అస్తానా: మధ్య ఆసియా దేశం కజకస్తాన్ నిరసనలతో అట్టుడికిపోతోంది. ఓ మాజీ మంత్రి తన భార్యను అతికిరాతకంగా కొట్టి చంపిన వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ మానవ మృగం కోర్టు విచారణ ఎదుర్కొంటుండగా.. కఠిన శిక్ష పడాలంటూ ఆందోళనలు చేపట్టారు అక్కడి ప్రజలు.
కువాన్‌దిక్ బిషింబయెవ్(44) కజకస్తాన్ దేశపు మాజీ ఆర్థిక మంత్రి. ఈయన బంధువు పేరిట ఉన్న ఓ రెస్టారెంట్‌లో గతేడాది నవంబర్‌లో ఆయన సతీమణి సల్తానత్ నుకెనోవా(31) అనుమానాస్పద రీతిలో మృతి చెందిది. అంతకు ముందు ఒకరోజు అంతా ఆ జంట ఆ హోటల్‌లోనే గడిపింది.
అయితే విచారణలో ఆయనే ఆమెను దారుణంగా హింసించి చంపినట్లు తేలింది. దీంతో ఆయన కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు. ఈలోపు ఆ హోటల్ సీపీ టీవీ ఫుటేజీలు బయటకు వచ్చాయి. జుట్టుపట్టి ఈడ్చి కొట్టి.. ఇష్టానుసారం తన్ని.. సుమారు ఎనిమిది గంటల పాటు ఆ కిరాతకం కొనసాగింది. రక్తపు మడుగులో అచేతనంగా భార్య పడి ఉన్నప్పటికీ ఆమె బాగానే ఉందంటూ హోటల్ సిబ్బందితో బిషింబయెవ్ చెప్పడం కూడా వీడియోలో రికార్డయ్యింది. చివరకు 12 గంటల తర్వాత ఆంబులెన్స్ అక్కడికి చేరుకోగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు.
తలకు, ముక్కుకు బలమైన గాయం కావడం, ఒంటిపై పలు చోట్ల గాయాల్ని శవ పరీక్షలో గుర్తించారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో.. సీసీ టీవీ ఫుటేజీ సహా సాక్ష్యాలన్నింటిని మాయం చేసేందుకు బిషింబయెవ్ ప్రయత్నించారని పోలీసులు తేల్చారు. అంతేకాదు.. తన భార్య మానసిక స్థితి బాగోలేదని, ఈ క్రమంలోనే తనకు తాను గాయాలు చేసుకుని ఆమె చనిపోయిందని న్యాయస్థానాల్ని నమ్మించే యత్నం చేశాడు కూడా.
అయితే.. 8 గంటలపాటు సాగిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియో ఫుటేజీ బయటకు రావడంతో ఆ భర్త అకృత్యం వెలుగు చూసింది. భార్యను అలా ఎందుకు చంపాడో మాత్రం ఇంకా నోరు విప్పలేదు నిందితుడు. అయితే ఆమెను అంత క్రూరంగా చంపిన ఆ మాజీ మంత్రిని కఠినంగా శిక్షించాలంటూ అక్కడి ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో గృహ హింస చట్టం గురించి విస్తృతంగా చర్చ జరిగింది అక్కడ.
ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఆ దేశపు సుప్రీం కోర్టులో జరుగుతోంది. కజకస్తాన్ చరిత్రలోనే తొలిసారి ఈ కేసు విచారణను లైవ్ టెలికాస్ట్ చేయబోతోంది ఆ దేశ అత్యున్నన్యాయస్థానం. బిషింబయెవ్ నేరం గనుక రుజువు అయితే అక్కడి చట్టాల ప్రకారం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment