లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సివిల్ కోర్టు ఆవరణలో పట్టపగలే దారుణం జరిగింది. గ్యాంగ్‌స్టర్ సంజీవ్ మహేశ్వరి జీవా దారుణ హత్యకు గురయ్యాడు. లాయర్ దుస్తుల్లో వచ్చిన షూటర్లు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనలో ఒక పోలీసు, ఓ మైనర్ బాలిక గాయపడ్డారని, నిందితుడిని అక్కడికక్కడే పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ క్రిమినల్ కేసులో జీవాను కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకొచ్చిన సమయంలో ఈ ఘటన జరిగిందని లక్నో పోలీస్ కమిషనర్ ఎస్‌బీ శిరాద్కర్ తెలిపారు.
కాల్పులు అనంతరం కోర్టు ఆవరణలో పోలీసులను భారీగా మోహరించారు. గాయపడిన కానిస్టేబుల్, బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా, కానిస్టేబుల్ ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. వివాదాస్పద నేత ముక్తార్ అన్సారీకి అనుచరుడైన జీవా (48) ముజఫర్‌నగర్ జిల్లా వాసి.
బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌రాయ్, మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బ్రహ్మ్ దత్తా ద్వివేది హత్య కేసులో నిందితుడు. మరో 24 కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. 1997 ఫిబ్రవరిలో ఫరూఖాబాద్ జిల్లాలో ద్వివేది హత్యకు గురయ్యాడు. ద్వివేదితోపాటు అతని గన్‌మెన్ హత్య కేసులో ట్రయల్‌కోర్టు జీవాను దోషిగా నిర్ధారించింది. జీవిత ఖైదు విధించింది. కోర్టు ఆవరణలోనే కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులకు వ్యతిరేకంగా న్యాయవాదులు ఆందోళనకు దిగారు. శాంతిభద్రతల పరిరక్షణలో, భద్రతా ఏర్పాట్లో్ల విఫలమయ్యాయని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment