కాటమరాయుడా.. కదిరి నరసింహుడా! | Sri Lakshmi Narasimha Swamy Brahmotsavalu in Kadiri 2025 | Sakshi
Sakshi News home page

కాటమరాయుడా.. కదిరి నరసింహుడా!

Published Mon, Mar 10 2025 4:05 AM | Last Updated on Mon, Mar 10 2025 4:05 AM

Sri Lakshmi Narasimha Swamy Brahmotsavalu in Kadiri 2025

ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు ఆరంభం

800 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన దివ్య క్షేత్రం

నేడు శ్రీవారి కల్యాణోత్సవం

20న స్వామివారి బ్రహ్మ రథోత్సవం

ఆ దేవుడు లక్ష్మీనారసింహుడు. భక్తులచేత వసంతవల్లభుడిగా, కాటమ రాయుడిగా, ప్రహ్లాదవరదుడిగా పూజలందుకుంటున్న శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం శ్రీసత్యసాయిజిల్లా కదిరిలో వెలసింది. ఖాద్రీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం అంకురార్పణంతో అత్యంత వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్సవాలు పక్షం రోజులపాటు జరుగుతాయి. భక్తప్రహ్లాద సమేత నారసింహుని దర్శనం ఇక్కడ మాత్రమే చూడవచ్చు.

స్థల పురాణం
హిరణ్యకశిపుని సంహరించిన అనంతరం శ్రీవారు ఆ ఉగ్రరూపంలోనే సమీపంలోని కదిరి కొండ వద్ద సంచరించసాగారు. మహర్షులు ఆయనను శాంతింపజేసేందుకు ఆ కొండపై ఆలయాన్ని నిర్మించి స్వామివారిని అందులో వసించమని వేడుకున్నారు. అదే కొండపై శ్రీవారి పాదముద్రికలు కూడా ఉన్నాయి. అందుకే ఈప్రాంతాన్ని ‘ఖాద్రి’ అని పిలిచారు. ‘ఖా’ అంటే విష్ణుపాదమని, ‘అద్రి’ అంటే కొండ అని అర్థం. ఖాద్రి కాస్తా కదిరిగా పిలుస్తున్నారు.

మహిమాన్వితుడు.. ఖాద్రీశుడు
కదిరిప్రాంతంలో ఒకప్పుడు ఖాదిరి వృక్షాలు(చండ్ర వృక్షాలు) ఎక్కువగా ఉండేవి. వీటికింద ఒక పుట్టలో నారసింహుడు స్వయంభువుగా వెలిశాడని అందుకే ఖాద్రీ నారసింహుడని పిలు స్తున్నారని మరో కథనం. ప్రతి నెలా స్వాతినక్షత్రం రోజు మాత్రమే ఇక్కడ మూల విరాట్‌కు అభిషేకం చేస్తారు.  

వసంత వల్లభుడని పేరు
శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం భృగు మహర్షి ఈప్రాంతంలో తపస్సు చేశాడని, అందుకు మెచ్చిన విష్ణువు తాను కోనేటిలో వెలిశానని, తన విగ్రహాలను వెలికితీసి పూజాది కార్యక్రమాలు చేయాలని కోరినట్లు ఓ కథనం. ఉత్సవ విగ్రహాల వెలికితీత జరిగింది వసంత మాసంలో కనుక స్వామివారికి వసంత వల్లభుడని పేరు కూడా ఉంది. అందుకే కోనేరును భృగుతీర్థమని పిలుస్తారు. ఆ ఉత్సవవిగ్రహాలనే ఇప్పటికీ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ తిరువీధుల్లో ఊరేగిస్తారు. ఇంతటి తేజస్సు కల్గిన ఉత్సవ విగ్రహాలు ఎక్కడా లేవని భక్తులు చెబుతారు.

దేశంలోనే 3వ అతి పెద్ద బ్రహ్మరథం
స్వామివారి బ్రహ్మ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంది. రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు ఉంది. 130 ఏళ్ల క్రితం ఈ బ్రహ్మరథం తయారు చేశారు. రథంపై 256 శిల్పకళాకృతులను టేకుతో అందంగా తీర్చిదిద్దారు. తమిళనాడులోని అండాల్‌ అమ్మవారి శ్రీవల్లి పుత్తూరు రథం, తంజావూరు జిల్లాలోని తిరువార్‌ రథం తర్వాత 3వ అతి పెద్దది ఈ ఖాద్రీశుడి బ్రహ్మరథం. ఆదివారం (9న) అంకురార్పణతో మొదలయిన ఈ బ్రహ్మోత్సవాలలో రోజుకో వాహనం మీద స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. 22వ తేదీ తీర్థవాది ఉత్సవం, 23న పుష్పయాగోత్సవంతో ముగుస్తాయి. 

మా వంశమంతా స్వామి సేవలోనే..
తర తరాలుగా మా వంశాలు స్వామివారి సేవలోనే తరిస్తున్నాయి. అది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. ప్రహ్లాద సమేత లక్ష్మీనారసింహుడి దర్శనం ఇంకెక్కడా ఉండదు. బ్రహ్మోత్సవాలు 15 రోజుల పాటు జరిగేది కూడా ఇక్కడే. ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజు మూలవిరాట్‌కు అభిషేకం చేస్తాం. 
– నరసింహాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు

బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో రోజంతా నిత్యాన్నదానం ఉంటుంది. కల్యాణోత్సవంతో పాటు రథోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఇందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సహకారంతో బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరిగేలా చూస్తున్నాం.
– శ్రీనివాసరెడ్డి, ఆలయ ఈఓ

– చెరువు శ్రీనివాసరెడ్డి, సాక్షి, కదిరి, శ్రీసత్యసాయి జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement