న్యూఢిల్లీ: దీర్ఘకాలిక పెట్టుబడులకు భారతదేశం అత్యుత్తమమైనదని ప్రధాని నరేంద్రమోదీ గురువారం పేర్కొన్నారు. వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్‌టేబుల్ (వీజీఐఆర్) 2020 సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, ప్రపంచంలోనే అతి తక్కువ కార్పొరేట్ పన్ను ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని తెలిపారు. ‘‘విశ్వసనీయ రిటర్న్స్‌ను మీరు కోరుకుంటున్నట్లయితే, ఇందుకు భారత్ చక్కటి దేశం. ప్రజాస్వామ్యయుతంగా వ్యవస్థలు నడిచే విషయంలో భారత్ చక్కటి ప్రదేశం. మీరు సుస్థిరతను కోరుకుంటే అందుకు భారత్ అనువైన దేశం. దీర్ఘకాలంలో మంచి వృద్ధి అవకాశాలను కోరుకుంటే, భారత్ ఇందుకు సరైన మార్గం’’ అని మోదీ అన్నారు. పటిష్ట ప్రజాస్వామ్యం, యువత, డిమాండ్, వైవిద్యం వంటి విశిష్ట అంశాలను భారత్ ఆఫర్ చేస్తోందన్నారు. వైవిధ్యమైన మార్కెట్లను ఒకే మార్కెట్‌లో చూడగలుగుతారని విదేశీ పెట్టుబడిదారులకు సూచించారు. ప్రపంచాభివృద్ధి, సంక్షేమంపై భారత్ బహుముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు.
దిగ్గజ దేశాల ప్రతినిధులు...
ఈ సదస్సులో అమెరికా, యూరోప్, కెనడా, కొరియా, జపాన్, పశ్చిమాసియా, ఆస్ట్రేలియా, సింగపూర్‌లకు చెందిన దాదాపు 20 మంది ఉన్నత స్థాయి వ్యవస్థాగత ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. వీరి నిర్వహణలో ఉన్న పెన్షన్ అండ్ సావరిన్ వెల్త్ ఫండ్స్ విలువ దాదాపు ఆరు ట్రిలియన్ డాలర్లను ఒక అధికారిక ప్రకటన తెలిపింది. భారత ఆర్థిక మంత్రిత్వశాఖ, నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ సంయుక్తంగా ఈ రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తదితరులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు.
గ్లోబల్ ఇన్వెస్టర్లకు ప్రధాని పిలువు
దీర్ఘకాల పెట్టుబడులకు భారత్ బెస్ట్
Published Fri, Nov 6 2020 6:23 AM | Last Updated on Fri, Nov 6 2020 6:23 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment