సేల్ అగ్రిమెంటే కీలకం!
బిల్డర్ల కస్టమైజ్డ్ అగ్రిమెంట్లతో మోసపోవద్దు
కార్పస్ ఫండ్‌ను అసోసియేషన్ ఖాతాలో జమ చేయాలి
రెరా రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాజెక్టుల్లోనే కస్టమర్ల పెట్టుబడులకు భద్రత
తక్కువ ధరకు వస్తుందనో, ఆఫర్లు ఇస్తున్నారనో తొందరపాటు నిర్ణయాలొద్దు
టీజీ– రెరా సభ్యుడు కె.శ్రీనివాసరావు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: సొంతింటి కల సాకారంలో కస్టమర్‌తో బిల్డర్ చేసుకునే సేల్ అగ్రిమెంట్ అత్యంత కీలకం. ఒప్పందపత్రంలోని నిబంధనలు, షరతులను బట్టి మన కల తీరుతుందో లేక మధ్యలోనే పటాపంచలవుతుందో ఇట్టే చెప్పేయొచ్చు. అందుకే మనిషికి హృదయ స్పందనలాగే డెవలపర్‌కు, కొనుగోలుదారులకు మధ్య జరిగే సేల్ అగ్రిమెంట్ అంతకంటే ముఖ్యమని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ–రెరా) సభ్యులు కె.శ్రీనివాస రావు అంటున్నారు. ఆయనతో ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూ విశేషాలివీ..
బహుళ అంతస్తుల నిర్మాణ సంస్థలన్నీ తమకు అనుకూలమైన నిబంధనలను, షరతులను పొందుపరిచి కస్టమైజ్డ్ అగ్రిమెంట్లను రూపొందించి కస్టమర్లతో సేల్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాయి. ఇలాంటి వాటిపట్ల గృహ కొనుగోలుదారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. పెట్టుబడులకు భద్రత, రక్షణ ఉండాలంటే రెరా రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాజెక్ట్‌ల్లో కొనుగోలు చేయడం ఉత్తమం. తక్కువ ధరకు వస్తుందనో, ఆఫర్లు ఇస్తున్నారనో ప్రీలాంచ్, బై బ్యాక్ స్కీమ్స్ వలలో చిక్కితే రోడ్డున పడతారు.
నిర్మాణం ఆలస్యమైతే వడ్డీ చెల్లించాల్సిందే..
నిర్మాణ దశలను బట్టి డెవలపర్లకు బ్యాంక్ నిధులను విడుదల చేస్తుంది. రెరా నిబంధనల ప్రకారం ఆయా నిధులను ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాలో జమ చేసి, ఆ నిర్మాణ పనుల కోసం మాత్రమే వినియోగించాలి. అయితే డెవలపర్లు నిధులను ఇతర ప్రాజెక్ట్‌లు, అవసరాలకు మళ్లిస్తుండటంతో ప్రాజెక్ట్ తుదిదశకు చేరుకునే సరికి నిధులు సరిపడాలేక అది ఆగిపోతుంది. మరోవైపు నిధులు పూర్తిగా విడుదల కాగానే కస్టమర్‌కు బ్యాంక్ నుంచి నెలవారీ వాయిదా (ఈఎంఐ) చెల్లించడం ప్రారంభమవుతుంది. కానీ, కస్టమర్‌కు ఆ టైంకు ఫ్లాట్ చేతికి రాదు. గృహప్రవేశం చేయలేరు. దీంతో బయట అద్దె, ఫ్లాట్‌కు ఈఎంఐ చెల్లించడం కస్టమర్‌కు అదనపు భారంగా మారుతుంది. గడువులోగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేయని డెవలపర్లు ఆలస్యం అయిన కాలానికి 10.25 శాతం వడ్డీని కస్టమర్‌కు చెల్లించాల్సిందే. ఒకవేళ సమయానికి కస్టమర్లు బిల్డర్‌కు సొమ్ము చెల్లించకపోతే వారు కూడా 10.25 శాతం వడ్డీని డెవలపర్‌కు అందజేయాల్సిందే.
కార్పస్ ఫండ్ అందజేయాలి..
సెమీ ఫర్నిష్ ఫ్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూ.2 లక్షలు, 3 లక్షల మేర రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గుతాయనే బిల్డర్ల ఉచిత సలహాకు చాలామంది కస్టమర్లు చిక్కుతున్నారు. అయితే సెమీ ఫర్నీష్ ఫ్లాట్‌ను పూర్తి ఫర్నీష్‌గా ఎప్పుడు చేస్తారనే విషయంపై బిల్డర్‌తో సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకోవాలి. లేకపోతే రిజిస్ట్రేషన్ అయిపోయిందంటూ టైల్స్, పెయింటింగ్ వంటి తుది మెరుగులు దిద్దకుండా అసంపూర్తి ఫ్లాట్‌నే కస్టమర్‌కు అప్పగించి బిల్డర్లు చేతులు దులుపుకుంటారు. కస్టమర్ల నుంచి వసూలు చేసే కార్పస్ ఫండ్‌ను బిల్డర్ తీసుకోరాదు. అసోసియేషన్‌కు ప్రత్యేకంగా ఎస్క్రో బ్యాంక్ ఖాతాను తెరిచి, వడ్డీతోసహా కార్పస్ ఫండ్‌ను అందులో జమ చేయాలి.
కస్టమర్ల అనుమతి తప్పనిసరి..
కస్టమర్‌తో ఒప్పందం చేసుకున్నాక ప్రాజెక్ట్ లేదా ఫ్లాట్ డిజైనింగ్, ఎలివేషన్ వంటి వాటిల్లో బిల్డర్ ఏమైనా మార్పులు చేయాలంటే 2/3 వంతు కస్టమర్ల అనుమతి తప్పనిసరి. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని బిల్డర్ బ్యాంక్ రుణంతోనే కడుతున్నప్పుడు కస్టమర్లు బిల్డర్‌కు పోస్ట్ డేటెడ్ చెక్స్ అందజేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా డెవలపర్లు కస్టమర్ల నుంచి 10 శాతానికి మించి టోకెన్ అమౌంట్‌ను వసూలు చేయకూడదు.
భూ యజమానికి చిక్కులు..
నిర్మాణం పూర్తయ్యాక ఫ్లాట్ పొజిషన్‌కు కస్టమర్‌కు రెరా చట్టం ప్రకారం 2 నెలల సమయం ఉంటుంది. కానీ, 15 రోజుల్లోనే పొజిషన్ తీసుకోవాలని బిల్డర్లు కస్టమర్లను ఒత్తిడి చేస్తుంటారు. ఇంటీరియర్ పనులు, వ్యక్తిగత కారణాల వల్ల కొందరు కస్టమర్లు పొజిషన్ తీసుకోవడంలో ఆలస్యం చేస్తుంటారు. మరికొందరు పొజిషన్ తీసుకుంటే అపార్ట్‌మెంట్ నిర్వహణ వ్యయం చెల్లించాల్సి ఉంటుందని ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుంటారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి స్థల యజమానితో బిల్డర్ ఒప్పందం చేసుకుంటే రెరా చట్టం ప్రకారం డెవలపర్ కూడా ప్రమోటరే అవుతారు. కాబట్టి ఇరువురి మధ్య జరిగే అగ్రిమెంట్లు పారదర్శకంగా ఉండాలి. లేకపోతే భూ యజమానికి కూడా చిక్కులు తప్పవు.
Comments
Please login to add a commentAdd a comment