సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో పర్యటించనున్నారు. ఆరోజు మధ్యాహ్నం ప్రధాని పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్‌ను సందర్శిస్తారు. అనంతరం జరిగే సభలో పాల్గొంటారు. ప్రధాని పర్యటనకు ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి శనివారం అధికారులతో సమీక్షించారు.
ప్రధాన మంత్రి పర్యటనలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. ప్రధాని పర్యటనకు పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని డీజీపీకి చెప్పారు. భద్రత, రవాణా, వసతి, వైద్యసేవలు వంటివి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి జిల్లా యంత్రాంగం తరఫున పాస్‌లు జారీ చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.
ఈ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తొలుత జీఏడీ ముఖ్య కార్యదర్శి ఆర్.ముత్యాలరాజు శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐబీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్, ఐ అండ్ పీఆర్ జేడీ పి.కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు, ఎస్పీ మాధవరెడ్డి, ప్రొటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, డీఎంఈ డాక్టర్ నరసింహం, ఐ అండ్ పీఆర్ జేడీ కస్తూరి, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ డి.మురళి వర్చువల్‌గా హాజరయ్యారు.
ప్రధాని పర్యటన ఇలా
16న మధ్యాహ్నం ప్రధాని మోదీ పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్‌లోని యాంటీక్యూస్ స్మగ్లింగ్ స్టడీ సెంటర్‌ను, నార్కోటిక్స్ స్టడీ సెంటర్‌ను సందర్శిస్తారు. తర్వాత వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఎక్స్– రే, బ్యాగేజ్ స్క్రీనింగ్ కేంద్రాన్ని సందర్శిస్తారు. తదుపరి అకాడమీ బ్లాకు వద్ద రుద్రాక్ష మొక్కలు నాటి, అక్కడ భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడతారు.
వారితో గ్రూప్ ఫొటో దిగుతారు. అనంతరం 74, 75వ బ్యాచ్‌ల ఆఫీసర్ ట్రైనీలతో ముఖాముఖిలో పాల్గొంటారు. తదుపరి పబ్లిక్ ఫంక్షన్‌లో ‘ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం అకాడమీ కేంద్రానికి అక్రెడిటేషన్ సర్టిఫికెట్‌ను అందిస్తారు. ఆ తర్వాత జరిగే సభలో ప్రసంగించిన అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళతారు.
Comments
Please login to add a commentAdd a comment