మాయాజాలం
- సూట్ రద్దుతో చీనీ వ్యాపారుల కొత్త దారులు
- ధర తగ్గిస్తూ రైతుల పొట్ట కొడుతున్న వైనం
- నిలకడ లేని ధరలతో నష్టపోతున్న అన్నదాతలు
అనంతపురం అగ్రికల్చర్ : చీనీ వ్యాపారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. సూట్ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో వారు కొత్తదారులను వెతుక్కుంటున్నారు. ధర తగ్గించడం ద్వారా రైతులను అన్యాయం చేస్తున్నారు. అనంతపురం వ్యవసాయ మార్కెట్‌యార్డుకు 20 రోజులుగా చీనీకాయలు పెద్దఎత్తున వస్తున్నాయి. ఇటీవల ధరలు కూడా కొద్దిమేర పెరగడంతో తోటల్లో పంట కోతను ముమ్మరం చేశారు. రోజూ 500 నుంచి 800 టన్నుల వరకు కాయలు మార్కెట్‌కు వస్తున్నాయి. సోమవారం కూడా 800 టన్నుల వరకు వచ్చాయి. అయితే.. ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఒక లాటు మాత్రమే గరిష్టంగా టన్ను రూ.31 వేలు పలికినట్లు యార్డు వర్గాలు తెలిపాయి. దాదాపు 170 లాట్లు వేలం వేశారు. ఇందులో 15 నుంచి 20 లాట్లు మాత్రమే రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు అమ్ముడుపోయాయి. మిగతావన్నీ రూ.20 వేలకు కాస్త అటూ ఇటు పలికాయి. కొన్ని లాట్లు రూ.15-20 వేలలోపే అమ్ముడుపోవడంతో రైతులు నిరాశ చెందారు.
నిలకడ లేని ధరలతో నష్టం
ఈ సీజన్‌లో నిలకడలేని ధరలతో చీనీ రైతులు భారీగా నష్టపోయారు. మార్చి నుంచి మే 15వ తేదీ వరకు ధరలు భారీగా పతనం కావడంతో రైతులకు రూ.300 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. మొదటి మూడు నెలలు టన్ను గరిష్ట ధర రూ.15 వేలకు మించలేదు. మే 15 తర్వాత ధరల్లో కొంత పెరుగుదల కనిపించింది.టన్ను సరాసరి రూ.20 వేలు పలికాయి. ఈ నెలలో మరికాస్త ధర పెరగడంతో రైతులకు ఊరట లభించింది. సరాసరి ధర రూ.23 వేలకు చేరింది. గరిష్టంగా రూ.32 వేల వరకు పలికింది. చాలా లాట్లకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు లభించింది. ధరలు పెరిగినా సూట్లు, కమీషన్లు ఎక్కువ కావడంతో రైతులకు నష్టం వాటిల్లుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి.
దీంతో ఈ అంశంపై నాలుగు రోజుల కిందట రాయదుర్గంలో జరిగిన ఏరువాక పౌర్ణమి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. సీఎం ఆదేశాల మేరకు అనంతపురం ఆర్డీవో, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల అధికారులు చీనీ వ్యాపారులు, మండీ మర్చెంట్లతో సమావేశమయ్యారు. సింగిల్, డబుల్ సూట్లు తీసుకున్నా, అధిక మొత్తంలో కమీషన్లు దండుకున్నా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన వేలం పాటలో కొందరు సూట్లు పూర్తిగా రద్దు చేయగా, మరికొందరు టన్నుకు 20 కిలోల సూట్‌తో వ్యాపారం కొనసాగించారు. గతంలో సూట్ రూపంలో టన్నుకు 120 కిలోలు తీసుకునేవారు. తోటల్లో అయితే మరింత ఎక్కువగా 200 కిలోల వరకు తీసుకునేవారు.
ధర తగ్గించిన వ్యాపారులు
అధికారుల హెచ్చరిక నేపథ్యంలో అనంతపురం పండ్లమార్కెట్‌లో సోమవారం సూట్ బాగా తగ్గించేసిన వ్యాపారులు.. అదే క్రమంలో ధరలు కూడా తగ్గించడం గమనార్హం. మండీమర్చెంట్లు, వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి, క్రయ విక్రయాలు నిర్వహిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఈ క్రమంలోనే గత వారం టన్ను సరాసరి ధర రూ.25 వేల వరకు ఉండగా.. సోమవారం రూ.22 వేలకు పరిమితం చేశారు. సూట్ రద్దు కావడంతో ఆదాయం కోల్పోయిన మండీమర్చెంట్లు, వ్యాపారులు దాన్ని పూడ్చుకునేందుకు ధరలు తగ్గించారనే ప్రచారం సాగుతోంది. మొత్తమ్మీద ఏదో ఒక విధంగా నష్టం వాటిల్లుతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు.