమె చేతిలోని మైక్‌తోపాటు దుపటా ఆయనచేతిలోకి రావడం వివాదమైంది. మైసూరులోని గర్గేశ్వర గ్రామంలో సిద్దరామయ్య అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. కార్యక్రమంలో సిద్దరామయ్య కొడుకు, స్థానిక ఎమ్మెల్యే యతీంద్రతోపాటు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాలూకా పంచాయతీ ఉపాధ్యక్షురాలు జమలాల్ లేచి.. తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే యతీంద్ర గెలిచాక మళ్లీ రానేలేదని చెప్పారు. ‘యతీంద్రను ఎన్నికల తర్వాత మళ్లీ ఈ రోజే చూస్తున్నా’ అని అన్నారు. దీంతో సిద్దరామయ్య ఆగ్రహంతో ఊగిపోయారు. నియోజకవర్గానికి యతీంద్ర వస్తూనే ఉన్నారని సిద్ధరామయ్య చెప్పినా జమలాల్ బల్లగుద్ది మరీ వాదించారు.. దీంతో సిద్దరామయ్య ‘నా ముందే టేబుల్‌పై కొట్టి మాట్లాడతావా? ముందు ఇక్కడి నుంచి వెళ్లిపో, లేదా నోరు మూసుకుని కూర్చో’అని పరుషంగా ఆదేశించారు. అయినా సరే జమలాల్ మరోసారి బల్లగుద్ది మాట్లాడారు. దీంతో సిద్ధరామయ్య అరుస్తూ ఆమె చేతిలో ఉన్న మైకును లాగేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె ధరించిన దుపట్టా జారింది. ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటనను సుమోటొగా నమోదు చేస్తున్నట్లు జాతీయ మహిళా హక్కుల కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్పర్సన్ రేఖా శర్మ తెలిపారు. మహిళా కార్యకర్తతో సిద్దరామయ్య అనుచిత ప్రవర్తనపై విచారణ జరిపి, చర్య తీసుకోవాలని కర్ణాటక పోలీసులను కోరనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కౌరవుల ప్రభుత్వం నడుస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. -
క్రిప్టోతో చట్టవిరుద్ధ లావాదేవీలు
న్యూఢిల్లీ: బిట్‌కాయిన్ తరహా క్రిప్టో కరెన్సీల్లో క్రయ, విక్రయాలను అనుమతిస్తే చట్టవిరుద్ధ లావాదేవీలను ప్రోత్సహించినట్టు అవుతుందని సుప్రీంకోర్టుకు ఆర్బీఐ తెలిపింది. ఈ తరహా వర్చువల్ కరెన్సీల వినియోగాన్ని నిషేధిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్టు కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ‘‘క్రిప్టో కరెన్సీలు ప్రభుత్వ ఆమోదం లేనివి. ఎన్క్రిప్షన్ టెక్నిక్లను ఉపయోగించి వీటిని స్వతంత్రంగా నిర్వహిస్తుంటారు. క్రిప్టో కరెన్సీల వ్యవహారాలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి త్వరగా నిర్ణయం రావాల్సి ఉంది’’ అని ఆర్బీఐ తరఫు న్యాయవాది శ్యామ్దివాన్... చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా అధ్యక్షతన గల ధర్మాసనానికి నివేదించారు. ఈ విషయంలో దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఆర్బీఐ, కేంద్రం అభ్యర్థన మేరకు స్పందించేందుకు గడువు ఇస్తూ... తుది విచారణను సెప్టెంబర్ 11న చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. వర్చువల్ కరెన్సీలపై పలు హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లను తమకు బదిలీ చేయాలని, ఇకపై ఈ విషయంలో ఏ పిటిషన్‌ను స్వీకరించొద్దని సుప్రీంకోర్టు ఈ ఏడాది మే 17న అన్ని హైకోర్టులనూ ఆదేశించింది.