వరి పంటను మూడు రోజుల్లోనే తినేస్తున్న రెల్లరాల్చు పురుగులు
నివారణ చర్యలు చేపట్టేలోగానే చేలను చుట్టేస్తున్న పురుగులు
ఉత్తరాంధ్రలో పంటకు నిప్పుపెడుతున్న రైతులు
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర ప్రాంతంలో వరి చేలను కత్తెర, కొమ్ము పురుగులు రైతుల పాలిట అశనిపాతంలా తయారయ్యాయి. నివారణ చర్యలు చేపట్టేలోగా చేలను చుట్టేసి కేవలం మూడు రోజుల్లోనే వరి కంకులను తినేస్తున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది.
ఆ మూడు జిల్లాల్లో ఖరీఫ్ సీజన్‌లో 10లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇప్పటికే 50 శాతం కోతలు పూర్తయ్యాయి. ఈ దశలో కత్తెర, కొమ్ము పురుగులు విజృంభిస్తూ పంటను తినేస్తున్నాయి. పురుగులు ఆశించిన పొలాల్లో 30నుంచి 80 శాతం పంట పూర్తిగా దెబ్బతింది. నీటిఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ పురుగుల దాడి తీవ్రంగా కనిపిస్తోంది.
విజయనగరం జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంట ఈ పురుగుల ఉ«ధృతితో దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. జామి, గంట్యాడ, గరివిడి, నెల్లిమర్ల, గజపతినగరం, బొండపల్లి, పూసపాటిరేగ, చీపురుపల్లి మండలాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
పంటకు నిప్పు పెడుతున్న రైతులు
విజయనగరం జిల్లా బుడతనాపల్లిలో పురుగు సోకడంతో 75 ఎకరాల్లో వరి పంట గడ్డిలా తెల్లబారిపోవడంతో కోసేందుకు పనికిరాకుండా పోయింది. దీంతో చేసేది లేక ఈ ప్రాంత రైతులు వరి పొలాలకు నిప్పు పెడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం ఎస్.నర్సాపురం పరిసర గ్రామాలతో పాటు అనకాపల్లి జిల్లాలోని పలు మండలాల్లో కూడా కత్తెర పురుగు వ్యాపిస్తున్నట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదని, స్థానిక వ్యవసాయాధికారులకు చెప్పినా తమను పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. గతంలో ఇలాంటి పురుగులు, తెగుళ్లు సోకినప్పుడు శాస్త్రవేత్తల బృందాలను రంగంలోకి దింపి సామూహిక నివారణ చర్యలు చేపట్టేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఆరోపిస్తున్నారు.
ఏడెకరాల పంటను మూడు రోజుల్లో తినేశాయి
7 ఎకరాలను కౌలుకు తీసుకుని ఎంటీయూ–1126 రకం వరి వేశాను. ఎకరాకు 40 బస్తాలకుపైగా దిగుబడి వస్తుందని ఆశించాను. పంట కోత కొచి్చన వేళ ఉన్నట్టుండి కత్తెర, కొమ్ము పురుగులు విరుచుకుపడ్డాయి. కేవలం మూడే మూడు రోజుల్లో 7 ఎకరాల పంటను పూర్తిగా తినేశాయి.. ఎకరాకు రూ.35వేల చొప్పున అప్పు చేసి పెట్టిన రూ.2.50 లక్షలు ఆవిరైపోయాయి. ఏం చేసేది లేక పంటకు నిప్పు పెట్టాను. అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. – చల్లా రామునాయుడు, బుడతానాపల్లి, విజయనగరం జిల్లా
నష్టపరిహారం చెల్లించాలి
యుద్ధప్రాతిపదికన ఆ ప్రాంతాలకు శాస్త్రవేత్తలను పంపించి వరి పంటను ఆశిస్తున్న పురుగులను పరిశీలించి డ్రోన్ల సాయంతో సామూహిక నివారణ చర్యలు చేపట్టాలి. ఈ పురుగుల ఉధృతి కారణంగా ఉత్తరాంధ్రలో కోతకు సిద్ధంగా ఉన్న పంట పొలాల్లో 30 శాతానికి పంట దెబ్బతింది. నష్టపోయిన రైతులకు ప్రకృతి విపత్తుల కింద పంట నష్టపరిహారం ఇవ్వాలి. – ఎం.హరిబాబు, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలురైతుల సంఘం
Comments
Please login to add a commentAdd a comment