mosambi farmers
-
చీనీ పంటకు ‘ఏలియన్’ పీడ
సాక్షి, అమరావతి: చీనీ (బత్తాయి) రైతులకు కొత్త తలనొప్పి మొదలైంది. ‘ఏలియన్ పెస్ట్’గా పిలిచే హైలోకోకస్ స్ట్రిటస్ (రుస్సెల్) అనే కొత్త రకం పొలుసు పురుగును దేశంలోనే తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో చీనీ పంటపై మన శాస్త్రవేత్తలు గుర్తించారు. చూడటానికి సూక్ష్మజీవిలా కనిపించే ఈ పురుగులు బత్తాయి మొక్కల కాండం తొలిచేయడంతోపాటు ఆకుల్లో పత్రహరితం లేకుండా తినేస్తున్నాయి. ఈ పురుగుల ఉధృతిని చూసి శాస్త్రవేత్తలు సైతం ఆందోళనకు గురవుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన అరుదైన పురుగు ఇండోనేషియా, సింగపూర్ దేశాల్లో ఈ పురుగును తొలిసారిగా 1981లో గుర్తించారు. అక్కడ కూడా చీనీ పంటపైనే వీటిని కనుగొన్నారు. ఈ రెండు దేశాల్లో తప్ప ప్రపంచంలో మరే దేశంలోనూ వీటి జాడ ఇప్పటివరకు గుర్తించలేదు. అలాంటిది తొలిసారి అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో వీటి ఉనికిని ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఐదారు వేల ఎకరాల్లో ఈ పురుగు ఉధృతి ఉన్నట్టు గుర్తించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొక్కలు, నర్సరీ మెటీరియల్స్ ద్వారా ఈ పురుగులు మన ప్రాంతానికి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. అంగుళంలో 8వ వంతు సైజులో ఊదా రంగులో ఉండే ఈ పొలుసు పురుగుపై ఇతర పొలుసు పురుగుల మాదిరిగా శరీరంపై వాక్సీ లేయర్ (మైనపు పొర) ఉండదు. అందువల్ల ఈ పురుగు పూర్త పారదర్శకంగా కన్పిస్తుంది. ఈ పురుగు వ్యాప్తి చెందితే దిగుబడులపై ప్రభావం చూపడం కాకుండా.. మొత్తం తోటలనే సర్వనాశనం చేస్తుంది. ఈ పురుగులు లక్షల్లో పుట్టుకొస్తాయి. సామూహికంగా వ్యాపిస్తుంటాయి. ఒకసారి సోకిన తర్వాత 30–40 శాతం పంటను తుడిచి పెట్టేస్తుంది. రైతులు ఏమరుపాటుగా ఉంటే నూరు శాతం పంట నాశనమవుతుంది. చెట్టు వయసుతో సంబంధం లేకుండా చిన్న మొక్క నుంచి ముదురు తోటల వరకు వ్యాపిస్తుంది. సమీప భవిష్యత్‌లో బత్తాయి నుంచి ఇతర నిమ్మ జాతి మొక్కలకు కూడా సోకే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. పరిశోధనలు చేస్తున్నాంఈ పొలుసు జాతి పురుగును శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరులోని చీని తోటలపై తొలిసారి గుర్తించాం. అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో కూడా ఈ పురుగు ఉదృతి కనిపించింది. వీటి ఉనికి, ఉధృతిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. చీనీ, నిమ్మ జాతి తోటలపై తీవ్ర ప్రభావం చూపే ఈ అరుదైన పురుగులపై పరిశోధనలు ప్రారంభించాం. ఇవి ఎంత కాలం జీవిస్తాయి. ఏయే పంటలపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయి, వీటి నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలేమిటనే అంశాలపై లోతైన పరిశోధనలు చేస్తున్నాం. – డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, వెంకటగిరి -
మాయాజాలం
- సూట్ రద్దుతో చీనీ వ్యాపారుల కొత్త దారులు - ధర తగ్గిస్తూ రైతుల పొట్ట కొడుతున్న వైనం - నిలకడ లేని ధరలతో నష్టపోతున్న అన్నదాతలు అనంతపురం అగ్రికల్చర్ : చీనీ వ్యాపారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. సూట్ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో వారు కొత్తదారులను వెతుక్కుంటున్నారు. ధర తగ్గించడం ద్వారా రైతులను అన్యాయం చేస్తున్నారు. అనంతపురం వ్యవసాయ మార్కెట్‌యార్డుకు 20 రోజులుగా చీనీకాయలు పెద్దఎత్తున వస్తున్నాయి. ఇటీవల ధరలు కూడా కొద్దిమేర పెరగడంతో తోటల్లో పంట కోతను ముమ్మరం చేశారు. రోజూ 500 నుంచి 800 టన్నుల వరకు కాయలు మార్కెట్‌కు వస్తున్నాయి. సోమవారం కూడా 800 టన్నుల వరకు వచ్చాయి. అయితే.. ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఒక లాటు మాత్రమే గరిష్టంగా టన్ను రూ.31 వేలు పలికినట్లు యార్డు వర్గాలు తెలిపాయి. దాదాపు 170 లాట్లు వేలం వేశారు. ఇందులో 15 నుంచి 20 లాట్లు మాత్రమే రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు అమ్ముడుపోయాయి. మిగతావన్నీ రూ.20 వేలకు కాస్త అటూ ఇటు పలికాయి. కొన్ని లాట్లు రూ.15-20 వేలలోపే అమ్ముడుపోవడంతో రైతులు నిరాశ చెందారు. నిలకడ లేని ధరలతో నష్టం ఈ సీజన్లో నిలకడలేని ధరలతో చీనీ రైతులు భారీగా నష్టపోయారు. మార్చి నుంచి మే 15వ తేదీ వరకు ధరలు భారీగా పతనం కావడంతో రైతులకు రూ.300 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. మొదటి మూడు నెలలు టన్ను గరిష్ట ధర రూ.15 వేలకు మించలేదు. మే 15 తర్వాత ధరల్లో కొంత పెరుగుదల కనిపించింది.టన్ను సరాసరి రూ.20 వేలు పలికాయి. ఈ నెలలో మరికాస్త ధర పెరగడంతో రైతులకు ఊరట లభించింది. సరాసరి ధర రూ.23 వేలకు చేరింది. గరిష్టంగా రూ.32 వేల వరకు పలికింది. చాలా లాట్లకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు లభించింది. ధరలు పెరిగినా సూట్లు, కమీషన్లు ఎక్కువ కావడంతో రైతులకు నష్టం వాటిల్లుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈ అంశంపై నాలుగు రోజుల కిందట రాయదుర్గంలో జరిగిన ఏరువాక పౌర్ణమి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. సీఎం ఆదేశాల మేరకు అనంతపురం ఆర్డీవో, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల అధికారులు చీనీ వ్యాపారులు, మండీ మర్చెంట్లతో సమావేశమయ్యారు. సింగిల్, డబుల్ సూట్లు తీసుకున్నా, అధిక మొత్తంలో కమీషన్లు దండుకున్నా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన వేలం పాటలో కొందరు సూట్లు పూర్తిగా రద్దు చేయగా, మరికొందరు టన్నుకు 20 కిలోల సూట్‌తో వ్యాపారం కొనసాగించారు. గతంలో సూట్ రూపంలో టన్నుకు 120 కిలోలు తీసుకునేవారు. తోటల్లో అయితే మరింత ఎక్కువగా 200 కిలోల వరకు తీసుకునేవారు. ధర తగ్గించిన వ్యాపారులు అధికారుల హెచ్చరిక నేపథ్యంలో అనంతపురం పండ్లమార్కెట్లో సోమవారం సూట్ బాగా తగ్గించేసిన వ్యాపారులు.. అదే క్రమంలో ధరలు కూడా తగ్గించడం గమనార్హం. మండీమర్చెంట్లు, వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి, క్రయ విక్రయాలు నిర్వహిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఈ క్రమంలోనే గత వారం టన్ను సరాసరి ధర రూ.25 వేల వరకు ఉండగా.. సోమవారం రూ.22 వేలకు పరిమితం చేశారు. సూట్ రద్దు కావడంతో ఆదాయం కోల్పోయిన మండీమర్చెంట్లు, వ్యాపారులు దాన్ని పూడ్చుకునేందుకు ధరలు తగ్గించారనే ప్రచారం సాగుతోంది. మొత్తమ్మీద ఏదో ఒక విధంగా నష్టం వాటిల్లుతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు.