మడకశిరలో ఈవీఎం తారుమారు
వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి ఐదు ఓట్లే ఉండటంతో అనుమానం..
అభ్యంతరం చెప్పటంతో పక్కనబెట్టిన అధికారులు
చివరి రౌండ్ ముగిసేసరికి టీడీపీకి 285 ఓట్ల ఆధిక్యం.. పక్కనబెట్టిన ఈవీఎం సంగతి లేవనెత్తిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి
అది ఎంపీదని తేల్చి... తీరిగ్గా అసెంబ్లీ ఈవీఎం తెచ్చి న అధికారులు
ఓపెన్ కాని అసెంబ్లీ ఈవీఎం.. వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కింపు
వైఎస్సార్‌సీపీకి 414 ఓట్లు అసలు ఈవీఎం మారిపోవడమేమిటి?
అసెంబ్లీ ఈవీఎం ఓపెన్ కాకపోవడమేమిటి?.. దీనిపై ఈసీని ఆశ్రయిస్తామన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి
అనుమానం ఉన్న అభ్యర్థులు వారంలోగా ఫిర్యాదు చేసే అవకాశం
ఏ అభ్యర్థి నుంచైనా ఫిర్యాదులొస్తే 5 శాతం వీవీ ప్యాట్లు లెక్కిస్తారు
ఈమేరకు గతంలోనే తీర్పునిచ్చిన సర్వోన్నత న్యాయస్థానం
ఇలాంటి సంఘటనలు ఇంకెన్ని జరిగాయోననే అనుమానాలు!
మడకశిర (శ్రీసత్యసాయి జిల్లా): శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో అధికారులు ఈవీఎంనే మార్చేశారు. ఇందులోనూ ఓట్లు తప్పులతడకగా చూపాయి. ఓట్లలో తేడా ఉండటంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అభ్యంతరం చెప్పారు. చివరకు ఈ ఈవీఎం పార్లమెంట్ నియోజకవర్గానిదని తేలడంతో అందరూ నివ్వెరపోయారు. దీంతో అధికారులు వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించారు. ఇది బయటపడిన సంఘటన మాత్రమే. బయటకు తెలియని ఇటువంటి ఈవీఎం మారి్పడి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఇంకెన్ని జరిగాయోనన్న అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి.
మంగళవారం మడకశిర అసెంబ్లీ, హిందూపురం ఎంపీ స్థానాల ఓట్ల లెక్కింపు హిందూపురం బిట్ కళాశాలలో జరిగింది. ఒక గదిలో లోక్‌సభ ఓట్లు, పక్క గదిలోనే అసెంబ్లీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు చేపట్టారు. మడకశిర నియోజకవర్గం రొళ్ల మండలం పిల్లిగుండ్లు 131 పోలింగ్ బూత్ పార్లమెంట్ ఓట్ల ఈవీఎంను అధికారులు అసెంబ్లీ ఓట్లు లెక్కిస్తున్న టేబుల్ వద్దకు తీసుకొచ్చారు. ఇందులో బీఎస్పీ అభ్యర్థికి 414, వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి 5, టీడీపీ అభ్యర్థికి 349 ఓట్లు వచ్చినట్లు చూపింది. వైఎస్సార్‌సీపీకి బలమున్న గ్రామంలో ఓట్లు మరీ తక్కువగా రావడంతో అనుమానం వచి్చన రొళ్ల జెడ్పీటీసీ సభ్యుడు అనంతరాజు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఈర లక్కప్ప ద్వారా ఆర్‌వోకు ఫిర్యాదు చేయించారు. దీంతో దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి చివర్లో పరిష్కారం చూపుతామని ఆర్‌వో చెప్పారు.
కౌంటింగ్ చివరలో టీడీపీకి 285 ఓట్ల ఆధిక్యం వచ్చింది. దీంతో పక్కన పెట్టిన ఈవీఎం సంగతి తేల్చాలంటూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి లక్కప్ప పట్టుబట్టారు. దీంతో ఆ ఈవీఎంను అధికారులు పరిశీలించగా పార్లమెంట్‌కు సంబంధించినదిగా తేలింది. తప్పును గుర్తించిన అధికారులు తీరిగ్గా ఆ పోలింగ్ బూత్‌కు సంబంధించి అసెంబ్లీ ఈవీఎం తీసుకువచ్చారు. అది అసలు ఓపెనే కాలేదు. దీనిపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తీవ్ర అభ్యంతరం చెప్పడంతో చివరకు వీవీ ప్యాట్ స్లిప్పులు తీసుకొచ్చి లెక్కించారు. అందులో టీడీపీకి 349 ఓట్లు, వైఎస్సార్‌సీపీకి 414 ఓట్లు వచ్చాయి. చివరకు స్వల్ప ఆధిక్యంతో టీడీపీ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.
ఒకవేళ ఈవీఎం మారిన సంగతి బయటపడకుండా, పార్లమెంటు ఈవీఎం ఓట్లే లెక్కించి ఉంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి 414 ఓట్లకు బదులు 5 ఓట్లే వచ్చి ఉండేవి. ఎంతో పకడ్బందీగా జరగాల్సిన ఓట్ల లెక్కింపులో ఈవీఎం మారిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పట్టుబట్టిన తర్వాత అసెంబ్లీ ఈవీఎం తెచ్చారు. అది కూడా ఓపెన్ కాకపోవడం అనుమానాలను మరింత బలపరుస్తోంది. ఇలా ఈవీఎం మారిన ఘటన ఒక్కటే బయటపడింది. ఎవరికీ తెలియకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇంకెన్ని ఈవీఎంలు మారిపోయాయి, వాటిలో ఎన్ని లెక్కలు తేడాలున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈవీఎం మారిపోవడం, అసెంబ్లీ ఈవీఎం తెరుచుకోకపోవడంపై ఈసీని ఆశ్రయిస్తామని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి లక్కప్ప చెప్పారు. ఇలా ఈవీఎంలపై అనుమానం ఉన్న అభ్యర్థులు వారంలోగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఏ అభ్యర్థి నుంచైనా ఫిర్యాదు వస్తే 5% వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలి. ఈ మేరకు సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచి్చంది. ఈ ఎన్నికల్లో ఆది నుంచి పలు వివాదాలు చోటు చేసుకోవడం, ఇప్పుడు మడకశిరలో ఈవీఎంనే మార్చేసిన తీరుతో ఓట్ల లెక్కింపుపై అనుమానాలున్న అభ్యర్థులు ఈసీకి ఫిర్యాదులు చేయడానికి సిద్ధపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment