ఉదయగిరి, న్యూస్‌లైన్: సొమ్మొకరిది..సోకొకరిది..చందంగా తయారైంది ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన భూముల పరిస్థితి. వారి పేదరికాన్ని ఆసరా చేసుకుని పెద్దలు లబ్ధి పొందుతుండటమే ఇందుకు నిదర్శనమే.
పేదల చేతుల్లో పదో, పావలో పెట్టి ఆ భూములను స్వాధీనం చేసుకుంటున్న కొందరు ధనవంతులు జామాయిల్ తోటలు సాగు చేస్తూ కోట్లు గడిస్తున్నారు. లబ్ధిదారుల్లో ఎక్కువ శాతం మంది నిరక్షరాస్యులే ఉండటంతో మాయమాటలతో మభ్యపెట్టి 20 నుంచి 30 ఏళ్ల లీజుకు భూములు తీసుకున్నట్లు అగ్రిమెంట్లు రాయించుకుంటున్నారు. దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరంలోని పరిస్థితే ఇందుకు నిదర్శనం.
దుత్తలూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 2100, 2200, 2205, 2199, 2198, 2167, 2170, 2188, 2180, 2189, 2107, 2106, 2202, 2173, 2197, 2190, 2186, 2201, 2196, 2191, 2185, 2194, 2203, 2183, 2193, 2204, 2192, 2185, 2199, 2173, 2190, 2181, 2298, 2274, 2290లోని 206 ఎకరాల సీజేఎఫ్‌ఎస్ భూములను ప్రభుత్వం 1977లో పేదలకు పంపిణీ చేసింది. 50 మంది ఎస్సీలకు, 70 మంది బీసీలకు రెండు నుంచి రెండున్నర ఎకరాల చొప్పున కేటాయించింది.
ఈ భూముల్లో మొట్టపంటలు సాగుచేసుకుంటూ కొన్నేళ్లుగా జీవనం సాగిస్తున్నారు. ఐదేళ్ల క్రితం కృష్ణాజిల్లాకు చెందిన ఓ భూస్వామి మధ్యవర్తుల సాయంతో ఈ భూముల్లోకి ప్రవేశించాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి డబ్బు ఆశ చూపి 2027 వరకు లీజుకు ఇచ్చినట్లు అంగ్రిమెంట్లు రాయించుకున్నాడు. ఎకరాకు వెయ్యి నుంచి రూ.2 వేలు మా త్రం లీజు ఇస్తూ సుమారు 170 ఎకరాల్లో జామాయిల్ సాగు చేపట్టాడు. ప్రస్తుతం జామాయిల్ కొయ్యకు మార్కెట్‌లో విపరీతమైన గిరాకీ ఉండటంతో ఎకరాకు రూ.2 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. 15 రోజులుగా ఈ భూముల్లో సాగుచేసిన జామాయిల్ కటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ భూస్వామికి మూడున్నర కోట్లకు పైగా ఆదాయం వస్తుండటం గమనార్హం.
నిబంధనలకు తూట్లు
అసైన్‌మెంట్, సీజేఎఫ్‌ఎస్ భూములను లీజుకు ఇవ్వడం, విక్రయించడం ప్రభుత్వ నిబంధనల ప్రకారం నేరం. సీజేఎఫ్‌ఎస్ భూములను మం జూరు చేయడమంటేనే లీజుకు ఇచ్చినట్లు. ఈ భూముల్లో లబ్ధిదారులు సొంతంగా సాగుచేసి ఫలితాన్ని మాత్రమే పొందాలి. భూములు దుర్వినియోగం చేస్తే లీజు రద్దుచేస్తారు.
ఈ నిబంధనలపై లబ్ధిదారులకు అవగాహన లేకపోవడంతో అధికారులు అండగా భూస్వాములు హవా సాగిస్తున్నారు. కొందరు మాత్రం నిబంధనలు తెలుసుకుని భూములను తిరిగి ఇచ్చేయాలని కోరుతున్నా ఫలితంలేదు. అధికారుల అండతో భూస్వాములు లబ్ధిదారులను బెది రిస్తున్నారు. తమ భూములను తమకు అప్పగించేందుకు సహకరించాలని కొందరు తహశీల్దార్ రమేష్‌ను కలిసినా పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా భూముల్లో సాగుచేసిన జామాయిల్ కటింగ్‌కు ముడుపులు తీసుకుని అనుమతులు ఇవ్వడం గమనార్హం.
ఓ అధికారి కీలకపాత్ర
జామాయిల్ కటింగ్‌ను అనుమతి ఇచ్చే విషయంలో తహశీల్దార్ కార్యాలయంలో అన్నీ తానై వ్యవహరించే ఉత్తమ ఉద్యోగి అవార్డు గ్రహీత అయిన ఓ అధికారి కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. జామాయిల్ సాగుచేసిన వారి నుంచి మధ్యవర్తుల సహకారంతో ముడుపులు తీసుకుని అనుమతులు ఇప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెడితే ఈ వ్యవహారంలో చోటుచేసుకున్న అక్రమాలు వెలుగులోకి రావడంతో పాటు పేదల భూముల్లో కోట్లు ఆర్జిస్తున్న వారి నుంచి రికవరీ చేసే అవకాశముంటుంది.
ఇందిర జలప్రభకూ దూరం
పేదల భూములకు సాగునీటి వనరు కల్పిం చేందుకు ఇందిర జలప్రభ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా బ్రహ్మేశ్వరం పరిధిలోని భూములకు సుమారు 14 బోర్లు మంజూరయ్యాయి. తీరా అధికారులు క్షేత్ర పరిశీలనకు వెళితే ఆ భూముల్లో జామాయిల్ మొక్కలు ఉండటంతో బోర్ల మంజూరు విషయంలో వెనక్కుతగ్గారు. ఈ క్రమంలో ఇందిర జలప్రభ పథకాన్ని వినియోగించుకునే అవకాశాన్ని పేదలు కోల్పోయారు.
పేదల భూముల్లో పెద్దల పాగా
Published Fri, Feb 21 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM
Advertisement
Advertisement