
జనవరి–మార్చి మధ్య 47 శాతం డౌన్
టాప్ 9 నగరాల్లో 23 తగ్గిన విక్రయాలు
ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు, బలహీన డిమాండ్ ప్రభావం
ప్రాప్ ఈక్విటీ సంస్థ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఇళ్ల అమ్మకాలు పడిపోయాయి. జనవరి–మార్చి కాలంలో హైదరాబాద్‌లో 11,114 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదవుతాయని రియల్ ఎస్టేట్ డేటా విశ్లేషణ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా. క్రితం ఏడాది తొలి మూడు నెలల కాలంలోని అమ్మకాలు 20,835 యూనిట్లతో పోల్చి చూస్తే 47 శాతం తగ్గనున్నాయి.
ఇలా దేశవ్యాప్తంగా టాప్ 9 నగరాల్లో మార్చి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 23 శాతం తక్కువగా 1,05,791 యూనిట్లుగా ఉండొచ్చని అంచనా వేసింది. క్రితం ఏడాది మొదటి మూడు నెలల్లో ఈ నగరాల్లో అమ్మకాలు 1,36,702 యూనిట్లుగా ఉన్నాయి. అధిక ధరలతో డిమాండ్ బలహీనపడడం, ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు విక్రయాలు పడిపోవడానికి కారణాలుగా ప్రాప్ ఈక్విటీ తన నివేదికలో పేర్కొంది.
తొమ్మిది నగరాల్లో ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగళూరు మాత్రం వృద్ధిని చూసినట్టు తెలిపింది. ‘‘మూడేళ్లపాటు రికార్డు స్థాయి సరఫరా అనంతరం హౌసింగ్ మార్కెట్లో దిద్దుబాటు చోటుచేసుకుంది. అమ్మకాలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణం. కొత్త ఇళ్ల సరఫరా సైతం జనవరి–మార్చి మధ్య 34 శాతం క్షీణించి 80,774 యూనిట్లకు పరిమితం కావచ్చు. క్రితం ఏడాది మొదటి త్రైమాకంలో సరఫరా 1,22,365 యూనిట్లుగా ఉంది. ఇళ్ల ధరలు పెరగడం, బౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, దేశ ఆర్థిక వ్యవస్థలో కొంత బలహీనత అమ్మకాలు తగ్గడానికి కారణాలుగా ఉన్నాయి’’అని ప్రాప్ ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజ తెలిపారు.
పట్టణాల వారీగా విక్రయ అంచనాలు..
→ బెంగళూరులో జనవరి–మార్చి మధ్య విక్రయాలు 18,508 యూనిట్లుగా ఉండొచ్చు. క్రితం ఏడాది తొలి క్వార్టర్‌లో అమ్మకాలు 16, 768 యూనిట్లతో పోల్చితే 10%పెరుగుతాయి.
→ ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లోనూ 10 శాతం వృద్ధితో 11,221 యూనిట్ల అమ్మకాలు నమోదు కావచ్చు.
→ చెన్నైలో 4,858 యూనిట్లు అమ్మడు కావచ్చు. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 4,962 యూనిట్లతో పోల్చి చూస్తే 2 శాతం క్షీణించే అవకాశం ఉంది.
→ కోల్‌కతాలో 28 శాతం తక్కువగా 4,219 యూనిట్ల విక్రయాలు నమోదవ్వొచ్చు.
→ ముంబై మార్కెట్లో 10,432 యూనిట్లు అమ్ముడుపోవచ్చు. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 16,204 యూనిట్లుగా ఉన్నాయి.
→ నవీ ముంబైలో 7 శాతం తక్కువగా 8,551 యూనిట్లకు పరిమితం కావొచ్చు.
→ పుణెలోనూ అమ్మకాలు 33 శాతం తక్కువగా 17,634 యూనిట్లుగా ఉంటాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 26,364 యూనిట్లుగా ఉన్నాయి.
→ థానేలో 27 శాతం క్షీణతతో అమ్మకాలు 19,254 యూనిట్లుగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment