జయ కేసు తీర్పును సమీక్షించం: సుప్రీం
న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీం తీర్పును సమీక్షించాలన్న కర్ణాటక ప్రభుత్వం వినతిని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ‘ఈ కేసులో కోర్టు ముందుకొచ్చిన సమీక్ష పిటిషన్‌ను తిరస్కరిస్తున్నాం. మా దృష్టిలో జయ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఫిబ్రవరి 14, 2017న ఇచ్చిన తీర్పుపై ఎలాంటి సమీక్ష జరపబోం’ అని జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ అమితవ రాయ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 14న తన తీర్పులో సుప్రీంకోర్టు ఏఐఏడీఎంకే చీఫ్ వీకే శశికళతోపాటు మరో ఇద్దరిని దోషులుగా నిర్ధారించటంతోపాటు జయలలిత చనిపోయినందున ఆమెను కేసునుంచి తప్పించింది. జరిమానా వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే జయను తప్పించటం వల్ల రూ.100కోట్ల జరిమానాను రాబట్టుకోవటం కష్టమని.. అదువల్ల ఇటీవలి తీర్పును సమీక్షించాలంటూ కర్ణాటక పిటిషన్ వేసింది. దీన్ని సుప్రీంకోర్టు బుధవారం కొట్టేసింది.