ఎవరికైనా.. ఆ రాముడే దిక్కు!
రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు.. ఎవరైనా, ఏ పార్టీ వారైనా సరే ఏదైనా న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నారంటే వాళ్లు జపించే మంత్రం ఒక్కటే. రాం.. రాం.. రాం.. ఆయనెవరో కాదు, ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ. తాజాగా అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా చివరకు రాం జెఠ్మలానీనే తన తరఫున వాదించేందుకు నియమించుకున్నారు. పెద్ద పెద్ద క్లయింట్లు ఎక్కువ మంది ఉండటంతో ఆయన వారి నుంచి భారీగానే గంటల లెక్కన ఫీజు వసూలుచేస్తారు. దాన్ని ఆయన సమర్థించుకుంటారు కూడా. జయలలిత లాంటి వాళ్ల దగ్గర ఎక్కువ ఫీజే తీసుకుంటానని, కానీ తాను వాదించే మొత్తం కేసుల్లో కేవలం పది శాతం నుంచి మాత్రమే తనకు ఇలా డబ్బు వస్తుందని ఆయన అన్నారు.
నానావతి హత్యకేసు లాంటి కీలకమైన కేసు వాదించడంతో రాం జెఠ్మలానీ పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మార్మోగింది. కేసులు వాదించడానికి ఆయన తన సిద్ధాంతాలను వదులుకోడానికి కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు. ఇందిరాగాంధీ హత్య కేసులో బల్బీర్ సింగ్ తరఫున వాదించాల్సిందిగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్ఎస్ సోధీ ఆయన్ను ఒకప్పుడు కోరారు. అప్పటికి ఆయన బీజేపీ సభ్యుడు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి మరీ కేసు తీసుకున్నారు. పార్లమెంటు మీద దాడి కేసులో నిందితుల తరఫున కూడా ఆయన వాదించడం పట్ల తీవ్ర విమర్శలు తలెత్తినా వాటిని ఏనాడూ పట్టించుకోలేదు. 17 ఏళ్ల వయసులోనే కరాచీ లా స్కూల్ నుంచి న్యాయవాద విద్య పూర్తి చేశారు. అయితే 21 ఏళ్లు నిండితే తప్ప వాదించడానికి వీల్లేకపోవడంతో ప్రత్యేక అనుమతి తీసుకుని మరీ కోర్టుకు వెళ్లారు.
ఇప్పటివరకు అనేక ప్రముఖ కేసులు వాదించిన రాం జెఠ్మలానీ.. ఇప్పుడు విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా తనకు సహకరిస్తుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం మంగళవారం నాడు బెంగళూరు కోర్టులో తమిళనాడు మాజీ సీఎం జయలలిత బెయిల్ కేసు వాదించేందుకు బస్తాలకొద్దీ పత్రాలతో కుస్తీలు పడుతున్నారు.