- ఇకపై ఆన్‌లైన్ ద్వారా 478 సేవలు
- పాలనలో పారదర్శకత కోసమే
- మంత్రి టీబీ జయచంద్ర
సాక్షి, బెంగళూరు : రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ‘సకాల’ సేవలను ఇకపై తపాలా కార్యాలయాల ద్వారా కూడా అందనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం, పోస్టల్ శాఖ మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరింది. దీంతో రాష్ర్టంలోని తొమ్మిది వేల పోస్టాఫీసుల్లో ఇకపై సకాల సేవలను ప్రజలు పొందవచ్చు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర మాట్లాడుతూ... సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వినియోగించుకోవడం ద్వారా పాలనలో పారదర్శకత పెరగడమే కాక మరింత వేగంగా ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుతాయని అన్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ సేవలన్నింటినీ ఆన్‌లైన్ చేసే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందన్నారు. ఇందులో భాగంగా తొలుత సకాల పరిధిలోని 478 సేవలను త్వరలో ఆన్‌లైన్ చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఇందులో నుంచి 135 సేవలు మాత్రమే ఆన్‌లైన్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని తాలూకా కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల్లో సకాల గడియారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని వల్ల అయా తాలూకాల్లో వస్తున్న సకాల దరఖాస్తులు, అందులో పరిష్కారమైన వాటి సంఖ్య తదితర వివరాలు ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా ఉంటుందన్నారు.
రాష్ర్టంలో సకాల సేవలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ఐదు కోట్ల దరఖాస్తులు అందాయని వీటిలో 98 శాతం పరిష్కారమయ్యాయని తెలిపారు. రాష్ర్ట తపాలా శాఖ జనరల్ రామానుజం మాట్లాడుతూ... 2015లోపు రాష్ట్రంలోని హొబలి కేంద్రాల్లో ఉన్న పోస్టాఫీసులకు కూడా రూ. 5 కోట్ల నిధులతో బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించునున్నట్లు చెప్పారు. దీని వల్ల సకాల సేవలను ప్రజలకు చేరువ చేయగలమనే ధీమాను వ్యక్తం చేశారు.
దశల వారీగా రాష్ట్రంలోని అన్ని పోస్లాఫీసుల్లో సకాల సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం 60 పోస్టాఫీసుల్లో కోర్‌బ్యాంకింగ్ సదుపాయాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉన్న 1.42 లక్షల ఖాళీలను భర్తీ చేయడం వల్ల ప్రజలకు ప్రభుత్వ పథకాలను సకాలంలో అందించడమే కాకుండా ఉద్యోగుల ఒత్తిడి కూడా తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు భైరప్ప ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ‘సకల’ డెరైక్టర్ శాలిని రజనీష్, ఎఫ్‌కేసీసీఐ అధ్యక్షుడు ఆర్. శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.