ఆదిలాబాద్ అగ్రికల్చర్ : చాలామంది రైతులు తక్షణ ఆదాయాన్నిచ్చే పంటలపైనే ఆసక్తి చూపుతారు. వాటినే పండిస్తుంటారు. కానీ అందరు రైతుల్లా కాకుండా తన కుటుంబ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని బహుదూరపు పంట శ్రీగంధం మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టాడో రైతు. ఆయనే బెల్లంపల్లి మండలం లంబాడితండాకు చెందిన అజ్మీరా శ్రీనివాస్. శ్రీగంధం మొక్కల పెంపకంపై ఆయన మాటల్లోనే.. నాకు లంబాడితండా గ్రామ చిరకలో ఎకరం వ్యవసాయ భూమి ఉంది.
నాలుగేళ్ల క్రితం శ్రీగంధం మొక్కలు నాటాను. ఈ కర్రకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీని ధర కూడా చాలా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో టన్నుకు రూ.10 లక్షల నుంచి రూ.15.లక్షల వరకు పలుకుతోంది. భవిష్యత్‌లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారి చదువు, పెళ్లిళ్లకు భవిష్యత్‌లో ఎలాంటి ఢోకా లేదు. గతంలో పత్తి, కంది, తదితర పంటలు సాగు చేశాను. కానీ ఆశించినంతగా లాభం రాలేదు. శ్రీగంధం మొక్కల పెంపకాన్ని నా స్నేహితుడు ప్రోత్సహించాడు.
దీంతో ఈ మొక్కల పెంపకంపై దృష్టి సారించాను. ఒక్కో మొక్కను రూ.164 చెల్లించి బెంగళూరు నుంచి 520 మొక్కలు కొనుగోలు చేశాను. మొక్కల కొనుగోలుకు రూ.85.280 వరకు ఖర్చయింది. రవాణా, గుంతలు తవ్వడానికి, కూలీలు తదితర ఖర్చు మరో రూ.55వేల వరకు వచ్చింది. మొక్కలు నాటుకునే ముందు వాటికి ఎరువుగా ఆవుపేడ, యాపపిండి గుంతలో వేసిన. ఏడాదికి ఒకసారి చెట్టు మొదట్లో కిలో యాపపిండి వేస్తా. రూ.10వేల వరకు ఖర్చు వస్తుంది. అటవీశాఖ లెక్కల ప్రకారం ఎకరానికి 580 మొక్కలు నాటు కోవచ్చు.
కానీ 520 మొక్కలు నాటిన. 15ఏళ్ల వరకు 30 నుంచి 35 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని మొక్కల అమ్మకందారుడు తెలిపాడు. నేను ఈ చెట్లను 20ఏళ్ల వరకు పెంచాలనుకుంంటున్న. అప్పుడు ప్రతీ మొక్క కనీసం 200 కిలోల వరకు దిగుబడి వస్తుందని అంచనా. ఈ లెక్కన ఎకరంలో నాటిన 520 మొక్కల నుంచి 50 టన్నుల వరకు దిగుబడి వస్తుందని భావిస్తున్న. టన్నుకు రూ.15లక్షల వరకు వచ్చినా రూ.7.50 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్‌లో ధర తగ్గవచ్చు. మరింత పెరగవచ్చు.
ఇవన్నీ అంచనా లెక్కలు మాత్రమే. భవిష్యత్ తరాల వారికి మంచి ఆదాయాన్ని అందించాలనే ఉద్దేశంతో శ్రీగంధం సాగుపై దృష్టి సారించాను. దీనికి నీరు, విద్యుత్ వంటి సమస్యలేవీ ఉండవు. మొక్కల పెంపకానికి నేల అనువైనదిగా ఉందని మొక్కల విక్రయ కేంద్రం వారు వచ్చి పరిశీలిస్తారు. మొక్కలు నాటే ముందు వారు భూమి స్వభావం, మొక్కలకు అనుకూలంగా ఉందా లేదా అని చూసిన తర్వాతనే మొక్కలు అందజేశారు. మొక్కలు విక్రయించిన వారే భవిష్యత్‌లో కొనుగోలు చేస్తారు.
అంతర పంటగా..
శ్రీగంధం మొక్కల మధ్యలో పసుపు, ఆలు, పెసలు వంటివి అంతర పంటగా సాగు చేస్తున్న. ఈ ఏడాది పసుపు పంట విత్తుకున్న. దీని ద్వారా కూడా ఏడాదికి రూ.35 వేల నుంచి రూ.45వేల వరకు ఆదాయం వస్తుంది. బోరు, విద్యుత్ మోటారు సౌకర్యం ఉండడంతో అంతరపంటకు శ్రీకారం చుట్టాను. గత ఏడాది అర ఎకరం భూమిలో పసుపు పండించాను. 5క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రూ.38వేల వరకు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది కూడా పసుపు సాగు చేసిన.
శ్రీగంధం.. శ్రీమంతుడు
Published Fri, Sep 26 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 PM
Advertisement
Advertisement