సీతంపేట(పార్వతిపురం మన్యం): మన్యంలో పుల్లదబ్బ సీజన్ ఆరంభమైంది. ఈ ఏడాది దిగుబడి పెరగడంతో మైదాన ప్రాంతాల వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అంతగా పెట్టుబడులు అక్కర్లేక పోవడంతో భామిని, సీతంపేట ఏజెన్సీలో సుమారు 2 వందల ఎకరాల వరకు పంటను కొండపోడు వ్యవసాయంలో గిరిజనరైతులు పండిస్తారు. అక్కడక్కడ పోడులో వీటిని వేస్తారు. సుమారు 100 టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా. కావిడ దబ్బ రూ. 200 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నామని గిరిజనులు తెలిపారు. గతేడాది ఇదేసీజన్లో ఒక్కో కావిడి ఇవే ధరలకు అమ్మేవారమని గిరిజనులు చెబుతున్నారు. హడ్డుబంగి, సోమగండి, గొయిది, శంభాం, కుశిమి, పెదరామ తదితర పంచాయతీల పరిధిలో దబ్బ ఎక్కువగా పండుతుంది.
వారపు సంతల్లో విక్రయాలు
ఒక్కో పుల్ల దబ్బ పండు మైదాన ప్రాంతాల్లో ఒక రూపాయికి విడిగా విక్రయిస్తారు. ఇక్కడ ఒక్కో పండు అర్ధరూపాయికి సరాసరి కొనుగోలు చేసిన వ్యాపారులు పట్టణాల్లో కిలోల వంతున విక్రయిస్తారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఒరిశా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తారు. సీతంపేటలో సోమవారం, మర్రిపాడులో బుధవారం, గురువారం దోనుబాయిలో కుశిమి, పొల్ల గ్రామాల్లో శనివారం వారపు సంతలకు వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. మరి కొందరు వ్యాపారులు నేరుగా గ్రామాలకే వెళ్లి ఖరీదు చేస్తున్నారు.
పుల్లదబ్బ ఎక్కువగా పచ్చళ్లు తయారు చేసే చిన్నతరహా కంపెనీలకు విక్రయిస్తామని వ్యాపారులు చెబుతూ గిరిజన రైతులు నిర్ణయించిన ధరలు కాకుండా సిండికేట్‌గా మారి ధర నిర్ణయిస్తారు. దీంతో వారు చెప్పిన ధరలకు గిరిజనులు విక్రయించాల్సి ఉంటుంది. కొన్ని గ్రామాల్లో గిరిజనులు ముందుగా వ్యాపారుల నుంచి అడ్వాన్స్‌లు తీసుకుంటారు. పంట పక్వానికి వచ్చే సమయంలో వ్యాపారులకు సరుకు అప్పగిస్తారు.
వ్యాపారుల ధరకే విక్రయిస్తున్నాం
పైనాపిల్, సీతాఫలం తర్వాత ఆదాయాన్ని ఇచ్చేది దబ్బ పంట. కావిళ్లలో మోసుకుని తీసుకువస్తాం. వ్యాపారులు నిర్ణయించిన ధరకు అమ్మకాలు చేస్తున్నాం.
– ఎస్.రైకన్న, అక్కన్నగూడ
పంట దిగుబడి బాగుంది
ఈ సంవత్సరం పంట దిగుబడి బాగుంది: కొండపోడు వ్యవసాయంలో పండిస్తాం కాబట్టి సేకరణ కష్టంగా ఉంటుంది. ఈ సీజన్ వచ్చేనెల వరకు ఉంటుంది. ఒడిశా వ్యాపారులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.
– ఎస్.ఎల్లంగో, మెట్టుగూడ
చదవండి: ఒకేసారి డబుల్ డిగ్రీలు.. యూజీసీ మార్గదర్శకాలు ఇవే..
Comments
Please login to add a commentAdd a comment