శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని తెలుగు లోగిళ్లు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ముఖ్యంగా అమ్మవారి దేవాలయాలు తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేశంలోని పలు ఆలయాల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తూర్పగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలోని ముసలమ్మ తల్లి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు.
ఆలయ నిర్వాహకులు సుమారు ₹13.25 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో జగన్మాతను ప్రత్యేకంగా అలంకరించారు. రూపాయి, రెండు, ఐదు, పది,ఇరవై,ఏభై, వంద,రెండొందలు,అయిదొందలు సహా చెలామణిలో ఉన్న నోట్లతో అద్భుతంగా అమ్మవారిని అలంకరించారు. అలాగే బ్యాంకుల నుంచి కూడా కొత్త నాణేలు తీసుకొని అలంకరించడం మరో ప్రత్యేకత. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తాము ప్రతి ఏడాది కరెన్సీ నోట్లతో అమ్మవారిని ఇలా అలంకరిస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. సుమారు 30 రోజుల పాటు ముప్పై మంది శ్రమించి ఈ అలంకరణ చేశారు. ఇక గతంలోనూ సంక్రాంతి,విజయదశమి, దీపావళి తదితర వేడుకల్లో అమ్మవారిని వినూత్న రీతిలో అలంకరిస్తూ ఈ ఆలయ కమిటీ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేకతను చాటుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారిని ఇలా ధనలక్ష్మి అమ్మవారిగా అలంకరించడం అందర్నీ ఆకట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment