సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ బేసిన్లలోని ప్రాజెక్టులపై పెత్తనాన్ని పూర్తిగా ఆయా బోర్డులకే కట్టబెట్టే అంశంపై కేంద్ర జల వనరుల శాఖ సానుకూల నిర్ణయం చేసినట్లుగా తెలిసింది. దశలవారీగా, ప్రాజెక్టుల పరిధిలోని డ్యామ్‌లు, రిజర్వాయర్లు, కాల్వలు, పవర్‌హౌజ్‌లను బోర్డు నియంత్రణలో ఉంచేలా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా సమాచారం.
ఆయా ప్రాజెక్టుల పరిధిలోని అధికారులు కూడా బోర్డుల పరిధిలోనే ఉండేలా చేస్తున్నట్లు తెలుస్తోంది. కృష్ణా, గోదావరి బేసిన్లలో ప్రాజెక్టుల పరిధి, నియంత్రణ అంశాలపై శుక్రవారం కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కీలక సమావేశంజరిగింది. సమావేశానికి గోదావరి బోర్డు చైర్మన్ హెచ్‌కే సాహూ, కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి పరమేశంతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నదీ బేసిన్ల పరిధిలోని సమస్యలను బోర్డు అధికారులు వివరించారు.
కనీసం స్పందించరు..
కృష్ణా జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల వైఖరిపై కృష్ణా బోర్డు అధికారులు మరోమారు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కేటాయింపులకు సంబంధించి తాము వెలువరించిన ఆదేశాలకు ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉండట్లేదని, పైగా అధిక వినియోగంపై ఒక రాష్ట్రం మరో రాష్ట్రంపై ఫిర్యాదులు చేస్తోందని తప్పుబట్టారు. అధిక వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని ఇరు రాష్ట్రాలను కోరినా ఆదేశాలను పట్టించుకోవట్లేదని వివరించారు. బేసిన్ల పరిధిలోని కొత్త ప్రాజెక్టుల వివరాలు కోరినా స్పందించడం లేదని దృష్టికి తెచ్చారు.
‘కృష్ణా బేసిన్‌లో హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగు గంగ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను ఇరురాష్ట్రాలు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. అయితే కొత్తగా ప్రాజెక్టులు చేపట్టాలంటే బోర్డు అనుమతి తప్పనిసరి అని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నా తెలుగు రాష్ట్రాలు పెడచెవిన పెడుతున్నాయి. బోర్డుకు ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా చేతులు కట్టేసి రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారించమంటే సాధ్యమయ్యేది కాదు. ఈ దృష్ట్యా ప్రాజెక్టులపై పూర్తి అధికారాలు అప్పజెప్పండి’అని కోరారు.
ఇప్పటికే కృష్ణా నది బేసిన్‌లోని ప్రాజెక్టులపై పెత్తనం ఉండేలా తయారు చేసిన తుది వర్కింగ్ మాన్యువల్‌ను ఆమోదించాలని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల పరిధిలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఉద్యోగులంతా తమ అధీనంలోనే పనిచేసేలా మార్గదర్శకాలు ఖరారు చేయాలని సూచించారు. బోర్డు అధికారుల వినతికి కేంద్రం నుంచి సానుకూలత వ్యక్తమయిందని తెలిసింది. దీనిపై ఒక నిర్ణయానికి వచ్చి, ఆ నిర్ణయాన్ని ఇరురాష్ట్రాలకు తెలియజేస్తామని, వారి వివరణలు తెలుసుకున్నాక, బోర్డుకు సర్వాధికారాలు అప్పజెప్పే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపినట్లుగా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment