Jayalalithaa case
-
జయ కేసు తీర్పును సమీక్షించం: సుప్రీం
న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీం తీర్పును సమీక్షించాలన్న కర్ణాటక ప్రభుత్వం వినతిని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ‘ఈ కేసులో కోర్టు ముందుకొచ్చిన సమీక్ష పిటిషన్‌ను తిరస్కరిస్తున్నాం. మా దృష్టిలో జయ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఫిబ్రవరి 14, 2017న ఇచ్చిన తీర్పుపై ఎలాంటి సమీక్ష జరపబోం’ అని జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ అమితవ రాయ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. ఫిబ్రవరి 14న తన తీర్పులో సుప్రీంకోర్టు ఏఐఏడీఎంకే చీఫ్ వీకే శశికళతోపాటు మరో ఇద్దరిని దోషులుగా నిర్ధారించటంతోపాటు జయలలిత చనిపోయినందున ఆమెను కేసునుంచి తప్పించింది. జరిమానా వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే జయను తప్పించటం వల్ల రూ.100కోట్ల జరిమానాను రాబట్టుకోవటం కష్టమని.. అదువల్ల ఇటీవలి తీర్పును సమీక్షించాలంటూ కర్ణాటక పిటిషన్ వేసింది. దీన్ని సుప్రీంకోర్టు బుధవారం కొట్టేసింది. -
24న జయ కేసు విచారణ
టీనగర్: సుప్రీంకోర్టులో జయలలిత కేసు ఈనెల 24వ తేదీన విచారణకు రానుంది. ఆస్తులు కూడబెట్టిన కేసులో ముఖ్యమంత్రి జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్ అనే నలుగురిని బెంగళూరు హైకోర్టు న్యాయమూర్తి కుమారసామి విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ క ర్ణాటక ప్రభుత్వం తరపున జూన్ 23వ తేదీ సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలైంది. అందులో పేర్కొన్న లోపాలను సరిదిద్దుతూ ఈ నెల 11వ తేదీ మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు. ఇదేవిధంగా డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్ తరపున కూడా సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలైంది. ఇలావుండగా అప్పీలు పిటిషన్‌పై విచారణ ఈనెల 24వ తేదీ ప్రారంభం కానున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. -
రూ. 5.11 కోట్ల బిల్లును రెడీ చేస్తున్న కర్ణాటక
బెంగళూరు: 19 ఏళ్లపాటుసాగిన అక్రమ ఆస్తుల కేసు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఇంకా వేధిస్తోందా? పొరుగు రాష్ట్రం కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటన ఈ అభిప్రాయాలకు తావిస్తోంది. సుమారు ఐదున్నర కోట్ల రూపాయలు చెల్లించాలని కోరుతూ కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి ఒక బిల్లును పంపించేందుకు రెడీ అవుతోంది. దీనికి సంబంధించి రాష్ట్ర న్యాయశాఖ మంత్రి గురువారం ఒక ప్రకటన చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ ఖర్చుల నిమిత్తం ఈ బిల్లును పంపించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కర్ణాటక న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర తెలిపారు. బెంగళూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో పాటు మరో ముగ్గురిపై గత12 ఏళ్లుగా విచారణ జరిగిందని ఆయన ప్రకటించారు. అలాగే రెండు వారాల క్రితం హైకోర్టు తీర్పు సందర్భంగా ముఖ్యమంత్రి జయలలిత సెక్యూరిటీ ఖర్చులను కూడా వసూలు చేసేందుకు ఆలోచిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ లెక్కలు తేలుస్తోందన్నారు. కాగా అక్రమ ఆస్తుల కేసులో ప్రధాన నిందితురాలైన జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న తమిళనాడులో విచారణ జరగడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన డీఎంకే పిటిషన్‌కు స్పందించిన సుప్రీంకోర్టు ఈ కేసును 2003, నవంబర్ 13న బెంగళూరుకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకకోర్టు 2014 సెప్టెంబర్‌లో జయలలితను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు చెప్పడంతో ఆమె జైలు పాలయ్యారు. అనంతరం కర్ణాటక హైకోర్టు ఆమెపై ఉన్నఅభియెగాలన్నింటిని కొట్టేస్తూ నిర్దోషిగా తీర్పును వెలువరించింది. దీంతో జయలలిత మళ్లీ తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. -
11న తీర్పు?
అన్నాడీఎంకే పార్టీలో ఆందోళన, అన్ని రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ, దేశం చూపు కర్ణాటక హైకోర్టు వైపు అనే రీతిలో రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఎదుర్కొంటున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈనెల 11వ తేదీ తీర్పు వెలువడుతుందని తెలియడమే ఈ పరిస్థితులకు కారణం. - పార్టీ శ్రేణుల్లో భీతి - రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ - న్యాయవాదులు, మీడియా - బెంగళూరులో మకాం చెన్నై, సాక్షి ప్రతినిధి: ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని 1991-96 మధ్య కాలంలో జయలలిత *66.64 కోట్లు అక్రమార్జన చేశారని డీఎంకే మోపిన అభియోగంపై 18 ఏళ్లు నడిచిన కేసులో కర్ణాటక ప్రత్యేక కోర్టు తీర్పుచెప్పింది. నాలుగేళ్ల జైలు శిక్ష, *100 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఇదే కేసులో భాగంగా జయ నెచ్చెలి శశికళ, మాజీ దత్తపుత్రుడు సుధాకర్, ఇళవరసిలకు తలా రూ.10 కోట్లు జరిమానా, నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. జయ సహా నలుగురూ 22 రోజుల పాటూ కర్ణాటక జైలులో ఖైదీలుగా ఉండి బెయిల్‌పై వచ్చారు. తనకు పడిన శిక్షపై జయ సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా, కర్ణాటక హైకోర్టు అప్పీలు కేసును విచారిస్తోంది. మూడునెలల్లోగా కేసులో తీర్పుచెప్పాలన్న సుప్రీం ఆదేశాలతో వాదోపవాదాలు వేగంగా సాగాయి. అప్పీలు కేసు దాదాపు పూర్తయిన దశలో తీర్పుపై ఐదురోజులుగా అంచనాలు బయలుదేరాయి. శని, ఆదివారాలు కోర్టుకు శలవుదినాల దృష్ట్యా ఈనెల 11వ తేదీన సోమవారం నాడు తీర్పు వెలువడడం ఖాయమని తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన మీడియా ప్రతినిధులు కొందరు శని, ఆదివారాల్లో బెంగళూరుకు పయనం అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. మరో ఏడాదిలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఈ తీర్పు పార్టీ భవిష్యత్తును ప్రభావితం చేయగలదు. దీంతో అన్ని పార్టీల్లో తీర్పుపై ఆసక్తి నెలకొంది. వెలువడనున్న తీర్పు జయకు సానుకూలమా లేక ప్రతికూలమా అనే చర్చ మొదలైంది. 11వ తేదీన తీర్పును ప్రకటిస్తామనే సమాచారాన్ని శుక్రవారం సాయంత్రమే బెంగళూరు కోర్టు ప్రకటిస్తుందని అందరూ అంచనావేశారు. అన్నాడీఎంకే పార్టీకి చెందిన న్యాయవాదులు బెంగళూరులోనే మకాం వేసి ఉన్నారు. అయితే రాత్రి 7 గంటల వరకు సమాచారం లేదు. అభిమాని కుటుంబానికి *3లక్షలు జయ కేసులో తీర్పు ఎలా ఉంటుందో అనే ఉత్కంఠను భరించలేక ఆత్మాహుతికి పాల్పడిన సేలం జిల్లా అస్తంపట్టికి చెందిన బాలకృష్ణన్ కుటుంబానికి జయ *3లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. -
కర్ణాటక హైకోర్టు వద్ద ఉద్రిక్తత
బెంగళూరు/చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బెయిల్ పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. జయలలిత తరఫున ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ వాదిస్తున్నారు. బెయిలుపై ఉత్కంఠ కొనసాగుతోంది. విచారణ నేపథ్యంలో హైకోర్టు చుట్టుపక్కల భద్రతను పటిష్టం చేశారు. హైకోర్టు వద్ద పరిస్థితి ఉద్రిక్తతంగా ఉంది.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు సీబీఐ కోర్టు గత నెల 27న నాలుగేళ్ల జైలు శిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, తమిళనాడులో జయలలితకు ఓ పక్క మద్దతు పెరుగుతోంది. మరోపక్క రాష్ట్రంలో పరిస్థితులు క్షీణించాయని ప్రతిపక్షాలు ఆందోళణ వ్యక్తం చేస్తున్నాయి. -
ఎవరికైనా.. ఆ రాముడే దిక్కు!
రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు.. ఎవరైనా, ఏ పార్టీ వారైనా సరే ఏదైనా న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నారంటే వాళ్లు జపించే మంత్రం ఒక్కటే. రాం.. రాం.. రాం.. ఆయనెవరో కాదు, ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ. తాజాగా అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా చివరకు రాం జెఠ్మలానీనే తన తరఫున వాదించేందుకు నియమించుకున్నారు. పెద్ద పెద్ద క్లయింట్లు ఎక్కువ మంది ఉండటంతో ఆయన వారి నుంచి భారీగానే గంటల లెక్కన ఫీజు వసూలుచేస్తారు. దాన్ని ఆయన సమర్థించుకుంటారు కూడా. జయలలిత లాంటి వాళ్ల దగ్గర ఎక్కువ ఫీజే తీసుకుంటానని, కానీ తాను వాదించే మొత్తం కేసుల్లో కేవలం పది శాతం నుంచి మాత్రమే తనకు ఇలా డబ్బు వస్తుందని ఆయన అన్నారు. నానావతి హత్యకేసు లాంటి కీలకమైన కేసు వాదించడంతో రాం జెఠ్మలానీ పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మార్మోగింది. కేసులు వాదించడానికి ఆయన తన సిద్ధాంతాలను వదులుకోడానికి కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు. ఇందిరాగాంధీ హత్య కేసులో బల్బీర్ సింగ్ తరఫున వాదించాల్సిందిగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్ఎస్ సోధీ ఆయన్ను ఒకప్పుడు కోరారు. అప్పటికి ఆయన బీజేపీ సభ్యుడు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి మరీ కేసు తీసుకున్నారు. పార్లమెంటు మీద దాడి కేసులో నిందితుల తరఫున కూడా ఆయన వాదించడం పట్ల తీవ్ర విమర్శలు తలెత్తినా వాటిని ఏనాడూ పట్టించుకోలేదు. 17 ఏళ్ల వయసులోనే కరాచీ లా స్కూల్ నుంచి న్యాయవాద విద్య పూర్తి చేశారు. అయితే 21 ఏళ్లు నిండితే తప్ప వాదించడానికి వీల్లేకపోవడంతో ప్రత్యేక అనుమతి తీసుకుని మరీ కోర్టుకు వెళ్లారు. ఇప్పటివరకు అనేక ప్రముఖ కేసులు వాదించిన రాం జెఠ్మలానీ.. ఇప్పుడు విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా తనకు సహకరిస్తుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం మంగళవారం నాడు బెంగళూరు కోర్టులో తమిళనాడు మాజీ సీఎం జయలలిత బెయిల్ కేసు వాదించేందుకు బస్తాలకొద్దీ పత్రాలతో కుస్తీలు పడుతున్నారు.