Sagubadi Problems With Pruning To Sri Gandham Trees Dos And Donts, Explained In Telugu - Sakshi
Sakshi News home page

Pruning Dos And Donts: శ్రీగంధం, టేకు చెట్ల  కొమ్మలు కత్తిరిస్తున్నారా? అంతే సంగతులు.. నష్టాలు తప్పవు!

Published Wed, Mar 15 2023 12:18 PM | Last Updated on Wed, Mar 15 2023 1:09 PM

Sagubadi Problems With Pruning To Sri Gandham Trees Dos And Donts - Sakshi

Sri Gandham Cultivation- Disadvantages Of Pruning: శ్రీగంధం (చందనం), టేకు వంటి అధిక విలువైన కలప తోటల సాగుకు దక్షిణాది రాష్ట్రాలు పెట్టింది పేరు. ప్రైవేటు భూముల్లో సాగుకు ప్రభుత్వం అనుమతించడంతో ముఖ్యంగా శ్రీగంధం తోటల సాగు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో గత 20 ఏళ్లలో బాగా పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఈ మధ్యనే సాగు విస్తరిస్తోంది.

శ్రీగంధం,టేకు సాగు రైతులకు అధికాదాయాన్నిచ్చే కలప తోటలు. శ్రీగంధం చెట్లను 15 ఏళ్లు శ్రద్ధగా పెంచితే ఒక్కో చెట్టుపై రూ. లక్ష వరకూ కూడా ఆదాయం రావటానికి అవకాశం ఉందని బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(ఐ.డబ్లు్య.ఎస్‌.టి.)  శాస్త్రవేత్త చెబుతున్నారు.

ఏపీ, తెలంగాణ సహా 5 దక్షిణాది రాష్ట్రాల్లో శ్రీగంధం, టేకు తోటల సాగుపై ఈ సంస్థ పరిశోధనలు చేస్తోంది. ఐ.డబ్లు్య.ఎస్‌.టి. శాస్త్రవేత్త డా. ఆర్‌.సుందరరాజ్‌ శ్రీగంధం, టేకు తోటల సాగులో సాధారణంగా రైతులు చేసే తప్పుల గురించి ‘సాక్షి సాగుబడి’ తో పంచుకున్నారు. 

ప్రూనింగ్‌తో నష్టాలు
మామిడి, దానిమ్మ, మునగ, మల్బరీ వంటి తోటల్లో పంటకోతలు పూర్తయ్యాక కొమ్మ కత్తిరింపులు చేస్తుంటారు. ఈ తోటల్లో ప్రూనింగ్‌ వల్ల అనేక రకాలుగా వెసులుబాటు కలుగుతుంది. దిగుబడి పెరగడంతో΄ాటు చెట్ల కొమ్మలు మరీ ఎత్తుగా పెరగనీయకుండా ఉండటం వల్ల పంటకోత సులువు అవుతుంది. ఈ అలవాటుకొద్దీ శ్రీగంధం, టేకు చెట్లకు కూడా ప్రూనింగ్‌ చేస్తున్నారు. ఇది పెద్ద తప్పు. మేలు కన్నా కీడు ఎక్కువగా జరుగుతోందని డా. సుందర్‌రాజ్‌ అంటున్నారు. 

శ్రీగంధం, టేకు చెట్ల కాండం లోపలి కలపను, మధ్యలోని చేవను చీడపీడల నుంచి రక్షించేంది కాండం పైన ఉండే బెరడే. కొమ్మలు కత్తిరించినప్పుడు బెరడు దెబ్బతిని, ఎండిపోతుంది. కొమ్మను నరికిన చోట కాండం లోపలి పొరలు బయటపడతాయి. ఆ విధంగా కలపను కుళ్లింపజేసే శిలీంధ్రాలు, నష్టం చేసే కాండం తొలిచే పురుగులు ప్రూనింగ్‌ జరిగిన చోటు నుంచి చెట్టు లోపలికి ప్రవేశిస్తాయి.

తద్వారా చెట్టు బలహీనపడుతుంది. ఆకుల పెరుగుదల మందగిస్తుంది. కాయలు రాలిపోతాయి. ప్రూనింగ్‌ గాయాలు కొమ్మల సహజ పెరుగుదలను దెబ్బతీస్తాయి. చెట్టు సమతుల్యత దెబ్బతిని గాలుల వల్ల నష్టం కలుగుతుంది. చాలా సందర్భాల్లో చెట్లు ప్రూనింగ్‌ జరిగిన కొద్దికాలంలోనే చని΄ోతాయి కూడా అంటున్నారు డా. సుందర్‌రాజ్‌. 

