Astana
-
భార్యను అతికిరాతకంగా చంపిన మాజీ మంత్రి
అస్తానా: మధ్య ఆసియా దేశం కజకస్తాన్ నిరసనలతో అట్టుడికిపోతోంది. ఓ మాజీ మంత్రి తన భార్యను అతికిరాతకంగా కొట్టి చంపిన వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ మానవ మృగం కోర్టు విచారణ ఎదుర్కొంటుండగా.. కఠిన శిక్ష పడాలంటూ ఆందోళనలు చేపట్టారు అక్కడి ప్రజలు.కువాన్దిక్ బిషింబయెవ్(44) కజకస్తాన్ దేశపు మాజీ ఆర్థిక మంత్రి. ఈయన బంధువు పేరిట ఉన్న ఓ రెస్టారెంట్లో గతేడాది నవంబర్‌లో ఆయన సతీమణి సల్తానత్ నుకెనోవా(31) అనుమానాస్పద రీతిలో మృతి చెందిది. అంతకు ముందు ఒకరోజు అంతా ఆ జంట ఆ హోటల్లోనే గడిపింది.అయితే విచారణలో ఆయనే ఆమెను దారుణంగా హింసించి చంపినట్లు తేలింది. దీంతో ఆయన కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు. ఈలోపు ఆ హోటల్ సీపీ టీవీ ఫుటేజీలు బయటకు వచ్చాయి. జుట్టుపట్టి ఈడ్చి కొట్టి.. ఇష్టానుసారం తన్ని.. సుమారు ఎనిమిది గంటల పాటు ఆ కిరాతకం కొనసాగింది. రక్తపు మడుగులో అచేతనంగా భార్య పడి ఉన్నప్పటికీ ఆమె బాగానే ఉందంటూ హోటల్ సిబ్బందితో బిషింబయెవ్ చెప్పడం కూడా వీడియోలో రికార్డయ్యింది. చివరకు 12 గంటల తర్వాత ఆంబులెన్స్ అక్కడికి చేరుకోగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు.తలకు, ముక్కుకు బలమైన గాయం కావడం, ఒంటిపై పలు చోట్ల గాయాల్ని శవ పరీక్షలో గుర్తించారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో.. సీసీ టీవీ ఫుటేజీ సహా సాక్ష్యాలన్నింటిని మాయం చేసేందుకు బిషింబయెవ్ ప్రయత్నించారని పోలీసులు తేల్చారు. అంతేకాదు.. తన భార్య మానసిక స్థితి బాగోలేదని, ఈ క్రమంలోనే తనకు తాను గాయాలు చేసుకుని ఆమె చనిపోయిందని న్యాయస్థానాల్ని నమ్మించే యత్నం చేశాడు కూడా.అయితే.. 8 గంటలపాటు సాగిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియో ఫుటేజీ బయటకు రావడంతో ఆ భర్త అకృత్యం వెలుగు చూసింది. భార్యను అలా ఎందుకు చంపాడో మాత్రం ఇంకా నోరు విప్పలేదు నిందితుడు. అయితే ఆమెను అంత క్రూరంగా చంపిన ఆ మాజీ మంత్రిని కఠినంగా శిక్షించాలంటూ అక్కడి ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో గృహ హింస చట్టం గురించి విస్తృతంగా చర్చ జరిగింది అక్కడ. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఆ దేశపు సుప్రీం కోర్టులో జరుగుతోంది. కజకస్తాన్ చరిత్రలోనే తొలిసారి ఈ కేసు విచారణను లైవ్ టెలికాస్ట్ చేయబోతోంది ఆ దేశ అత్యున్నన్యాయస్థానం. బిషింబయెవ్ నేరం గనుక రుజువు అయితే అక్కడి చట్టాల ప్రకారం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షపడుతుంది. -
ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ టోర్నీకి జ్యోతి
ఈనెల 10 నుంచి 12 వరకు కజకిస్తాన్ రాజధాని అస్తానాలో జరిగే ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 25 మందితో కూడిన భారత జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్టార్ స్ప్రింటర్ జ్యోతి యర్రాజీకి చోటు లభించింది. విశాఖపట్టణానికి చెందిన జ్యోతి 60 మీటర్లు, 60 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్స్‌లో పోటీపడుతుంది. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన మిరామస్ ఎలైట్ ఇండోర్ ట్రాక్ అథ్లెటిక్స్ మీట్లో జ్యోతి 60 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు రజత పతకం సాధించింది. -
సాకేత్ సంచలనం
అస్తానా (కజకిస్తాన్): ప్రెసిడెంట్స్ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని సంచలనం సృష్టించాడు. ప్రపంచ మాజీ ఎనిమిదో ర్యాంకర్ మిఖాయిల్ యూజ్నీ (రష్యా)ని బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో 357వ ర్యాంకర్ సాకేత్ 3–6, 6–4, 6–3తో టాప్ సీడ్, ప్రపంచ 105వ ర్యాంకర్ యూజ్నీపై గెలిచాడు. గంటా 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ 14 ఏస్‌లు సంధించడంతోపాటు యూజ్నీ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. -
భారత్, పాకిస్తాన్ కలిసికట్టుగా..
అస్తానా: సరిహద్దులో నిత్యం పోట్లాడుకునే దాయాదులు.. కలిసికట్టుగా ఒకే ప్రతిజ్ఞ చేసిన సందర్భమిది. ప్రఖ్యాత షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ)లోకి పూర్తిస్థాయి సభ్యులుగా భారత్, పాకిస్తాన్‌లు ప్రమాణం చేశాయి. కజకిస్తాన్ రాజధాని అస్తానాలో ఎస్సీఓ వార్షిక సదస్సులో ఈ మేరకు ఇరు దేశాలు సంతకాలు చేశాయి. పూర్తికాల సభ్యులుగా చేరిన సందర్భంగా భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్‌లను సంస్థలోని ఇతర సభ్యదేశాలు అభినందించాయి. యూరప్-ఆసియా దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ, సైనిక సహకారం కోసం షాంఘై(1996లో)లో ఏర్పాటయిన కూటమిని షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ)లో చైనా, కజకిస్తాన్, కర్గీజ్‌స్తాన్, తజకిస్తాన్, రష్యాలు వ్యవస్థాపక సభ్యుదేశాలుగా ఉన్నాయి. మొదటి విస్తరణ(2001)లో ఉబ్జెకిస్తాన్ సభ్యత్వం పొందగా.. నేడు(9 జూన్, 2017) భారత్, పాకిస్థాన్‌లు పూర్తికాల సభ్యులయ్యాయి. ఉగ్రవాదంపై పోరుకు మోదీ పిలుపు 12ఏళ్ల పరిశీలన అనంతరం భారత్‌కు ఎస్సీఓ సభ్యత్వం దక్కడం ఆనందరంగా ఉందన్న ప్రధాని నరేంద్ర మోదీ.. సభ్యదేశాలన్నింటికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కలిసికట్టుగా పోరాడుదామని అన్నారు. మానవాళికి పొంచి ఉన్న అతిపెద్ద ముప్పు ఉగ్రవాదమేనని, దానిని అంతం చేస్తేనేగానీ ప్రగతి సాధించలేమని పేర్కొన్నారు. భారత్‌కు పాక్ అభినందనలు ‘ఎస్సీఓలో సభ్యత్వం పొందిన శుభసందర్భంలో భారత్‌కు నా శుభాకాంక్షలు..’ అంటూ పాక్ ప్రధాని నవాజ్ షరీప్ తన ఉపన్యాసాన్ని ప్రారంభించడం గమనార్హం. ‘మన భవిష్యత్ తరాలను యుద్ధం, సంఘర్షణలవైపు పోనియ్యకుండా శాంతిసమాధానాలతో జీవించేలా చేయడం మన కర్తవ్యం. ఇందుకు షాంఘై సహకార సంస్థ కృషిచేస్తుంది’అని షరీఫ్ అన్నారు. -
భారత్ హ్యాట్రిక్
అస్తానా (కజకిస్తాన్) : ఫెడరేషన్ కప్‌లో ఇండియా వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఆసియా ఓసియానియా గ్రూప్ 2 పూల్-డి చివరి లీగ్‌లో భారత్ 2-1తో న్యూజిలాండ్‌పై నెగ్గింది. తొలి సింగిల్స్‌లో ప్రార్థన 6-1, 6-4తో డానీ హాలెండ్పై గెలిచి శుభారంభాన్ని అందించింది. రెండో సింగిల్స్‌లో అంకితా రైనా 1-6, 2-6తో ఎరకోవిచ్ చేతిలో ఓటమిపాలైంది. కీలకమైన డబుల్స్ మ్యాచ్‌లో ప్రార్థనతో కలిసి సానియా సత్తా చాటింది. 7-5, 6-1తో భారత్‌కు విజయాన్ని అందించింది. గ్రూప్ ఏ విజేత హాంకాంగ్‌తో భారత్ తలపడనుంది.