రూ. 5.11 కోట్ల బిల్లును రెడీ చేస్తున్న కర్ణాటక
బెంగళూరు: 19 ఏళ్లపాటుసాగిన అక్రమ ఆస్తుల కేసు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఇంకా వేధిస్తోందా? పొరుగు రాష్ట్రం కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటన ఈ అభిప్రాయాలకు తావిస్తోంది. సుమారు ఐదున్నర కోట్ల రూపాయలు చెల్లించాలని కోరుతూ కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి ఒక బిల్లును పంపించేందుకు రెడీ అవుతోంది. దీనికి సంబంధించి రాష్ట్ర న్యాయశాఖ మంత్రి గురువారం ఒక ప్రకటన చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ ఖర్చుల నిమిత్తం ఈ బిల్లును పంపించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కర్ణాటక న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర తెలిపారు. బెంగళూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో పాటు మరో ముగ్గురిపై గత12 ఏళ్లుగా విచారణ జరిగిందని ఆయన ప్రకటించారు.
అలాగే రెండు వారాల క్రితం హైకోర్టు తీర్పు సందర్భంగా ముఖ్యమంత్రి జయలలిత సెక్యూరిటీ ఖర్చులను కూడా వసూలు చేసేందుకు ఆలోచిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ లెక్కలు తేలుస్తోందన్నారు.
కాగా అక్రమ ఆస్తుల కేసులో ప్రధాన నిందితురాలైన జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న తమిళనాడులో విచారణ జరగడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన డీఎంకే పిటిషన్కు స్పందించిన సుప్రీంకోర్టు ఈ కేసును 2003, నవంబర్ 13న బెంగళూరుకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకకోర్టు 2014 సెప్టెంబర్లో జయలలితను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు చెప్పడంతో ఆమె జైలు పాలయ్యారు. అనంతరం కర్ణాటక హైకోర్టు ఆమెపై ఉన్నఅభియెగాలన్నింటిని కొట్టేస్తూ నిర్దోషిగా తీర్పును వెలువరించింది. దీంతో జయలలిత మళ్లీ తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.