Sagubadi: Sathya Sai Farmer Cultivates Sri Gandham Hopes Huge Profits - Sakshi
Sakshi News home page

Sri Gandham: 15 ఏళ్లలో సిరులు కురిపించే శ్రీగంధం.. ఎకరాకు రూ.3 కోట్ల  వరకూ ఆదాయం! రైతు ఏమన్నారంటే..

Published Tue, Nov 1 2022 10:25 AM | Last Updated on Tue, Nov 1 2022 3:14 PM

Sagubadi: Sathya Sai Farmer Cultivates Sri Gandham Hopes Huge Profits - Sakshi

Sagubadi- Sri Gandham(Sandalwood Cultivation): సాధారణ సీజనల్‌ పంటల సాగులో సమస్యలతో సతమతమైన రైతు తాళ్లపల్లి బయారెడ్డికి శ్రీగంధం సాగు గొప్ప భరోసాగా నిలిచింది. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో విస్తారంగా సాగులో ఉన్న శ్రీగంధం తోటల గురించి తెలుసుకొని ఆసక్తి పెంచుకున్నారు. బెంగళూరులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఉడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐడబ్ల్యూఎస్‌టి)’ శ్రీగంధం సాగు, నర్సరీ నిర్వహణ, మార్కెటింగ్‌ తదితర అంశాలపై 5 రోజులపాటు శిక్షణ ఇస్తోంది.

2018లో బయారెడ్డి శిక్షణ పొందారు. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం ఇరగంపల్లి వాస్తవ్యుడైన ఆయన తనకున్న 10 ఎకరాల పొలం (ఇసుక పాళ్లు ఎక్కువగా ఉండే ఎర్ర నేల)లో శ్రీగంధం సాగుకు శ్రీకారం చుట్టారు. ఐ.డబ్ల్యూ. ఎస్‌.టి.లోనే 3 వేల మొక్కలను కొనుగోలు చేసి పొలంలో నాటారు. ఎకరాకు 300 చొప్పున పది ఎకరాల్లో 15“10 అడుగుల దూరంలో నాటారు. 

ఇతర చెట్ల వేర్లే ఆధారం
శ్రీగంధం మొక్క వేర్లకు నేలలో నుంచి కొన్ని పోషకాలను నేరుగా తీసుకునే శక్తి ఉండదు. అందువల్ల పక్కనే ఉండే ఇతర చెట్ల వేర్లపై ఆధారపడి శ్రీగంధం మొక్కల వేర్లు పోషకాలను తీసుకుంటూ ఉంటాయి. అందుకని, శ్రీగంధం సాగు చేసే రైతులు పక్కనే సరుగుడు, రోజ్‌ఉడ్‌ తదితర మొక్కల్ని కూడా నాటుకోవాలి. అయితే, శ్రీగంధం మొక్కలకు ఎండ సరిగ్గా తగిలేలా జాగ్రత్తపడాలి.

బయారెడ్డి తన పదెకరాల్లో 300 సరుగుడు, 300 రోజ్‌ఉడ్‌ మొక్కల్ని సైతం నాటారు. ఒకటిన్నర ఇంచ్‌ల నీళ్లు వస్తున్న బోరుకు డ్రిప్పు అమర్చి పంటను సంరక్షించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల ద్వారా సాగులో ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నారు.

తదనంతరం బయారెడ్డి శ్రీగంధం మొక్కల నర్సరీని నెలకొల్పారు. మూడేళ్ల కాలంలో ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర రైతులకు సుమారు 2.5 లక్షల శ్రీగంధం మొక్కలను అందిస్తూ రైతులకు నిరంతరం సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఫోన్‌ ద్వారానే గాక యూట్యూబ్‌ వీడియోల ద్వారా సలహాలు అందిస్తున్నారు. 
 
కంది, సరుగుడు, రోజ్‌ఉడ్‌...
నల్లరేగడి, ఒండ్రు నేలలు, నీరు నిల్వ ఉండే భూములు, చౌడు నేలలు తప్ప ఏ ఇతర నేలల్లో అయినా శ్రీగంధం తోట నాటుకోవచ్చు. శ్రీగంధం మొక్కలతో పాటు విధిగా కంది, సరుగుడు, రోజ్‌ఉడ్‌ మొక్కలను నాటుకోవాలి, శ్రీగంధం మొక్కకు వరసలో రెండు వైపులా 1–1,5 అడుగుల దూరంలో కంది మొక్కలు నాటాలి.

3–5 అడుగుల దూరంలో సరుగుడు, 7.5–8 అడుగుల దూరంలో రోజ్‌ఉడ్‌ మొక్కల్ని నాటుకోవాలి. ఈ మొక్కల వేళ్లపై ఆధారపడి శ్రీగంధం మొక్కలు ఏపుగా పెరుగుతాయి. కరివేపాకు, అవిశ, కానుగ, సర్కారు తుమ్మ మొక్కల్ని కూడా హోస్ట్‌ ప్లాంట్లుగా నాటుకోవచ్చు. అయితే, ఈ రకాలను పెంచడం ద్వారా రైతుకు అంతగా ఆదాయం రాదు. కాబట్టి సరుగుడు, రోజ్‌ఉడ్‌ మొక్కల్ని నాటుతున్నట్లు బయారెడ్డి వివరించారు. 

మామిడి, సపోట, నేరేడు వంటి తోటల్లోనూ ఎప్పటిప్పుడు ప్రూనింగ్‌ చేసుకునే పరిస్థితి ఉంటే శ్రీగంధం మొక్కలు నాటుకోవచ్చన్నారు. ఎన్ని రకాల మొక్కలు, పంటలనైనా అంతర పంటలుగా వేసుకోవచ్చని, అయితే శ్రీగంధం మొక్కలపై నీడ పడకుండా ఉండేలా చూసుకోవటం ముఖ్యమని ఆయన అంటున్నారు.

12–15 ఏళ్లకు భారీగా ఆదాయం
మొక్కల మధ్య 10 అడుగులు, వరుసల మధ్య 15 అడుగుల దూరం ఉండాలి, మూడేళ్ల పాటు నీటి తడులు అందిస్తూ సంరక్షించుకోవాలి. అప్పుడప్పుడూ సేంద్రియ ఎరువులు వేస్తే చాలని బయారెడ్డి అంటున్నారు. మూడేళ్ల తరువాత నీటి తడులు అవసరం లేదన్నారు. 

శ్రీగంధం పక్కన ఉండే చెట్ల వేర్లపై ఆధారపడి పోషకాలను గ్రహిస్తూ ఉంటాయి. 20 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. 12 నుంచి 15 ఏళ్లకు చేవదేలి కోతకు వస్తాయన్నారు. ఒక్కో చెట్టును సగటున కనీసం 15–20 కిలోల చేవగల శ్రీగంధం చెక్క వస్తుంది.

ఎకరాకు రూ.3 కోట్ల  వరకూ ఆదాయం!
ప్రస్తుత మార్కెట్‌లో కిలో రూ.6 వేల నుండి రూ.12 వేల ధర పలుకుతోందని బయారెడ్డి తెలిపారు. ఈ లెక్కన ఒక్కో చెట్టుకు కనీసం రూ.ఒక లక్ష వరకూ ఆదాయం వస్తుందన్నారు. దీంతో ఒక ఎకరాకు రూ.3 కోట్ల  వరకూ ఆదాయం వస్తుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

దొంగల బెడద
అయితే, ఖరీదైన చెట్లు కావడంతో ముదురు తోటలకు దొంగల బెడద అధికంగా ఉంటుంది. చెట్టుకు ఆరేళ్లు దాటిన తరువాత అక్కడక్కడా సీసీ కెమెరాలు అమర్చుకొని కాపాడుకోవాలన్నారు. శ్రీగంధం చెట్ల మద్య ఇతర పంటలను సాగు చేసుకోవచ్చన్నారు.

శ్రీగంధం చెట్టుకు కొమ్మలను కత్తిరించకూడదన్నారు. మొదలుకు ఎండ అధికంగా తగలకుండా రక్షించుకుంటే మొక్క ఏపుగా పెరుగుతుందన్నారు. ఎటువంటి చీడపీడల బాధ ఉండదన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి శ్రీగంధం చెక్కలను మన దేశం ఏటా వేల టన్నులు దిగుమతి చేసుకుంటున్నందున మార్కెటింగ్‌ సమస్య లేదన్నారు. బయారెడ్డి తోటను ఇటీవల  సందర్శించిన ఐ.డబ్ల్యూ.ఎస్‌.టి. సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌.సుందరరాజ్‌ సంతృప్తిని వ్యక్తం చేశారు. 

మన శ్రీగంధం అత్యుత్తమమైనది
అత్యంత ఖరీదైన కలప జాతుల్లో రెండోది శ్రీగంధం. 17 శ్రీగంధం జాతుల్లోకెల్లా శాంటాలం ఆల్బం అనే భారతీయ జాతి శ్రీగంధం అత్యుత్తమమైనది. 1965లో 2,680 టన్నుల శ్రీగంధం తైలాన్ని ఎగుమతి చేసిన మన దేశం ఇప్పుడు వేల టన్నుల్ని ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. ఆస్ట్రేలియా 30 ఏళ్ల క్రితం మన జాతి శ్రీగంధం విత్తనాలను తీసుకెళ్లి వేలాది ఎకరాల్లో సాగు చేస్తోంది.

అటవీ జాతి అయిన శ్రీగంధం చెట్లను పొలాల్లో సాగు చేయటంపై 2006లో ఆం«క్షలు తొలగిపోయాయి. 2010 నుంచి మా సంస్థ సాగుపై రైతులకు శిక్షణ ఇస్తోంది. రైతుల పొలాల్లో 15 ఏళ్లు పెరిగిన చెట్టు నుంచి 12 కిలోల చావదేలిన చెక్క వస్తుంది. దీని నుంచి 6% నూనె  వస్తుంది. కిలో చావదేలిన చెక్క ఖరీదు రూ. 12,500 ఉంది. శ్రీగంధం నూనె ప్రయోజనాలెన్నో ఉన్నాయి. కేన్సర్‌ మందుల్లోనూ వాడుతున్నారు.

మార్కెట్‌ ధర పెరగడమే గానీ తగ్గటం ఉండదు. రైతులు శ్రీగంధం మొక్కల్ని ఇతర పంటలతో కలిపి సాగు చేసుకోవచ్చు. 
– డాక్టర్‌ ఆర్‌.సుందరరాజ్‌. (97404 33959), సీనియర్‌ శాస్త్రవేత్త, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఉడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, బెంగళూరు

శ్రీగంధం తోటలకు బీమా కల్పించాలి
ప్రభుత్వం ఉద్యాన తోటలతో సమానంగా శ్రీగంధం సాగుకు రాయితీలు కల్పించి, డ్రిప్‌ను సబ్సిడీపై ఇచ్చి, బీమా సదుపాయం కల్పించి ప్రోత్సహించాలి. శ్రీగంధం చెట్లు కోతకు వచ్చినప్పుడు ఎకరానికి రూ. 4 లక్షల వరకు ప్రభుత్వానికి పన్ను రూపంలో ఆదాయం వస్తుంది.

పర్యావరణ పరిరక్షణతో పాటు జీవవైవిధ్యం, పచ్చదనం పెంపుదలకు శ్రీగంధం సాగు దోహదపడుతుంది.  సీజనల్‌ పంటలు, పాడిపై ఆదాయం ద్వారా జీవనం సాగించే చిన్న, సన్నకారు రైతులు కొన్ని శ్రీగంధం మొక్కలు పెంచుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. తమకున్నది ఎకరం పొలం అయినా 10 సెంట్లలో 30 శ్రీగంధం మొక్కలు నాటుకుంటే 15 ఏళ్లకు ఒకేసారి మంచి ఆదాయం వస్తుంది. 
– తాళ్లపల్లి బయారెడ్డి, (94400 16995), శ్రీగంధం రైతు, ఇరగంపల్లి, కొత్తచెరువు మండలం, శ్రీసత్యసాయి జిల్లా 
– జి.కేశవరెడ్డి, పుట్టపర్తి అర్బన్‌
చదవండి: 18 ఎకరాలు: బత్తాయి, వరి, సీతాఫలం సాగు.. బియ్యం కిలో రూ. 80 చొప్పున! 450 రకాల మొక్కలు.. ఇంకా
Bio Fence: వారెవ్వా.. అప్పుడు ఖర్చు 40 వేలు.. ఇప్పుడు 1500.. కోతుల బెడద లేదు! కాకర, చిక్కుడు.. అదనపు ఆదాయం కూడా..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement