Sri Gandham plants
-
శ్రీగంధం సాగుని డబ్బుచెట్ల సాగు అంటారు
-
శ్రీగంధం, ఎర్రచందనం సాగు లాభాలు
-
శ్రీగంధం, టేకు చెట్ల కొమ్మలు కత్తిరిస్తున్నారా? అంతే సంగతులు.. నష్టాలు తప్పవు!
Sri Gandham Cultivation- Disadvantages Of Pruning: శ్రీగంధం (చందనం), టేకు వంటి అధిక విలువైన కలప తోటల సాగుకు దక్షిణాది రాష్ట్రాలు పెట్టింది పేరు. ప్రైవేటు భూముల్లో సాగుకు ప్రభుత్వం అనుమతించడంతో ముఖ్యంగా శ్రీగంధం తోటల సాగు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో గత 20 ఏళ్లలో బాగా పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఈ మధ్యనే సాగు విస్తరిస్తోంది. శ్రీగంధం,టేకు సాగు రైతులకు అధికాదాయాన్నిచ్చే కలప తోటలు. శ్రీగంధం చెట్లను 15 ఏళ్లు శ్రద్ధగా పెంచితే ఒక్కో చెట్టుపై రూ. లక్ష వరకూ కూడా ఆదాయం రావటానికి అవకాశం ఉందని బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఐ.డబ్లు్య.ఎస్.టి.) శాస్త్రవేత్త చెబుతున్నారు. ఏపీ, తెలంగాణ సహా 5 దక్షిణాది రాష్ట్రాల్లో శ్రీగంధం, టేకు తోటల సాగుపై ఈ సంస్థ పరిశోధనలు చేస్తోంది. ఐ.డబ్లు్య.ఎస్.టి. శాస్త్రవేత్త డా. ఆర్.సుందరరాజ్ శ్రీగంధం, టేకు తోటల సాగులో సాధారణంగా రైతులు చేసే తప్పుల గురించి ‘సాక్షి సాగుబడి’ తో పంచుకున్నారు. ప్రూనింగ్‌తో నష్టాలు మామిడి, దానిమ్మ, మునగ, మల్బరీ వంటి తోటల్లో పంటకోతలు పూర్తయ్యాక కొమ్మ కత్తిరింపులు చేస్తుంటారు. ఈ తోటల్లో ప్రూనింగ్ వల్ల అనేక రకాలుగా వెసులుబాటు కలుగుతుంది. దిగుబడి పెరగడంతో΄ాటు చెట్ల కొమ్మలు మరీ ఎత్తుగా పెరగనీయకుండా ఉండటం వల్ల పంటకోత సులువు అవుతుంది. ఈ అలవాటుకొద్దీ శ్రీగంధం, టేకు చెట్లకు కూడా ప్రూనింగ్ చేస్తున్నారు. ఇది పెద్ద తప్పు. మేలు కన్నా కీడు ఎక్కువగా జరుగుతోందని డా. సుందర్రాజ్ అంటున్నారు. శ్రీగంధం, టేకు చెట్ల కాండం లోపలి కలపను, మధ్యలోని చేవను చీడపీడల నుంచి రక్షించేంది కాండం పైన ఉండే బెరడే. కొమ్మలు కత్తిరించినప్పుడు బెరడు దెబ్బతిని, ఎండిపోతుంది. కొమ్మను నరికిన చోట కాండం లోపలి పొరలు బయటపడతాయి. ఆ విధంగా కలపను కుళ్లింపజేసే శిలీంధ్రాలు, నష్టం చేసే కాండం తొలిచే పురుగులు ప్రూనింగ్ జరిగిన చోటు నుంచి చెట్టు లోపలికి ప్రవేశిస్తాయి. తద్వారా చెట్టు బలహీనపడుతుంది. ఆకుల పెరుగుదల మందగిస్తుంది. కాయలు రాలిపోతాయి. ప్రూనింగ్ గాయాలు కొమ్మల సహజ పెరుగుదలను దెబ్బతీస్తాయి. చెట్టు సమతుల్యత దెబ్బతిని గాలుల వల్ల నష్టం కలుగుతుంది. చాలా సందర్భాల్లో చెట్లు ప్రూనింగ్ జరిగిన కొద్దికాలంలోనే చని΄ోతాయి కూడా అంటున్నారు డా. సుందర్రాజ్. కలప మన్నికకు గొడ్డలిపెట్టు టేకు కలప పదికాలాల పాటు చెక్కుచెదరకుండా ఉంటుంది. టేకు కలప జీవక్షీణతకు గురిచేసే సూక్ష్మజీవరాశిని అరికట్టే రక్షక పదార్థాలు (మెటబాలిటీస్ లేదా ఎక్స్ట్రాక్టివ్స్) చెట్టు కాండం లోపలి పొరల్లో ఉండబట్టే టేకు కలపకు ఈ గట్టితనం వచ్చింది. ప్రూనింగ్ చేసిన టేకు చెట్లలో ఈ పదార్థాలు లోపించటం వల్ల ఆ కలప మన్నిక కాలం తగ్గిపోతుంది. ఐ.డబ్ల్యూ.ఎస్.టి. నిపుణుల అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇంటర్నేషనల్ బయోడిటీరియోరేషన్ అండ్ బయోడిగ్రేడేషన్ జర్నల్‌లో ప్రచురితమైన వ్యాసంలో ఈ విషయాలు పొందుపరిచారు. శ్రీగంధం చెట్లకు ప్రూనింగ్ చేస్తే ఎత్తు పెరగొచ్చు గానీ కాండం చుట్టుకొలత పెరగదు. ప్రూనింగ్ గాయాల దగ్గర సుడులు ఏర్పడటం వల్ల చెక్క అందం పాడవుతుంది. ప్రూనింగ్ చేయటం వల్ల శ్రీగంధం, టేకు చెట్లకు నష్టం జరగటమే కాదు దాని చుట్టూ ఉండే పర్యావరణ వ్యవస్థకు తెలియకుండానే పెద్ద నష్టం జరుగుతుందట. ప్రూనింగ్ చేసిన చెట్లకు గాయాలపై బోర్డాక్స్ పేస్ట్ వంటి శిలీంధ్రనాశనులను పూస్తుంటారు. అయితే, ఇది పూర్తి రక్షణ ఇస్తుందని చెప్పలేమని డా. సుందరరాజ్ తెలిపారు. రసాయనాల ప్రతికూల ప్రభావాలు శ్రీగంధం చెట్లపై చాలా ఉంటుంది. ఎవరో చెప్పిన మాటలు విని శ్రీగంధం, టేకు చెట్లకు ప్రూనింగ్ చేయొద్దని, చెట్లను సహజంగా పెరగనిస్తూ ప్రకృతి సేద్య పద్ధతులను అనుసరించాలని డా. సుందరరాజ్ సూచిస్తున్నారు. 15 ఏళ్ల చెట్టుకు 10 కిలోల చేవ ఒక రైతు ఇంటి దగ్గర పెరుగుతున్న ఈ మూడు శ్రీగంధం చెట్ల వయస్సు 15 సంవత్సరాలు. ఈ మూడిటికీ కొమ్మలు కత్తిరించారు. తక్కువ ప్రూనింగ్ వల్ల రెండు చెట్లు కోలుకున్నాయి. కానీ మూడో చెట్టుకు అతిగా ప్రూనింగ్ చేయటం వల్ల కోలుకోలేకపోయింది. మేం ఈ చెట్లకు చేవ (హార్ట్‌వుడ్) ఎంత ఉందో పరీక్షించాం. మొదటి రెండు చెట్ల కాండంలో మాత్రమే హార్ట్‌వుడ్ కనిపించింది. బలహీనంగా ఉన్న మూడో చెట్టులో అసల్లేదు. చెట్టు మీ కోసమో, నా కోసమో చేవదేలదు. తన బలం కొద్దీ చేవదేలుతుంది. కాబట్టి ఏ చెట్టు నాణ్యతైనా, చేవ పరిమాణమైనా అది ఎంత ఆరోగ్యకరంగా పెరుగుతున్నదన్నదానిపై ఆధారపడి ఉంటుంది. నా అనుభవం ప్రకారం, 15 సంవత్సరాలు ఆరోగ్యంగా పెరిగిన చందనపు చెట్టుకు కనీసం 10 కిలోల చేవ ఉంటుంది. దాన్ని బట్టి రైతుకు ఆదాయం వస్తుంది. – డా. ఆర్.సుందరరాజ్ (97404 33959), శాస్త్రవేత్త, ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బెంగళూరు – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ చదవండి: ఎటాక్.. స్ట్రోక్ వేర్వేరు... -
సిరులు కురిపించే శ్రీగంధం.. ఎకరాకు రూ.3 కోట్ల వరకూ ఆదాయం! రైతు ఏమన్నారంటే..
Sagubadi- Sri Gandham(Sandalwood Cultivation): సాధారణ సీజనల్ పంటల సాగులో సమస్యలతో సతమతమైన రైతు తాళ్లపల్లి బయారెడ్డికి శ్రీగంధం సాగు గొప్ప భరోసాగా నిలిచింది. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో విస్తారంగా సాగులో ఉన్న శ్రీగంధం తోటల గురించి తెలుసుకొని ఆసక్తి పెంచుకున్నారు. బెంగళూరులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐడబ్ల్యూఎస్టి)’ శ్రీగంధం సాగు, నర్సరీ నిర్వహణ, మార్కెటింగ్ తదితర అంశాలపై 5 రోజులపాటు శిక్షణ ఇస్తోంది. 2018లో బయారెడ్డి శిక్షణ పొందారు. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం ఇరగంపల్లి వాస్తవ్యుడైన ఆయన తనకున్న 10 ఎకరాల పొలం (ఇసుక పాళ్లు ఎక్కువగా ఉండే ఎర్ర నేల)లో శ్రీగంధం సాగుకు శ్రీకారం చుట్టారు. ఐ.డబ్ల్యూ. ఎస్.టి.లోనే 3 వేల మొక్కలను కొనుగోలు చేసి పొలంలో నాటారు. ఎకరాకు 300 చొప్పున పది ఎకరాల్లో 15“10 అడుగుల దూరంలో నాటారు. ఇతర చెట్ల వేర్లే ఆధారం శ్రీగంధం మొక్క వేర్లకు నేలలో నుంచి కొన్ని పోషకాలను నేరుగా తీసుకునే శక్తి ఉండదు. అందువల్ల పక్కనే ఉండే ఇతర చెట్ల వేర్లపై ఆధారపడి శ్రీగంధం మొక్కల వేర్లు పోషకాలను తీసుకుంటూ ఉంటాయి. అందుకని, శ్రీగంధం సాగు చేసే రైతులు పక్కనే సరుగుడు, రోజ్ఉడ్ తదితర మొక్కల్ని కూడా నాటుకోవాలి. అయితే, శ్రీగంధం మొక్కలకు ఎండ సరిగ్గా తగిలేలా జాగ్రత్తపడాలి. బయారెడ్డి తన పదెకరాల్లో 300 సరుగుడు, 300 రోజ్ఉడ్ మొక్కల్ని సైతం నాటారు. ఒకటిన్నర ఇంచ్‌ల నీళ్లు వస్తున్న బోరుకు డ్రిప్పు అమర్చి పంటను సంరక్షించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల ద్వారా సాగులో ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నారు. తదనంతరం బయారెడ్డి శ్రీగంధం మొక్కల నర్సరీని నెలకొల్పారు. మూడేళ్ల కాలంలో ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర రైతులకు సుమారు 2.5 లక్షల శ్రీగంధం మొక్కలను అందిస్తూ రైతులకు నిరంతరం సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఫోన్ ద్వారానే గాక యూట్యూబ్ వీడియోల ద్వారా సలహాలు అందిస్తున్నారు. కంది, సరుగుడు, రోజ్ఉడ్... నల్లరేగడి, ఒండ్రు నేలలు, నీరు నిల్వ ఉండే భూములు, చౌడు నేలలు తప్ప ఏ ఇతర నేలల్లో అయినా శ్రీగంధం తోట నాటుకోవచ్చు. శ్రీగంధం మొక్కలతో పాటు విధిగా కంది, సరుగుడు, రోజ్ఉడ్ మొక్కలను నాటుకోవాలి, శ్రీగంధం మొక్కకు వరసలో రెండు వైపులా 1–1,5 అడుగుల దూరంలో కంది మొక్కలు నాటాలి. 3–5 అడుగుల దూరంలో సరుగుడు, 7.5–8 అడుగుల దూరంలో రోజ్ఉడ్ మొక్కల్ని నాటుకోవాలి. ఈ మొక్కల వేళ్లపై ఆధారపడి శ్రీగంధం మొక్కలు ఏపుగా పెరుగుతాయి. కరివేపాకు, అవిశ, కానుగ, సర్కారు తుమ్మ మొక్కల్ని కూడా హోస్ట్ ప్లాంట్లుగా నాటుకోవచ్చు. అయితే, ఈ రకాలను పెంచడం ద్వారా రైతుకు అంతగా ఆదాయం రాదు. కాబట్టి సరుగుడు, రోజ్ఉడ్ మొక్కల్ని నాటుతున్నట్లు బయారెడ్డి వివరించారు. మామిడి, సపోట, నేరేడు వంటి తోటల్లోనూ ఎప్పటిప్పుడు ప్రూనింగ్ చేసుకునే పరిస్థితి ఉంటే శ్రీగంధం మొక్కలు నాటుకోవచ్చన్నారు. ఎన్ని రకాల మొక్కలు, పంటలనైనా అంతర పంటలుగా వేసుకోవచ్చని, అయితే శ్రీగంధం మొక్కలపై నీడ పడకుండా ఉండేలా చూసుకోవటం ముఖ్యమని ఆయన అంటున్నారు. 12–15 ఏళ్లకు భారీగా ఆదాయం మొక్కల మధ్య 10 అడుగులు, వరుసల మధ్య 15 అడుగుల దూరం ఉండాలి, మూడేళ్ల పాటు నీటి తడులు అందిస్తూ సంరక్షించుకోవాలి. అప్పుడప్పుడూ సేంద్రియ ఎరువులు వేస్తే చాలని బయారెడ్డి అంటున్నారు. మూడేళ్ల తరువాత నీటి తడులు అవసరం లేదన్నారు. శ్రీగంధం పక్కన ఉండే చెట్ల వేర్లపై ఆధారపడి పోషకాలను గ్రహిస్తూ ఉంటాయి. 20 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. 12 నుంచి 15 ఏళ్లకు చేవదేలి కోతకు వస్తాయన్నారు. ఒక్కో చెట్టును సగటున కనీసం 15–20 కిలోల చేవగల శ్రీగంధం చెక్క వస్తుంది. ఎకరాకు రూ.3 కోట్ల వరకూ ఆదాయం! ప్రస్తుత మార్కెట్లో కిలో రూ.6 వేల నుండి రూ.12 వేల ధర పలుకుతోందని బయారెడ్డి తెలిపారు. ఈ లెక్కన ఒక్కో చెట్టుకు కనీసం రూ.ఒక లక్ష వరకూ ఆదాయం వస్తుందన్నారు. దీంతో ఒక ఎకరాకు రూ.3 కోట్ల వరకూ ఆదాయం వస్తుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దొంగల బెడద అయితే, ఖరీదైన చెట్లు కావడంతో ముదురు తోటలకు దొంగల బెడద అధికంగా ఉంటుంది. చెట్టుకు ఆరేళ్లు దాటిన తరువాత అక్కడక్కడా సీసీ కెమెరాలు అమర్చుకొని కాపాడుకోవాలన్నారు. శ్రీగంధం చెట్ల మద్య ఇతర పంటలను సాగు చేసుకోవచ్చన్నారు. శ్రీగంధం చెట్టుకు కొమ్మలను కత్తిరించకూడదన్నారు. మొదలుకు ఎండ అధికంగా తగలకుండా రక్షించుకుంటే మొక్క ఏపుగా పెరుగుతుందన్నారు. ఎటువంటి చీడపీడల బాధ ఉండదన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి శ్రీగంధం చెక్కలను మన దేశం ఏటా వేల టన్నులు దిగుమతి చేసుకుంటున్నందున మార్కెటింగ్ సమస్య లేదన్నారు. బయారెడ్డి తోటను ఇటీవల సందర్శించిన ఐ.డబ్ల్యూ.ఎస్.టి. సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.సుందరరాజ్ సంతృప్తిని వ్యక్తం చేశారు. మన శ్రీగంధం అత్యుత్తమమైనది అత్యంత ఖరీదైన కలప జాతుల్లో రెండోది శ్రీగంధం. 17 శ్రీగంధం జాతుల్లోకెల్లా శాంటాలం ఆల్బం అనే భారతీయ జాతి శ్రీగంధం అత్యుత్తమమైనది. 1965లో 2,680 టన్నుల శ్రీగంధం తైలాన్ని ఎగుమతి చేసిన మన దేశం ఇప్పుడు వేల టన్నుల్ని ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. ఆస్ట్రేలియా 30 ఏళ్ల క్రితం మన జాతి శ్రీగంధం విత్తనాలను తీసుకెళ్లి వేలాది ఎకరాల్లో సాగు చేస్తోంది. అటవీ జాతి అయిన శ్రీగంధం చెట్లను పొలాల్లో సాగు చేయటంపై 2006లో ఆం«క్షలు తొలగిపోయాయి. 2010 నుంచి మా సంస్థ సాగుపై రైతులకు శిక్షణ ఇస్తోంది. రైతుల పొలాల్లో 15 ఏళ్లు పెరిగిన చెట్టు నుంచి 12 కిలోల చావదేలిన చెక్క వస్తుంది. దీని నుంచి 6% నూనె వస్తుంది. కిలో చావదేలిన చెక్క ఖరీదు రూ. 12,500 ఉంది. శ్రీగంధం నూనె ప్రయోజనాలెన్నో ఉన్నాయి. కేన్సర్ మందుల్లోనూ వాడుతున్నారు. మార్కెట్ ధర పెరగడమే గానీ తగ్గటం ఉండదు. రైతులు శ్రీగంధం మొక్కల్ని ఇతర పంటలతో కలిపి సాగు చేసుకోవచ్చు. – డాక్టర్ ఆర్.సుందరరాజ్. (97404 33959), సీనియర్ శాస్త్రవేత్త, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బెంగళూరు శ్రీగంధం తోటలకు బీమా కల్పించాలి ప్రభుత్వం ఉద్యాన తోటలతో సమానంగా శ్రీగంధం సాగుకు రాయితీలు కల్పించి, డ్రిప్‌ను సబ్సిడీపై ఇచ్చి, బీమా సదుపాయం కల్పించి ప్రోత్సహించాలి. శ్రీగంధం చెట్లు కోతకు వచ్చినప్పుడు ఎకరానికి రూ. 4 లక్షల వరకు ప్రభుత్వానికి పన్ను రూపంలో ఆదాయం వస్తుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు జీవవైవిధ్యం, పచ్చదనం పెంపుదలకు శ్రీగంధం సాగు దోహదపడుతుంది. సీజనల్ పంటలు, పాడిపై ఆదాయం ద్వారా జీవనం సాగించే చిన్న, సన్నకారు రైతులు కొన్ని శ్రీగంధం మొక్కలు పెంచుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. తమకున్నది ఎకరం పొలం అయినా 10 సెంట్లలో 30 శ్రీగంధం మొక్కలు నాటుకుంటే 15 ఏళ్లకు ఒకేసారి మంచి ఆదాయం వస్తుంది. – తాళ్లపల్లి బయారెడ్డి, (94400 16995), శ్రీగంధం రైతు, ఇరగంపల్లి, కొత్తచెరువు మండలం, శ్రీసత్యసాయి జిల్లా – జి.కేశవరెడ్డి, పుట్టపర్తి అర్బన్ చదవండి: 18 ఎకరాలు: బత్తాయి, వరి, సీతాఫలం సాగు.. బియ్యం కిలో రూ. 80 చొప్పున! 450 రకాల మొక్కలు.. ఇంకా Bio Fence: వారెవ్వా.. అప్పుడు ఖర్చు 40 వేలు.. ఇప్పుడు 1500.. కోతుల బెడద లేదు! కాకర, చిక్కుడు.. అదనపు ఆదాయం కూడా.. -
శ్రీగంధం.. శ్రీమంతుడు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : చాలామంది రైతులు తక్షణ ఆదాయాన్నిచ్చే పంటలపైనే ఆసక్తి చూపుతారు. వాటినే పండిస్తుంటారు. కానీ అందరు రైతుల్లా కాకుండా తన కుటుంబ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని బహుదూరపు పంట శ్రీగంధం మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టాడో రైతు. ఆయనే బెల్లంపల్లి మండలం లంబాడితండాకు చెందిన అజ్మీరా శ్రీనివాస్. శ్రీగంధం మొక్కల పెంపకంపై ఆయన మాటల్లోనే.. నాకు లంబాడితండా గ్రామ చిరకలో ఎకరం వ్యవసాయ భూమి ఉంది. నాలుగేళ్ల క్రితం శ్రీగంధం మొక్కలు నాటాను. ఈ కర్రకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీని ధర కూడా చాలా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం మార్కెట్లో టన్నుకు రూ.10 లక్షల నుంచి రూ.15.లక్షల వరకు పలుకుతోంది. భవిష్యత్‌లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారి చదువు, పెళ్లిళ్లకు భవిష్యత్‌లో ఎలాంటి ఢోకా లేదు. గతంలో పత్తి, కంది, తదితర పంటలు సాగు చేశాను. కానీ ఆశించినంతగా లాభం రాలేదు. శ్రీగంధం మొక్కల పెంపకాన్ని నా స్నేహితుడు ప్రోత్సహించాడు. దీంతో ఈ మొక్కల పెంపకంపై దృష్టి సారించాను. ఒక్కో మొక్కను రూ.164 చెల్లించి బెంగళూరు నుంచి 520 మొక్కలు కొనుగోలు చేశాను. మొక్కల కొనుగోలుకు రూ.85.280 వరకు ఖర్చయింది. రవాణా, గుంతలు తవ్వడానికి, కూలీలు తదితర ఖర్చు మరో రూ.55వేల వరకు వచ్చింది. మొక్కలు నాటుకునే ముందు వాటికి ఎరువుగా ఆవుపేడ, యాపపిండి గుంతలో వేసిన. ఏడాదికి ఒకసారి చెట్టు మొదట్లో కిలో యాపపిండి వేస్తా. రూ.10వేల వరకు ఖర్చు వస్తుంది. అటవీశాఖ లెక్కల ప్రకారం ఎకరానికి 580 మొక్కలు నాటు కోవచ్చు. కానీ 520 మొక్కలు నాటిన. 15ఏళ్ల వరకు 30 నుంచి 35 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని మొక్కల అమ్మకందారుడు తెలిపాడు. నేను ఈ చెట్లను 20ఏళ్ల వరకు పెంచాలనుకుంంటున్న. అప్పుడు ప్రతీ మొక్క కనీసం 200 కిలోల వరకు దిగుబడి వస్తుందని అంచనా. ఈ లెక్కన ఎకరంలో నాటిన 520 మొక్కల నుంచి 50 టన్నుల వరకు దిగుబడి వస్తుందని భావిస్తున్న. టన్నుకు రూ.15లక్షల వరకు వచ్చినా రూ.7.50 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్‌లో ధర తగ్గవచ్చు. మరింత పెరగవచ్చు. ఇవన్నీ అంచనా లెక్కలు మాత్రమే. భవిష్యత్ తరాల వారికి మంచి ఆదాయాన్ని అందించాలనే ఉద్దేశంతో శ్రీగంధం సాగుపై దృష్టి సారించాను. దీనికి నీరు, విద్యుత్ వంటి సమస్యలేవీ ఉండవు. మొక్కల పెంపకానికి నేల అనువైనదిగా ఉందని మొక్కల విక్రయ కేంద్రం వారు వచ్చి పరిశీలిస్తారు. మొక్కలు నాటే ముందు వారు భూమి స్వభావం, మొక్కలకు అనుకూలంగా ఉందా లేదా అని చూసిన తర్వాతనే మొక్కలు అందజేశారు. మొక్కలు విక్రయించిన వారే భవిష్యత్‌లో కొనుగోలు చేస్తారు. అంతర పంటగా.. శ్రీగంధం మొక్కల మధ్యలో పసుపు, ఆలు, పెసలు వంటివి అంతర పంటగా సాగు చేస్తున్న. ఈ ఏడాది పసుపు పంట విత్తుకున్న. దీని ద్వారా కూడా ఏడాదికి రూ.35 వేల నుంచి రూ.45వేల వరకు ఆదాయం వస్తుంది. బోరు, విద్యుత్ మోటారు సౌకర్యం ఉండడంతో అంతరపంటకు శ్రీకారం చుట్టాను. గత ఏడాది అర ఎకరం భూమిలో పసుపు పండించాను. 5క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రూ.38వేల వరకు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది కూడా పసుపు సాగు చేసిన.