కలప మన్నికకు గొడ్డలిపెట్టు
టేకు కలప పదికాలాల పాటు చెక్కుచెదరకుండా ఉంటుంది. టేకు కలప జీవక్షీణతకు గురిచేసే సూక్ష్మజీవరాశిని అరికట్టే రక్షక పదార్థాలు (మెటబాలిటీస్‌ లేదా ఎక్స్‌ట్రాక్టివ్స్‌) చెట్టు కాండం లోపలి పొరల్లో ఉండబట్టే టేకు కలపకు ఈ గట్టితనం వచ్చింది. ప్రూనింగ్‌ చేసిన టేకు చెట్లలో ఈ పదార్థాలు లోపించటం వల్ల ఆ కలప మన్నిక కాలం తగ్గిపోతుంది.

ఐ.డబ్ల్యూ.ఎస్‌.టి. నిపుణుల అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇంటర్నేషనల్‌ బయోడిటీరియోరేషన్‌ అండ్‌ బయోడిగ్రేడేషన్‌ జర్నల్‌లో ప్రచురితమైన వ్యాసంలో ఈ విషయాలు పొందుపరిచారు. శ్రీగంధం చెట్లకు ప్రూనింగ్‌ చేస్తే ఎత్తు పెరగొచ్చు గానీ కాండం చుట్టుకొలత పెరగదు. ప్రూనింగ్‌ గాయాల దగ్గర సుడులు ఏర్పడటం వల్ల చెక్క అందం పాడవుతుంది. 

ప్రూనింగ్‌ చేయటం వల్ల శ్రీగంధం, టేకు చెట్లకు నష్టం జరగటమే కాదు దాని చుట్టూ ఉండే పర్యావరణ  వ్యవస్థకు తెలియకుండానే పెద్ద నష్టం జరుగుతుందట. ప్రూనింగ్‌ చేసిన చెట్లకు గాయాలపై బోర్డాక్స్‌ పేస్ట్‌ వంటి శిలీంధ్రనాశనులను పూస్తుంటారు. అయితే, ఇది పూర్తి రక్షణ ఇస్తుందని చెప్పలేమని డా. సుందరరాజ్‌ తెలిపారు. రసాయనాల ప్రతికూల ప్రభావాలు శ్రీగంధం చెట్లపై చాలా ఉంటుంది. ఎవరో చెప్పిన మాటలు విని శ్రీగంధం, టేకు చెట్లకు ప్రూనింగ్‌ చేయొద్దని, చెట్లను సహజంగా పెరగనిస్తూ ప్రకృతి సేద్య పద్ధతులను అనుసరించాలని డా. సుందరరాజ్‌ సూచిస్తున్నారు. 

15 ఏళ్ల చెట్టుకు 10 కిలోల చేవ
ఒక రైతు ఇంటి దగ్గర పెరుగుతున్న ఈ మూడు శ్రీగంధం చెట్ల వయస్సు 15 సంవత్సరాలు. ఈ మూడిటికీ కొమ్మలు కత్తిరించారు. తక్కువ ప్రూనింగ్‌ వల్ల రెండు చెట్లు కోలుకున్నాయి. కానీ మూడో చెట్టుకు అతిగా ప్రూనింగ్‌ చేయటం వల్ల కోలుకోలేకపోయింది. మేం ఈ చెట్లకు చేవ (హార్ట్‌వుడ్‌) ఎంత ఉందో పరీక్షించాం. మొదటి రెండు చెట్ల కాండంలో మాత్రమే హార్ట్‌వుడ్‌ కనిపించింది.

బలహీనంగా ఉన్న మూడో చెట్టులో అసల్లేదు. చెట్టు మీ కోసమో, నా కోసమో చేవదేలదు. తన బలం కొద్దీ చేవదేలుతుంది. కాబట్టి ఏ చెట్టు నాణ్యతైనా, చేవ పరిమాణమైనా అది ఎంత ఆరోగ్యకరంగా పెరుగుతున్నదన్నదానిపై ఆధారపడి ఉంటుంది. నా అనుభవం ప్రకారం, 15 సంవత్సరాలు ఆరోగ్యంగా పెరిగిన చందనపు చెట్టుకు కనీసం 10 కిలోల చేవ ఉంటుంది. దాన్ని బట్టి రైతుకు ఆదాయం వస్తుంది.
– డా. ఆర్‌.సుందరరాజ్‌ (97404 33959), శాస్త్రవేత్త, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, బెంగళూరు  
– పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

చదవండి: ఎటాక్‌.. స్ట్రోక్‌ వేర్వేరు... 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement