చీనీ చెట్లను అమాంతం తినేస్తున్న కొత్త రకం పురుగులు
దేశంలోనే తొలిసారి అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో గుర్తించిన శాస్త్రవేత్తలు
లక్షలాదిగా పుడతాయి.. సామూహికంగా దాడి చేస్తాయి
సాక్షి, అమరావతి: చీనీ (బత్తాయి) రైతులకు కొత్త తలనొప్పి మొదలైంది. ‘ఏలియన్ పెస్ట్’గా పిలిచే హైలోకోకస్ స్ట్రిటస్ (రుస్సెల్) అనే కొత్త రకం పొలుసు పురుగును దేశంలోనే తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో చీనీ పంటపై మన శాస్త్రవేత్తలు గుర్తించారు. చూడటానికి సూక్ష్మజీవిలా కనిపించే ఈ పురుగులు బత్తాయి మొక్కల కాండం తొలిచేయడంతోపాటు ఆకుల్లో పత్రహరితం లేకుండా తినేస్తున్నాయి. ఈ పురుగుల ఉధృతిని చూసి శాస్త్రవేత్తలు సైతం ఆందోళనకు గురవుతున్నారు.
విదేశాల నుంచి వచ్చిన అరుదైన పురుగు
ఇండోనేషియా, సింగపూర్ దేశాల్లో ఈ పురుగును తొలిసారిగా 1981లో గుర్తించారు. అక్కడ కూడా చీనీ పంటపైనే వీటిని కనుగొన్నారు. ఈ రెండు దేశాల్లో తప్ప ప్రపంచంలో మరే దేశంలోనూ వీటి జాడ ఇప్పటివరకు గుర్తించలేదు. అలాంటిది తొలిసారి అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో వీటి ఉనికిని ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఐదారు వేల ఎకరాల్లో ఈ పురుగు ఉధృతి ఉన్నట్టు గుర్తించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొక్కలు, నర్సరీ మెటీరియల్స్ ద్వారా ఈ పురుగులు మన ప్రాంతానికి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.
అంగుళంలో 8వ వంతు సైజులో ఊదా రంగులో ఉండే ఈ పొలుసు పురుగుపై ఇతర పొలుసు పురుగుల మాదిరిగా శరీరంపై వాక్సీ లేయర్ (మైనపు పొర) ఉండదు. అందువల్ల ఈ పురుగు పూర్త పారదర్శకంగా కన్పిస్తుంది. ఈ పురుగు వ్యాప్తి చెందితే దిగుబడులపై ప్రభావం చూపడం కాకుండా.. మొత్తం తోటలనే సర్వనాశనం చేస్తుంది. ఈ పురుగులు లక్షల్లో పుట్టుకొస్తాయి. సామూహికంగా వ్యాపిస్తుంటాయి.
ఒకసారి సోకిన తర్వాత 30–40 శాతం పంటను తుడిచి పెట్టేస్తుంది. రైతులు ఏమరుపాటుగా ఉంటే నూరు శాతం పంట నాశనమవుతుంది. చెట్టు వయసుతో సంబంధం లేకుండా చిన్న మొక్క నుంచి ముదురు తోటల వరకు వ్యాపిస్తుంది. సమీప భవిష్యత్‌లో బత్తాయి నుంచి ఇతర నిమ్మ జాతి మొక్కలకు కూడా సోకే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.
పరిశోధనలు చేస్తున్నాం
ఈ పొలుసు జాతి పురుగును శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరులోని చీని తోటలపై తొలిసారి గుర్తించాం. అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో కూడా ఈ పురుగు ఉదృతి కనిపించింది. వీటి ఉనికి, ఉధృతిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం.
చీనీ, నిమ్మ జాతి తోటలపై తీవ్ర ప్రభావం చూపే ఈ అరుదైన పురుగులపై పరిశోధనలు ప్రారంభించాం. ఇవి ఎంత కాలం జీవిస్తాయి. ఏయే పంటలపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయి, వీటి నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలేమిటనే అంశాలపై లోతైన పరిశోధనలు చేస్తున్నాం.
– డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, వెంకటగిరి
Comments
Please login to add a commentAdd a comment