కర్నాటకలో పెళ్లాడితే అంతే సంగతులు...
కర్నాటకలో పెళ్లాడితే అంతే సంగతులు...
Published Fri, May 30 2014 4:51 PM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM
ఆకాశమంత పందిరి, భూదేవంత పీట....వేసి ఆర్భాటంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? మీరు కర్నాటకలో ఉంటే అదేం కుదరదు. ఎందుకంటే అన్నీ కుదిరితే కర్నాటక ప్రభుత్వం పెళ్లి ఆర్భాటంపై పన్ను వేసేయబోతోంది. పెళ్లి ఖర్చు 5 లక్షలకు మించినా, 1000 మంది కన్నా ఎక్కువ మంది అతిథులు హాజరైనా అంతే సంగతులు. మీరు లగ్జరీ పన్ను కట్టాల్సిందే. కాబట్టి మా మాట విని సింపుల్ గా కానిచ్చేయడమే మంచిది.
కర్నాటక న్యాయవ్యవహారాల శాఖ మంత్రి టీబీ జయచంద్ర ఈ విషయాన్ని చెప్పారు. ఇటీవల ఆయనకు ఒక పెళ్లి కార్డు వచ్చింది. దాని ఖరీదు ఏడువేల రూపాయలు. అది చూసే సరికి మంత్రిగారు ఖంగుతిని, పన్ను వేసేయాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పుడు పెళ్లిపై పన్నులే కాదు, పన్నులు ఎంత వేయాలో నిర్ణయించే, పనిని సరిగ్గా చేయించే పెళ్లి టాక్సు అధికారులను కూడా నియమించబోతున్నారు. ఇలా సేకరించిన పన్ను మొత్తంతో పేదల ఇళ్లలో పెళ్లిళ్లకు 25000 చొప్పున ప్రభుత్వం ఇస్తుందట.
అయితే ప్లేటు భోజనానికే 250 రూపాయలు ఖర్చయ్యే ఈ రోజుల్లో 500 మంది మంది వచ్చినా 1.25 లక్షల రూపాయలు కావాలి. కనీసం అమ్మాయికి ఓ నాలుగు తులాల బంగారం పెట్టాలంటే లక్ష రూపాయలు ఖర్చవుతుంది. అమ్మాయి తరఫు, అబ్బాయి తరఫు ఖర్చు మొత్తం కలిపి 5 లక్షలు ఉండాలా లేక ఒకొక్కరి ఖర్చూ అయిదువేలు మించకూడదా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తున్నాయి.
అయితే కర్నాటక మంత్రి మాత్రం కేరళలో ఇప్పటికే ఇలాంటి పన్ను వసూలవుతోందని దబాయించారు. ఈ పెళ్లి పన్ను కూడా ఎన్నికల వ్యయ పరిమితిలా కాగితాలకే పరిమితమౌతుందా అన్నదే అసలు ప్రశ్న!
Advertisement
Advertisement