high profile cases
-
భార్యను అతికిరాతకంగా చంపిన మాజీ మంత్రి
అస్తానా: మధ్య ఆసియా దేశం కజకస్తాన్ నిరసనలతో అట్టుడికిపోతోంది. ఓ మాజీ మంత్రి తన భార్యను అతికిరాతకంగా కొట్టి చంపిన వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ మానవ మృగం కోర్టు విచారణ ఎదుర్కొంటుండగా.. కఠిన శిక్ష పడాలంటూ ఆందోళనలు చేపట్టారు అక్కడి ప్రజలు.కువాన్దిక్ బిషింబయెవ్(44) కజకస్తాన్ దేశపు మాజీ ఆర్థిక మంత్రి. ఈయన బంధువు పేరిట ఉన్న ఓ రెస్టారెంట్లో గతేడాది నవంబర్‌లో ఆయన సతీమణి సల్తానత్ నుకెనోవా(31) అనుమానాస్పద రీతిలో మృతి చెందిది. అంతకు ముందు ఒకరోజు అంతా ఆ జంట ఆ హోటల్లోనే గడిపింది.అయితే విచారణలో ఆయనే ఆమెను దారుణంగా హింసించి చంపినట్లు తేలింది. దీంతో ఆయన కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు. ఈలోపు ఆ హోటల్ సీపీ టీవీ ఫుటేజీలు బయటకు వచ్చాయి. జుట్టుపట్టి ఈడ్చి కొట్టి.. ఇష్టానుసారం తన్ని.. సుమారు ఎనిమిది గంటల పాటు ఆ కిరాతకం కొనసాగింది. రక్తపు మడుగులో అచేతనంగా భార్య పడి ఉన్నప్పటికీ ఆమె బాగానే ఉందంటూ హోటల్ సిబ్బందితో బిషింబయెవ్ చెప్పడం కూడా వీడియోలో రికార్డయ్యింది. చివరకు 12 గంటల తర్వాత ఆంబులెన్స్ అక్కడికి చేరుకోగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు.తలకు, ముక్కుకు బలమైన గాయం కావడం, ఒంటిపై పలు చోట్ల గాయాల్ని శవ పరీక్షలో గుర్తించారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో.. సీసీ టీవీ ఫుటేజీ సహా సాక్ష్యాలన్నింటిని మాయం చేసేందుకు బిషింబయెవ్ ప్రయత్నించారని పోలీసులు తేల్చారు. అంతేకాదు.. తన భార్య మానసిక స్థితి బాగోలేదని, ఈ క్రమంలోనే తనకు తాను గాయాలు చేసుకుని ఆమె చనిపోయిందని న్యాయస్థానాల్ని నమ్మించే యత్నం చేశాడు కూడా.అయితే.. 8 గంటలపాటు సాగిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియో ఫుటేజీ బయటకు రావడంతో ఆ భర్త అకృత్యం వెలుగు చూసింది. భార్యను అలా ఎందుకు చంపాడో మాత్రం ఇంకా నోరు విప్పలేదు నిందితుడు. అయితే ఆమెను అంత క్రూరంగా చంపిన ఆ మాజీ మంత్రిని కఠినంగా శిక్షించాలంటూ అక్కడి ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో గృహ హింస చట్టం గురించి విస్తృతంగా చర్చ జరిగింది అక్కడ. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఆ దేశపు సుప్రీం కోర్టులో జరుగుతోంది. కజకస్తాన్ చరిత్రలోనే తొలిసారి ఈ కేసు విచారణను లైవ్ టెలికాస్ట్ చేయబోతోంది ఆ దేశ అత్యున్నన్యాయస్థానం. బిషింబయెవ్ నేరం గనుక రుజువు అయితే అక్కడి చట్టాల ప్రకారం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షపడుతుంది. -
ఖైదీల నుంచి కోట్లలో వసూళ్లకు పాల్పడ్డారు
న్యూఢిల్లీ: జైలులో విలాసవంతమైన జీవితం గడిపేందుకు సుకేశ్ చంద్ర శేఖర్ వంటి హై ప్రొఫైల్ ఖైదీల నుంచి ఢిల్లీ జైళ్ల శాఖ మాజీ మంత్రి సత్యేందర్ జైన్, ఆ శాఖ మాజీ డీజీ సందీప్ గోయెల్ కోట్లలో వసూళ్లకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఈ మేరకు వారిపై కేసు నమోదుకు అనుమతివ్వాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను కోరింది. సత్యేందర్ జైన్‌తోపాటు జైలు అధికారి రాజ్‌కుమార్‌లపై కేసు నమోదు కోసం లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు, సస్పెండైన ఐపీఎస్ అధికారి గోయెల్, రిటైర్డు ఐఏఎస్ ముకేశ్ ప్రసాద్‌లపై చర్యలకు కేంద్ర హోం శాఖకు వినతి పంపినట్లు సీబీఐ వివరించింది. వసూళ్లకు పాల్పడిన ఆరోపణలతో గత ఏడాది గోయెల్‌ను కేంద్ర హోం శాఖ సస్పెండ్ చేసింది. జైలులో విలాసవంతమైన జీవితం గడిపేందుకు మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ 2018–21 సంవత్సరాల మధ్య సుమారు రూ.12.50 కోట్లను వేర్వేరు మార్గాల్లో వీరికి ముట్టజెప్పినట్లు తమకు సమాచారం ఉందని సీబీఐ అంటోంది. -
ఎవరికైనా.. ఆ రాముడే దిక్కు!
రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు.. ఎవరైనా, ఏ పార్టీ వారైనా సరే ఏదైనా న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నారంటే వాళ్లు జపించే మంత్రం ఒక్కటే. రాం.. రాం.. రాం.. ఆయనెవరో కాదు, ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ. తాజాగా అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా చివరకు రాం జెఠ్మలానీనే తన తరఫున వాదించేందుకు నియమించుకున్నారు. పెద్ద పెద్ద క్లయింట్లు ఎక్కువ మంది ఉండటంతో ఆయన వారి నుంచి భారీగానే గంటల లెక్కన ఫీజు వసూలుచేస్తారు. దాన్ని ఆయన సమర్థించుకుంటారు కూడా. జయలలిత లాంటి వాళ్ల దగ్గర ఎక్కువ ఫీజే తీసుకుంటానని, కానీ తాను వాదించే మొత్తం కేసుల్లో కేవలం పది శాతం నుంచి మాత్రమే తనకు ఇలా డబ్బు వస్తుందని ఆయన అన్నారు. నానావతి హత్యకేసు లాంటి కీలకమైన కేసు వాదించడంతో రాం జెఠ్మలానీ పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మార్మోగింది. కేసులు వాదించడానికి ఆయన తన సిద్ధాంతాలను వదులుకోడానికి కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు. ఇందిరాగాంధీ హత్య కేసులో బల్బీర్ సింగ్ తరఫున వాదించాల్సిందిగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్ఎస్ సోధీ ఆయన్ను ఒకప్పుడు కోరారు. అప్పటికి ఆయన బీజేపీ సభ్యుడు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి మరీ కేసు తీసుకున్నారు. పార్లమెంటు మీద దాడి కేసులో నిందితుల తరఫున కూడా ఆయన వాదించడం పట్ల తీవ్ర విమర్శలు తలెత్తినా వాటిని ఏనాడూ పట్టించుకోలేదు. 17 ఏళ్ల వయసులోనే కరాచీ లా స్కూల్ నుంచి న్యాయవాద విద్య పూర్తి చేశారు. అయితే 21 ఏళ్లు నిండితే తప్ప వాదించడానికి వీల్లేకపోవడంతో ప్రత్యేక అనుమతి తీసుకుని మరీ కోర్టుకు వెళ్లారు. ఇప్పటివరకు అనేక ప్రముఖ కేసులు వాదించిన రాం జెఠ్మలానీ.. ఇప్పుడు విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా తనకు సహకరిస్తుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం మంగళవారం నాడు బెంగళూరు కోర్టులో తమిళనాడు మాజీ సీఎం జయలలిత బెయిల్ కేసు వాదించేందుకు బస్తాలకొద్దీ పత్రాలతో కుస్తీలు పడుతున్నారు.