tb jayachandra
-
రూ. 5.11 కోట్ల బిల్లును రెడీ చేస్తున్న కర్ణాటక
బెంగళూరు: 19 ఏళ్లపాటుసాగిన అక్రమ ఆస్తుల కేసు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఇంకా వేధిస్తోందా? పొరుగు రాష్ట్రం కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటన ఈ అభిప్రాయాలకు తావిస్తోంది. సుమారు ఐదున్నర కోట్ల రూపాయలు చెల్లించాలని కోరుతూ కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి ఒక బిల్లును పంపించేందుకు రెడీ అవుతోంది. దీనికి సంబంధించి రాష్ట్ర న్యాయశాఖ మంత్రి గురువారం ఒక ప్రకటన చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ ఖర్చుల నిమిత్తం ఈ బిల్లును పంపించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కర్ణాటక న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర తెలిపారు. బెంగళూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో పాటు మరో ముగ్గురిపై గత12 ఏళ్లుగా విచారణ జరిగిందని ఆయన ప్రకటించారు. అలాగే రెండు వారాల క్రితం హైకోర్టు తీర్పు సందర్భంగా ముఖ్యమంత్రి జయలలిత సెక్యూరిటీ ఖర్చులను కూడా వసూలు చేసేందుకు ఆలోచిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ లెక్కలు తేలుస్తోందన్నారు. కాగా అక్రమ ఆస్తుల కేసులో ప్రధాన నిందితురాలైన జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న తమిళనాడులో విచారణ జరగడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన డీఎంకే పిటిషన్‌కు స్పందించిన సుప్రీంకోర్టు ఈ కేసును 2003, నవంబర్ 13న బెంగళూరుకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకకోర్టు 2014 సెప్టెంబర్‌లో జయలలితను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు చెప్పడంతో ఆమె జైలు పాలయ్యారు. అనంతరం కర్ణాటక హైకోర్టు ఆమెపై ఉన్నఅభియెగాలన్నింటిని కొట్టేస్తూ నిర్దోషిగా తీర్పును వెలువరించింది. దీంతో జయలలిత మళ్లీ తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. -
అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ నివాస కట్టడాలను క్రమబద్ధీకరించనున్నట్లు న్యాయ శాఖ మంత్రి టీబీ జయచంద్ర తెలిపారు. అయితే తక్కువ విస్తీర్ణంలో నిర్మించిన ఇళ్లను మాత్రమే క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేశారు. మంగళవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ పట్టణాల్లో 1,200 చదరపు అడుగులు, గ్రామాల్లో 2,400 అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన నివాస కట్టడాలను మాత్రమే క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి భూ సంస్కరణల చట్టానికి కూడా సవరణలు తెచ్చామన్నారు. కాగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనికి సంబంధించి ఏటీ. రామస్వామి, బాలసుబ్రమణ్యం నివేదికల ఆధారంగా ఆక్రమణలను తొలగించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. దీని కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణల కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రత్యేక న్యాయ స్థానాలను నెలకొల్పాలని కూడా యోచిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి వెనక్కు తీసుకోవడానికి ఉద్దేశించిన చట్టానికి ఉభయ సభల ఆమోదం లభించిందని చెబుతూ, రాష్ట్రపతి అనుమతి లభించిన వెంటనే భూకబ్జాదారులపై నిర్దాక్షిణ్యంగా చర్యలు చేపడతామని హెచ్చరించారు. కొత్త చట్టం ప్రకారం భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు కబ్జాదారులపై క్రిమినల్ కేసులను నమోదు చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. -
సచివాలయానికీ సకాల!
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నిర్ణీత గడువులోగా ప్రభుత్వ సేవలను అందించే ‘సకాల’ పథకాన్ని సచివాలయానికి కూడా విస్తరించాలని యోచిస్తున్నట్లు న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర తెలిపారు. జూన్ నెలకు సకాల నివేదికను విడుదల చేసిన అనంతరం మంగళవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సకాల సేవల దారృ సంతప్తి చెందిన పౌరులకు సకాల మిత్ర అనే గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తద్వారా వారు సకాలపై నృ జాగతికి రాయబారుల్లాగా వ్యవహరిస్తారని చెప్పారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌లో సకాల సేవలను వినియోగించుకోవడంలో నియోజక వర్గాల వారీగా గాంధీ నగర ప్రథమ, చిక్కబళ్లాపురం ద్వితీయ, తుమకూృు తతీయ స్థానాల్లో నిలిచాయని వివరించారు. ఈ నెలలో మొత్తం 5.5 లక్షల అర్జీలు అందగా, 5.42 లక్షలు పరిష్కారమయ్యాయని ఆయన వెల్లడించారు. న్యాయ విచారణపై ఆదేశాలు అర్కావతి లేఔట్ డీనోటిఫికేషన్ వ్యవహరంపై న్యాయ విచారణకు రెండు, మూడు రోజుల్లో ఆదేశాలు వెలువడుతాయని మంత్రి తెలిపారు. ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తులెవరూ అందుబాటులో లేనందున, విశ్రాంత న్యాయమూర్తితో దర్యాప్తు చేయిస్తామని చెప్పారు. ఐదారు మంది విశ్రాంత న్యాయమూర్తుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో దీనిపై బుధవారం చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. -
తపాలా ద్వారా సకాల
ఇకపై ఆన్లైన్ ద్వారా 478 సేవలు పాలనలో పారదర్శకత కోసమే మంత్రి టీబీ జయచంద్ర సాక్షి, బెంగళూరు : రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ‘సకాల’ సేవలను ఇకపై తపాలా కార్యాలయాల ద్వారా కూడా అందనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం, పోస్టల్ శాఖ మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరింది. దీంతో రాష్ర్టంలోని తొమ్మిది వేల పోస్టాఫీసుల్లో ఇకపై సకాల సేవలను ప్రజలు పొందవచ్చు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర మాట్లాడుతూ... సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వినియోగించుకోవడం ద్వారా పాలనలో పారదర్శకత పెరగడమే కాక మరింత వేగంగా ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుతాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ సేవలన్నింటినీ ఆన్లైన్ చేసే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందన్నారు. ఇందులో భాగంగా తొలుత సకాల పరిధిలోని 478 సేవలను త్వరలో ఆన్లైన్ చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఇందులో నుంచి 135 సేవలు మాత్రమే ఆన్లైన్లో ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని తాలూకా కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల్లో సకాల గడియారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని వల్ల అయా తాలూకాల్లో వస్తున్న సకాల దరఖాస్తులు, అందులో పరిష్కారమైన వాటి సంఖ్య తదితర వివరాలు ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా ఉంటుందన్నారు. రాష్ర్టంలో సకాల సేవలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ఐదు కోట్ల దరఖాస్తులు అందాయని వీటిలో 98 శాతం పరిష్కారమయ్యాయని తెలిపారు. రాష్ర్ట తపాలా శాఖ జనరల్ రామానుజం మాట్లాడుతూ... 2015లోపు రాష్ట్రంలోని హొబలి కేంద్రాల్లో ఉన్న పోస్టాఫీసులకు కూడా రూ. 5 కోట్ల నిధులతో బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించునున్నట్లు చెప్పారు. దీని వల్ల సకాల సేవలను ప్రజలకు చేరువ చేయగలమనే ధీమాను వ్యక్తం చేశారు. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని పోస్లాఫీసుల్లో సకాల సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం 60 పోస్టాఫీసుల్లో కోర్‌బ్యాంకింగ్ సదుపాయాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉన్న 1.42 లక్షల ఖాళీలను భర్తీ చేయడం వల్ల ప్రజలకు ప్రభుత్వ పథకాలను సకాలంలో అందించడమే కాకుండా ఉద్యోగుల ఒత్తిడి కూడా తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు భైరప్ప ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ‘సకల’ డెరైక్టర్ శాలిని రజనీష్, ఎఫ్‌కేసీసీఐ అధ్యక్షుడు ఆర్. శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక రవాణాకు,,, ప్రత్యేక సెక్యూరిటీ పర్మిట్
మంత్రి టీబీ జయచంద్ర రోబో ఇసుక వాడకం తప్పనిసరి ఆన్లైన్లో ఇసుక విక్రయాల యోచన మైసూరు జిల్లాలో త్వరలో పెలైట్ ప్రాజెక్ట్ ప్రారంభం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలను నిరోధించడంతో పాటు నకిలీ పర్మిట్లను అరికట్టేందుకు ఈ నెల ఒకటో తేది నుంచి కొత్త ప్రత్యేక భద్రతా పర్మిట్ పేపర్‌ను ప్రవేశ పెట్టినట్లు న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర వెల్లడించారు. ప్రజా పనుల శాఖ మంత్రి డాక్టర్ హెచ్‌సీ. మహదేవప్పతో కలసి శుక్రవారం సాయంత్రం విధాన సౌధలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఇక మీదట ఎం-ఇసుక(మాన్యుఫ్యాక్చర్డ్ (తయారీ) ఇసుక) వినియోగాన్ని ప్రోత్సహిస్తామన్నారు. దీనినే రోబో ఇసుక అని కూడా వ్యవహరిస్తారని చెప్పారు. స్టోన్ క్రషర్లలో తయారయ్యే ఈ ఇసుక వినియోగం ద్వారా పర్యావరణానికి కొంత మేర నష్టం వాటిల్లకుండా చూడవచ్చని చెప్పారు. కాగా ఇసుక ఏయే ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నదీ ఆన్లైన్లో తెలుసుకోవడానికి నర్మద ఫర్జిలైజర్ కంపెనీతో కలసి సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి పరచినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు వందల నుంచి ఏడు వందలస్టోన్ క్రషర్లు చట్ట పరిధిలో పని చేస్తున్నాయని తెలిపారు. నదుల్లో ఇసుక తవ్వకాలను సమతుల్య పరచే చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఇంకా స్టోన్ క్రషింగ్‌కు అవకాశమున్న ప్రాంతాలను గుర్తిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం నిర్మాణ రంగానికి పది నుంచి 15 శాతం రోబో ఇసుక లభిస్తోందన్నారు. ప్రభుత్వ నిర్మాణాలకు విధిగా రోబో ఇసుకను వాడాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో నిర్మాణ రంగానికి ఏటా రెండు కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం కాగా 90 లక్షల టన్నుల నది ఇసుక మాత్రమే లభ్యమవుతోందని చెప్పారు. కాగా ఆన్లైన్లో ఇసుక విక్రయాలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వారు వెల్లడించారు. గనులు, భూగర్భ వనరుల శాఖ వెబ్సైట్లో ఎక్కడెక్కడ ఇసుక అందుబాటులో ఉన్నదీ తెలుసుకోవచ్చన్నారు. ఆయా జిల్లా కలెక్టర్లు ఇసుక రేటును నిర్ణయిస్తారని, ప్రతి జిల్లాలో కంట్రోల్ పాయింట్ల నుంచి ఇసుకను పొందవచ్చని వివరించారు. త్వరలో మైసూరు జిల్లాలో దీనిని ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో రెండు నెలల్లో 201 చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పని చేస్తున్న 117 చెక్‌పోస్టులతో సహా సీసీటీవీ కెమెరాలను నెలకొల్పనున్నట్లు వారు వెల్లడించారు. -
అధిష్టానం ఆగ్రహం
ఆడంబర వివాహాలపై పన్ను నిర్ణయం వెనక్కు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఆడంబర వివాహాలపై పన్ను విధిస్తామని ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహానికి గురైన న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర, దీనిపై ఆచితూచి స్పందించారు. ప్రపంచ పాడి దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్ణాటక పాడి సమాఖ్య నగరంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆడంబర వివాహాలపై పన్ను విధించడానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఈ నెల 5న జరిగే కాంగ్రెస్ శాసన సభా పక్షం సమావేశంలో దీనిపై చర్చిస్తామని వెల్లడించారు. శాసన సభ్యుల అభిప్రాయాలను సేకరించిన అనంతరం, ముఖ్యమంత్రితో సమాలోచనలు జరుపుతామని తెలిపారు. అనంతరమే దీనిపై ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆడంబర వివాహాలను నియంత్రించడానికి కొత్త చట్టాలను తీసుకు రావడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న చట్టాలనే బలోపేతం చేస్తామన్నారు. ఆడంబర వివాహాలపై పన్ను విధించాలన్నది కేవలం తమ ఆలోచన మాత్రమేనని చెప్పారు. దీనిపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందని వచ్చిన వార్తలపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. -
కర్నాటకలో పెళ్లాడితే అంతే సంగతులు...
ఆకాశమంత పందిరి, భూదేవంత పీట....వేసి ఆర్భాటంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? మీరు కర్నాటకలో ఉంటే అదేం కుదరదు. ఎందుకంటే అన్నీ కుదిరితే కర్నాటక ప్రభుత్వం పెళ్లి ఆర్భాటంపై పన్ను వేసేయబోతోంది. పెళ్లి ఖర్చు 5 లక్షలకు మించినా, 1000 మంది కన్నా ఎక్కువ మంది అతిథులు హాజరైనా అంతే సంగతులు. మీరు లగ్జరీ పన్ను కట్టాల్సిందే. కాబట్టి మా మాట విని సింపుల్ గా కానిచ్చేయడమే మంచిది. కర్నాటక న్యాయవ్యవహారాల శాఖ మంత్రి టీబీ జయచంద్ర ఈ విషయాన్ని చెప్పారు. ఇటీవల ఆయనకు ఒక పెళ్లి కార్డు వచ్చింది. దాని ఖరీదు ఏడువేల రూపాయలు. అది చూసే సరికి మంత్రిగారు ఖంగుతిని, పన్ను వేసేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు పెళ్లిపై పన్నులే కాదు, పన్నులు ఎంత వేయాలో నిర్ణయించే, పనిని సరిగ్గా చేయించే పెళ్లి టాక్సు అధికారులను కూడా నియమించబోతున్నారు. ఇలా సేకరించిన పన్ను మొత్తంతో పేదల ఇళ్లలో పెళ్లిళ్లకు 25000 చొప్పున ప్రభుత్వం ఇస్తుందట. అయితే ప్లేటు భోజనానికే 250 రూపాయలు ఖర్చయ్యే ఈ రోజుల్లో 500 మంది మంది వచ్చినా 1.25 లక్షల రూపాయలు కావాలి. కనీసం అమ్మాయికి ఓ నాలుగు తులాల బంగారం పెట్టాలంటే లక్ష రూపాయలు ఖర్చవుతుంది. అమ్మాయి తరఫు, అబ్బాయి తరఫు ఖర్చు మొత్తం కలిపి 5 లక్షలు ఉండాలా లేక ఒకొక్కరి ఖర్చూ అయిదువేలు మించకూడదా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తున్నాయి. అయితే కర్నాటక మంత్రి మాత్రం కేరళలో ఇప్పటికే ఇలాంటి పన్ను వసూలవుతోందని దబాయించారు. ఈ పెళ్లి పన్ను కూడా ఎన్నికల వ్యయ పరిమితిలా కాగితాలకే పరిమితమౌతుందా అన్నదే అసలు ప్రశ్న!