11న తీర్పు?
అన్నాడీఎంకే పార్టీలో ఆందోళన, అన్ని రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ, దేశం చూపు కర్ణాటక హైకోర్టు వైపు అనే రీతిలో రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఎదుర్కొంటున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈనెల 11వ తేదీ తీర్పు వెలువడుతుందని తెలియడమే ఈ పరిస్థితులకు కారణం.
- పార్టీ శ్రేణుల్లో భీతి
- రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
- న్యాయవాదులు, మీడియా
- బెంగళూరులో మకాం
చెన్నై, సాక్షి ప్రతినిధి: ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని 1991-96 మధ్య కాలంలో జయలలిత *66.64 కోట్లు అక్రమార్జన చేశారని డీఎంకే మోపిన అభియోగంపై 18 ఏళ్లు నడిచిన కేసులో కర్ణాటక ప్రత్యేక కోర్టు తీర్పుచెప్పింది. నాలుగేళ్ల జైలు శిక్ష, *100 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఇదే కేసులో భాగంగా జయ నెచ్చెలి శశికళ, మాజీ దత్తపుత్రుడు సుధాకర్, ఇళవరసిలకు తలా రూ.10 కోట్లు జరిమానా, నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. జయ సహా నలుగురూ 22 రోజుల పాటూ కర్ణాటక జైలులో ఖైదీలుగా ఉండి బెయిల్‌పై వచ్చారు. తనకు పడిన శిక్షపై జయ సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా, కర్ణాటక హైకోర్టు అప్పీలు కేసును విచారిస్తోంది.
మూడునెలల్లోగా కేసులో తీర్పుచెప్పాలన్న సుప్రీం ఆదేశాలతో వాదోపవాదాలు వేగంగా సాగాయి. అప్పీలు కేసు దాదాపు పూర్తయిన దశలో తీర్పుపై ఐదురోజులుగా అంచనాలు బయలుదేరాయి. శని, ఆదివారాలు కోర్టుకు శలవుదినాల దృష్ట్యా ఈనెల 11వ తేదీన సోమవారం నాడు తీర్పు వెలువడడం ఖాయమని తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన మీడియా ప్రతినిధులు కొందరు శని, ఆదివారాల్లో బెంగళూరుకు పయనం అవుతున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. మరో ఏడాదిలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఈ తీర్పు పార్టీ భవిష్యత్తును ప్రభావితం చేయగలదు. దీంతో అన్ని పార్టీల్లో తీర్పుపై ఆసక్తి నెలకొంది. వెలువడనున్న తీర్పు జయకు సానుకూలమా లేక ప్రతికూలమా అనే చర్చ మొదలైంది. 11వ తేదీన తీర్పును ప్రకటిస్తామనే సమాచారాన్ని శుక్రవారం సాయంత్రమే బెంగళూరు కోర్టు ప్రకటిస్తుందని అందరూ అంచనావేశారు. అన్నాడీఎంకే పార్టీకి చెందిన న్యాయవాదులు బెంగళూరులోనే మకాం వేసి ఉన్నారు. అయితే రాత్రి 7 గంటల వరకు సమాచారం లేదు.
అభిమాని కుటుంబానికి *3లక్షలు
జయ కేసులో తీర్పు ఎలా ఉంటుందో అనే ఉత్కంఠను భరించలేక ఆత్మాహుతికి పాల్పడిన సేలం జిల్లా అస్తంపట్టికి చెందిన బాలకృష్ణన్ కుటుంబానికి జయ *3లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.