- మంత్రి టీబీ జయచంద్ర
- రోబో ఇసుక వాడకం తప్పనిసరి
- ఆన్‌లైన్‌లో ఇసుక విక్రయాల యోచన
- మైసూరు జిల్లాలో త్వరలో పెలైట్ ప్రాజెక్ట్ ప్రారంభం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలను నిరోధించడంతో పాటు నకిలీ పర్మిట్లను అరికట్టేందుకు ఈ నెల ఒకటో తేది నుంచి కొత్త ప్రత్యేక భద్రతా పర్మిట్ పేపర్‌ను ప్రవేశ పెట్టినట్లు న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర వెల్లడించారు. ప్రజా పనుల శాఖ మంత్రి డాక్టర్ హెచ్‌సీ. మహదేవప్పతో కలసి శుక్రవారం సాయంత్రం విధాన సౌధలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలో ఇక మీదట ఎం-ఇసుక(మాన్యుఫ్యాక్చర్డ్ (తయారీ) ఇసుక) వినియోగాన్ని ప్రోత్సహిస్తామన్నారు. దీనినే రోబో ఇసుక అని కూడా వ్యవహరిస్తారని చెప్పారు. స్టోన్ క్రషర్లలో తయారయ్యే ఈ ఇసుక వినియోగం ద్వారా పర్యావరణానికి కొంత మేర నష్టం వాటిల్లకుండా చూడవచ్చని చెప్పారు. కాగా ఇసుక ఏయే ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నదీ ఆన్‌లైన్‌లో తెలుసుకోవడానికి నర్మద ఫర్జిలైజర్ కంపెనీతో కలసి సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి పరచినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు వందల నుంచి ఏడు వందలస్టోన్ క్రషర్లు చట్ట పరిధిలో పని చేస్తున్నాయని తెలిపారు. నదుల్లో ఇసుక తవ్వకాలను సమతుల్య పరచే చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఇంకా స్టోన్ క్రషింగ్‌కు అవకాశమున్న ప్రాంతాలను గుర్తిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం నిర్మాణ రంగానికి పది నుంచి 15 శాతం రోబో ఇసుక లభిస్తోందన్నారు. ప్రభుత్వ నిర్మాణాలకు విధిగా రోబో ఇసుకను వాడాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు.
రాష్ట్రంలో నిర్మాణ రంగానికి ఏటా రెండు కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం కాగా 90 లక్షల టన్నుల నది ఇసుక మాత్రమే లభ్యమవుతోందని చెప్పారు. కాగా ఆన్‌లైన్‌లో ఇసుక విక్రయాలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వారు వెల్లడించారు. గనులు, భూగర్భ వనరుల శాఖ వెబ్‌సైట్‌లో ఎక్కడెక్కడ ఇసుక అందుబాటులో ఉన్నదీ తెలుసుకోవచ్చన్నారు.
ఆయా జిల్లా కలెక్టర్లు ఇసుక రేటును నిర్ణయిస్తారని, ప్రతి జిల్లాలో కంట్రోల్ పాయింట్ల నుంచి ఇసుకను పొందవచ్చని వివరించారు. త్వరలో మైసూరు జిల్లాలో దీనిని ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో రెండు నెలల్లో 201 చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పని చేస్తున్న 117 చెక్‌పోస్టులతో సహా సీసీటీవీ కెమెరాలను నెలకొల్పనున్నట్లు వారు వెల్లడించారు.