udaya giri
-
బాబుకు తగిన బుద్ధిచెబుతాం
– ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారంటూ మహిళలు ఆగ్రహం – గడప గడపకూ వైఎస్సార్‌లో తమ సమస్యలు విన్నవించిన ప్రజలు ఉదయగిరి: గత ఎన్నికల్లో అనేక హామీలిచ్చి అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధిచెబుతామని పలువురు మహిళలు ఉదయగిరి వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ముందు కుండబద్ధలు కొట్టారు. ఉదయగిరిలో బుధవారం జరిగిన ‘గడప గడపకూ వైఎస్సార్’లో అనేకమంది తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో అన్నివిధాలుగా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందామని, టీడీపీ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఉదయగిరి మెయిన్‌రోడ్డు, బీసీ కాలనీలో ఇంటింటికి తిరిగి బాబు వాగ్దానాలపై ప్రజా బ్యాలెట్‌ను స్థానికులకు అందజేసి మార్కులు వేయించారు. ఎక్కువ శాతం హామీలు పూర్తిగా నెరవేర్చలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అబద్ధాలాడి అధికారం..మరచిన హామీలు అనంతరం స్థానిక పంచాయతీ బస్టాండు వద్ద జరిగిన సమావేశంలో మేకపాటి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేందుకు అనేక అబద్ధాలాడి పగ్గాలు చేపట్టిన తర్వాత అందులో ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదన్నారు. నీరు–చెట్టు పనుల్లో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని తెలుగుతమ్ముళ్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. జన్మభూమి కమిటీలు అర్హులకు మొండిచేయి చూపించి ప్రభుత్వ పథకాలను టీడీపీ వారికే కట్టబెడుతున్నారని మండిపడ్డారు. బీడుభూములు సస్యశ్యామలం చేసేందుకు వెలుగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్‌కు నిధులు మంజూరుచేయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు బి.శ్రీనివాసులు, పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ మార్కెట్ సుభాని, అక్కి భాస్కర్‌రెడ్డి, ఖిల్జీ సలీం, గడియాల్చి ఎస్ధాని, షంషీర్, చేజర్ల సుధాకర్‌రెడ్డి,గౌస్‌మొహిద్దిన్, ఏడుకొండలు, గొల్లపల్లి తిరుపతి, సోమిరెడ్డి, రమణారెడ్డి, నియోజకవర్గ నేతలు గణపం బాలక్రిష్ణారెడ్డి, ఆండ్రా బాలగురవారెడ్డి, గుంటుపల్లి నాగభూషణం, షేక్.అలీఅహ్మద్, పావులూరి మాల్యాద్రిరెడ్డి,బొల్లినేని సత్యనారాయణ, పాలవెల్లి మాలకొండారెడ్డి, యారం నరసింహరావు,పి.విజయభాస్కర్‌రెడ్డి, జి.పుల్లయ్య, తదితరులున్నారు. -
పాడి రైతుపై కరువు పోటు
నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో మెట్ట ప్రాంతంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. పాడి ద్వారానైనా జీవనం సాగిద్దామనుకున్న రైతులకు నిరాశే మిగులుతోంది. చినుకు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసినా నీటి చుక్క నేల రాకపోవడంతో వారి పరిస్థితి దారుణంగా తయారైంది. తినడానికి పచ్చిగడ్డి, తాగడానికి నీరు లేక పశువుల పొదుగులు ఎండిపోతున్నాయి. పాల దిగుబడి గణనీయంగా పడిపోయింది. పూటకు ఐదు లీటర్ల పాలిచ్చే గేదె, రెండు లీటర్లు ఇవ్వడం కూడా కష్టంగా మారింది. కళ్ల ముందే గేదెలు నీళ్లు లేక, తిండిలేక శుష్కించిపోవడం చూడలేక పలువురు కబేళాలకు తరలిస్తున్నారు. ఉదయగిరి: జిల్లాలో వ్యవసాయం తర్వాత పాడి ఆధారంగానే లక్షలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో పంటలు పండక పాడిగేదెల ద్వారానే భృతి కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ఉదయగిరి, ఆత్మకూరు, కావలిలోని మెట్ట మండలాలలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. పంటల సంగతి దేవుడెరుగు. కనీసం పశువులు, జీవాలకు కూడా మేత, నీరు లేదు. అనేక గ్రామాల్లో బోర్లలోనూ నీరు పూర్తిగా అడుగంటాయి. వాగులు, వంకలు, చెరువులు నెర్రెలు బారాయి. ఈ పరిస్థితుల్లో పశువులకు కష్టాలు మొదలయ్యాయి. వీటిని నమ్ముకున్న పాడి రైతుకు కష్టాలు తప్పలేదు. గణనీయంగా తగ్గిన దిగుబడి జిల్లాలో రోజుకు సగటున 2 లక్షలకుపైగా లీటర్లు విజయ డెయిరీతో పాటు ప్రైవేటు డెయిరీలు సేకరిస్తాయి. కానీ ఈ ఏడాది జనవరి నుంచే పాల దిగుబడి గణనీయంగా తగ్గుతూ వచ్చింది. సాధారణంగా ఏటా వేసవిలో పాల దిగుబడి తగ్గటం సహజమే. కానీ జూన్‌లో కురిసే తొలకరులతో మళ్లీ పాల దిగుబడి పెరుగుతుంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో జూన్ నెలాఖరులోనూ వరుణుడు కరుణించలేదు. దీంతో మేత కొరత తీవ్రమైంది. నీటి ఆధారంగా సాగుచేసే పచ్చిగడ్డి ఎండిపోయింది. ఎండుగడ్డి ధర ఆకాశాన్నంటడంతో కొనే పరిస్థితి లేదు. ఒక్క ట్రాక్టరు గడ్డి ధర రూ.15 వేల నుంచి రూ.20 వేలు పలుకుతోంది. ఇది రెండు గేదెలకు మూడు నెలలు వస్తుంది. ఇంత ధర పెట్టి రైతులు కొనే పరిస్థితి లేదు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు పాతిక వేల లీటర్ల పాల సేకరణ కూడా జరగడం లేదు. మార్కెట్లో చక్రం తిప్పుతున్న తిరుమల, దొడ్ల, హెరిటేజ్, విష్ణుప్రియలాంటి ప్రైవేటు డెయిరీలకు కూడా కరువు పోటు తప్పలేదు. ధర పెరిగింది..ఖర్చులు పెరిగాయి ఈ ఏడాది పాల ధర ఆశాజనకంగానే ఉంది. పది శాతం వెన్న ఉంటే లీటరు పాలకు రూ.50 ఇస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంలో రూ.42 ఇచ్చారు. పాల ధర పెరిగినా కరువు పరిస్థితుల్లో దిగుబడి మాత్రం గణనీయంగా తగ్గిం ది. రోజుకు 8 లీటర్లు ఇచ్చే పాడి గేదె ప్రస్తుతం మూడు లీటర్లు కూడా ఇవ్వ డం లేదు. దీనికితోడు దాణా ఖర్చుల తో పాటు ఇతర ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. దీంతో పాల ధర పెరి గినా రైతుకు గిట్టుబాటు కావడం లేదు. పట్టించుకోని ప్రభుత్వం ఒకవైపు కరువుతో పంటలు పండక పల్లె జీవనం పూర్తిగా దెబ్బతింది. పంటల ఆధారంగా జీవనం సాగించే రైతు కుటుంబాలు తీవ్ర ఆర్థిక చిక్కుల్లో సతమతమౌతున్నాయి. పాడి ద్వారా అయినా జీవనం సాగిద్దామనుకున్న రైతులకు ఇక్కడా పరిస్థితులు అనుకూలించకపోవడంతో కాలానికి ఎదురీదుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు బాసటగా నిలవాల్సిన ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆదుకునేందుకు ప్రస్తుతానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. -
పేదల భూముల్లో పెద్దల పాగా
ఉదయగిరి, న్యూస్‌లైన్: సొమ్మొకరిది..సోకొకరిది..చందంగా తయారైంది ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన భూముల పరిస్థితి. వారి పేదరికాన్ని ఆసరా చేసుకుని పెద్దలు లబ్ధి పొందుతుండటమే ఇందుకు నిదర్శనమే. పేదల చేతుల్లో పదో, పావలో పెట్టి ఆ భూములను స్వాధీనం చేసుకుంటున్న కొందరు ధనవంతులు జామాయిల్ తోటలు సాగు చేస్తూ కోట్లు గడిస్తున్నారు. లబ్ధిదారుల్లో ఎక్కువ శాతం మంది నిరక్షరాస్యులే ఉండటంతో మాయమాటలతో మభ్యపెట్టి 20 నుంచి 30 ఏళ్ల లీజుకు భూములు తీసుకున్నట్లు అగ్రిమెంట్లు రాయించుకుంటున్నారు. దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరంలోని పరిస్థితే ఇందుకు నిదర్శనం. దుత్తలూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 2100, 2200, 2205, 2199, 2198, 2167, 2170, 2188, 2180, 2189, 2107, 2106, 2202, 2173, 2197, 2190, 2186, 2201, 2196, 2191, 2185, 2194, 2203, 2183, 2193, 2204, 2192, 2185, 2199, 2173, 2190, 2181, 2298, 2274, 2290లోని 206 ఎకరాల సీజేఎఫ్ఎస్ భూములను ప్రభుత్వం 1977లో పేదలకు పంపిణీ చేసింది. 50 మంది ఎస్సీలకు, 70 మంది బీసీలకు రెండు నుంచి రెండున్నర ఎకరాల చొప్పున కేటాయించింది. ఈ భూముల్లో మొట్టపంటలు సాగుచేసుకుంటూ కొన్నేళ్లుగా జీవనం సాగిస్తున్నారు. ఐదేళ్ల క్రితం కృష్ణాజిల్లాకు చెందిన ఓ భూస్వామి మధ్యవర్తుల సాయంతో ఈ భూముల్లోకి ప్రవేశించాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి డబ్బు ఆశ చూపి 2027 వరకు లీజుకు ఇచ్చినట్లు అంగ్రిమెంట్లు రాయించుకున్నాడు. ఎకరాకు వెయ్యి నుంచి రూ.2 వేలు మా త్రం లీజు ఇస్తూ సుమారు 170 ఎకరాల్లో జామాయిల్ సాగు చేపట్టాడు. ప్రస్తుతం జామాయిల్ కొయ్యకు మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఉండటంతో ఎకరాకు రూ.2 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. 15 రోజులుగా ఈ భూముల్లో సాగుచేసిన జామాయిల్ కటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ భూస్వామికి మూడున్నర కోట్లకు పైగా ఆదాయం వస్తుండటం గమనార్హం. నిబంధనలకు తూట్లు అసైన్మెంట్, సీజేఎఫ్ఎస్ భూములను లీజుకు ఇవ్వడం, విక్రయించడం ప్రభుత్వ నిబంధనల ప్రకారం నేరం. సీజేఎఫ్ఎస్ భూములను మం జూరు చేయడమంటేనే లీజుకు ఇచ్చినట్లు. ఈ భూముల్లో లబ్ధిదారులు సొంతంగా సాగుచేసి ఫలితాన్ని మాత్రమే పొందాలి. భూములు దుర్వినియోగం చేస్తే లీజు రద్దుచేస్తారు. ఈ నిబంధనలపై లబ్ధిదారులకు అవగాహన లేకపోవడంతో అధికారులు అండగా భూస్వాములు హవా సాగిస్తున్నారు. కొందరు మాత్రం నిబంధనలు తెలుసుకుని భూములను తిరిగి ఇచ్చేయాలని కోరుతున్నా ఫలితంలేదు. అధికారుల అండతో భూస్వాములు లబ్ధిదారులను బెది రిస్తున్నారు. తమ భూములను తమకు అప్పగించేందుకు సహకరించాలని కొందరు తహశీల్దార్ రమేష్‌ను కలిసినా పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా భూముల్లో సాగుచేసిన జామాయిల్ కటింగ్‌కు ముడుపులు తీసుకుని అనుమతులు ఇవ్వడం గమనార్హం. ఓ అధికారి కీలకపాత్ర జామాయిల్ కటింగ్‌ను అనుమతి ఇచ్చే విషయంలో తహశీల్దార్ కార్యాలయంలో అన్నీ తానై వ్యవహరించే ఉత్తమ ఉద్యోగి అవార్డు గ్రహీత అయిన ఓ అధికారి కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. జామాయిల్ సాగుచేసిన వారి నుంచి మధ్యవర్తుల సహకారంతో ముడుపులు తీసుకుని అనుమతులు ఇప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెడితే ఈ వ్యవహారంలో చోటుచేసుకున్న అక్రమాలు వెలుగులోకి రావడంతో పాటు పేదల భూముల్లో కోట్లు ఆర్జిస్తున్న వారి నుంచి రికవరీ చేసే అవకాశముంటుంది. ఇందిర జలప్రభకూ దూరం పేదల భూములకు సాగునీటి వనరు కల్పిం చేందుకు ఇందిర జలప్రభ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా బ్రహ్మేశ్వరం పరిధిలోని భూములకు సుమారు 14 బోర్లు మంజూరయ్యాయి. తీరా అధికారులు క్షేత్ర పరిశీలనకు వెళితే ఆ భూముల్లో జామాయిల్ మొక్కలు ఉండటంతో బోర్ల మంజూరు విషయంలో వెనక్కుతగ్గారు. ఈ క్రమంలో ఇందిర జలప్రభ పథకాన్ని వినియోగించుకునే అవకాశాన్ని పేదలు కోల్పోయారు. -
‘చౌక’ దోపిడీ
చౌక దుకాణాల్లో కిలో బియ్యం ధర రూపాయి. అవే బియ్యం బహిరంగ మార్కెట్లో రూ.15 పైమాటే. కిరోసిన్ ధర రూ.15 కాగా, బ్లాక్‌లో రూ.55పైగా పలుకుతోంది. కిలో చక్కెర రూ.13.50 కాగా, బయటి మార్కెట్లో రూ.35 కంటే ఎక్కువే. అంటే..బియ్యంలో రూ.14, కిరోసిన్‌కు రూ.40, చక్కెరలో రూ.31 వరకు అదనపు ఆదాయం. ఇలా అక్రమ వ్యాపారం లావాదేవీలు జిల్లాలో నెలకు రూ. 2 కోట్ల పైగా జరుగుతున్నాయి. అక్రమాలను అరికట్టేందుకు పౌరసరఫరా, రెవెన్యూ, విజిలెన్స్, పోలీసు శాఖలు ఉన్నా ఫలితం శూన్యం. ఉదయగిరి, న్యూస్‌లైన్ : చౌక బియ్యం, కిరోసిన్, చక్కెర అక్రమ రవాణా ప్రతిరోజూ జిల్లాలో ఏదో ఒకమూల జరుగుతూనే ఉంది. అడపాదడపా తనిఖీల్లో చిక్కుతున్నా గుట్టుచప్పుడు కాకుండా జరిగే వ్యాపారం ఎంతో ఉంది. ప్రజా పంపిణీ వ్యవస్థ గాడి తప్పడంతో కోట్ల రూపాయల విలువైన సరుకులను డీలర్లు దారి మళ్లించి పెద్ద ఎత్తున ఆదాయం గడిస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారంలో కొందరు అధికారులకు కూడా భాగస్వామ్యం ఉండడంతో అడ్డే లేకుండా పోతోంది. అక్కడక్కడా పట్టుబడినా, నామమాత్రపు కేసులతో వదిలిపెడుతుండటంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. జిల్లాలోని 15 మండల స్టాక్ పాయింట్ల నుంచి 10,476 మెట్రిక్ టన్నుల బియ్యం, 1,515 కిలో లీటర్ల కిరోసిన్, 3,55,494 కిలోల చక్కెర, 7,10,988 కిలోల పామోలిన్ సరఫరా అవుతోంది. ప్రస్తుతం బియ్యం, కిరోసిన్, చక్కెర పామోలిన్‌కు గిరాకీ ఉండడంతో కొందరు వ్యాపారులు డీలర్లతో కుమ్మక్కై అధికారుల అండదండలతో సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. కొన్ని సరుకులు స్టాక్ పాయింట్ నుంచి చౌక దుకాణాలకు చేరకుండానే దారిమళ్లుతున్నాయి. మరికొన్ని సరుకులు రేషన్ షాపుల నుంచి బయటకు తరలుతున్నాయి. యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా కొందరు డీలర్లు వ్యాపారులతో కుమ్మక్కై ప్రతి నెలా చౌక బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. 50 కిలోల బస్తా రూ.50 కాగా, దానిని వ్యాపారులకు రూ.600కు విక్రయిస్తున్నారు. దీనిని వ్యాపారులు మిల్లర్లకు తరలించి రూ.800కు అమ్ముతున్నారు. ఇదే బియ్యాన్ని మిల్లర్లు పాలిష్ చేసి బయట మార్కెట్లో వెయ్యి రూపాయలకుపైగా ధరకు వినియోగదారులకు అంటగడుతున్నారు. చక్కెర, కిరోసిన్దీ ఇదే బాట: రేషన్ షాపులో కిలో చక్కెర రూ.13.50 కాగా బయట మార్కెట్లో రూ.35 అమ్ముతోంది. దీంతో డీలర్లు అరకొరగా లబ్ధిదారులకు చక్కెర పంపిణీ చేసి మిగలిందంతా బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్నారు. గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి ఒక లీటరు, లేనివారికి రెండు లీటర్లు కిరోసిన్ రూ.15 చొప్పున విక్రయిస్తారు. దీనిని బహిరంగ మార్కెట్లో రూ.55 వరకు అమ్ముతున్నారు. కిరోసిన్ తీసుకునే వారు చాలా తక్కువమంది ఉండడంతో డీలర్లకు పంపిణీ చేసిన కిరోసిన్‌లో 50 శాతం పైగా బ్లాక్‌మార్కెట్‌కు తరలుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇదంతా అధికారులకు తెలిసినా మామూళ్ల మత్తులో పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో కొండాపురం, వరికుంటపాడు, సీతారామపురం, వింజమూరు మండలాల్లో చౌక సరుకులను భారీ ఎత్తున డీలర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకున్నారు. దీనిపై కొండాపురంలో రెవెన్యూ అధికారులు తూతూమంత్రంగా విచారణ జరిపి చేతులు దులుపుకున్నారు. అధికారుల తీరుకు నిదర్శనాలివే.. గతేడాది జూన్‌లో లారీలో అక్రమంగా తరలిస్తున్న 200 బస్తాల బియ్యాన్ని దుత్తలూరు మండలం నర్రవాడ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకుని, రెవెన్యూ అధికారులకు అప్పజెప్పారు. బాధ్యులైన వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సెప్టెంబరులో జలదంకి మండలం అన్నవరం వద్ద 125 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బియ్యం ఎక్కడివో ఇంత వరకు తేల్చలేదు. అక్టోబరులో కావలి మండలం మద్దూరుపాడు నుంచి అక్రమంగా తరలిస్తున్న 1,400 లీటర్ల కిరోసిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పజెప్పారు. అప్పటికప్పుడు దొంగ బిల్లు సృష్టించి ఆ కేసు మాఫీ చేశారు. కొండాపురం మండలంలో అక్టోబరులో 11 రేషన్ షాపులకు సంబంధించిన సరుకులు ఆయా షాపులకు చేరకుండానే మండల స్టాక్ పాయింట్ నుంచి మాయం చేశారనే ఆరోపణలు వచ్చాయి. దానిపై ఇంతవరకు విచారణ జరగలేదు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో వరికుంటపాడు మండలంలో దాదాపు 20 షాపులకు సంబంధించిన బియ్యం, కిరోసిన్, చక్కెరను బహిరంగ మార్కెట్‌కు తరలించి సొమ్ముచేసుకున్నారు. దీనిపై కొందరు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. -
ఉదయగిరి ఎంపీడీఓ డిస్మిస్
ఉదయగిరి, న్యూస్‌లైన్: ఉదయగిరి ఎంపీడీఓ బండారు శ్రీనివాసరావును డిస్మిస్ చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. సస్పెన్షన్ తాలూకు ఆదేశాలను బుధవారం ఆ శాఖ వెబ్సైట్లో ఉంచారు. జెడ్పీ సీ ఈఓ జితేంద్ర ఈ విషయాన్ని ధ్రువీక రించారు. శ్రీనివాసరావు గుంటూరు జి ల్లాలో ఎంపీడీఓగా పనిచేస్తున్నప్పుడు ‘ఉపాధి’ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రూ.కోటికి పైగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు రుజువు కావడంతో ప్రస్తుతం వేటు పడింది. 2013 మేలో ఆయన ఉదయగిరి ఎంపీడీఓగా కౌన్సెలింగ్ ద్వారా విధుల్లో చేరారు. ఉదయగిరిలోనూ అక్రమాలు ఉదయగిరిలోనూ భారీ ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. మండల పరిషత్ సాధారణ నిధులు, సీఎఫ్‌సీ నిధులను నిబంధనలకు విరుద్ధంగా డ్రాచేసి సొంతానికి వినియోగించుకున్నారు. చెరువుపల్లి, గండిపాళెం, ఉదయగిరి, శకునాలపల్లి పంచాయతీల్లో తమ అనుచరులకు పనులు అప్పగించారు. వీరు తమ సొంత నిధులతో పనులు చేసి ఎంబుక్‌లో రికార్డ్ చేయించుకున్నారు. అంతకుముందే ఎంపీడీఓ సాధారణ నిధుల నుంచి రూ.10 లక్షలు, టీఎఫ్సీ నిధుల నుంచి రూ.1.50 లక్షలు పైగా నిధులు డ్రా చేశారు. నిబంధనల మేరకు పని పూర్తిచేసిన తర్వాతే బిల్లులు మంజూ రు చేయాలి. గత ఏడాది జూన్ 4 నుంచి డి సెంబరు వరకు సాధారణ నిధుల నుంచి రూ.10 లక్షలు, సెప్టెంబరులో టీఎఫ్సీ నుంచి రూ.2.50 లక్షలు నిధు లు డ్రా చేశారనే ఆరోపణలున్నాయి. -
అందనంటోంది ‘బంగారు తల్లి’
దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరానికి చెందిన సూరే మౌనిక, మాధవరెడ్డి దంపతులకు 2013 సెప్టెంబర్ 28న ఆడబిడ్డ జన్మించింది. వీరు కూడా బంగారుతల్లి పథకం కోసం దరఖా స్తు చేసుకున్నారు. మూడు నెలలు గడుస్తున్నా ఇంత వరకు వారి బ్యాంక్ ఖాతాలో మొదటి విడత ఇచ్చే రూ. 2,500 జమ కాలేదు. బాండ్ కూడా మంజూరు కాలేదు. బంగారు తల్లి పథకానికి దరఖాస్తు చేసుకున్న శాంతి, మౌనిక వంటి వాళ్లు జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నారు. సీఎం కిరణ్ మానస పుత్రికగా చెప్పుకునే బంగారుతల్లి పథకం ఆచరణలో పేరుకు తగ్గట్టుగా లేదు. ఈ ఏడాది మే ఒకటిన జిల్లాలో ప్రారంభమైన పథకానికి ఇంత వరకూ 3,500 దరఖాస్తులు వచ్చాయి. అయితే లబ్ధిదారులకు ఒక్క పైసా కూడా అందిన దాఖలాలు లేవు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఉదయగిరి, న్యూస్‌లైన్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన మానసపుత్రికగా గొప్పగా చెప్పుకుంటున్న ‘బంగారుతల్లి’ పథకం బాలారిష్టాలు దాటలేదు. ఈ పథకం 2013 జూన్‌లో అసెంబ్లీ ఆమోదం పొందింది. మే 1 నుంచి పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ప్రతి ఆడబిడ్డకు బంగారు భవిత కల్పిస్తామని ఊదరగొట్టింది. ఈ పథకానికి గత ఏడు నెలల్లో జిల్లాలో 3,500 దరఖాస్తులు అందాయి. వీటిలో సగం ప్రభుత్వ పరిశీలనకు వెళ్లినప్పటికీ లబ్ధిదారులకు పైసా కూడా మంజూరుకాలేదు. పథకం ప్రారంభంలోనే ఇలా ఉంటే మున్ముందు ఏ మేరకు అమలవుతుం దో అంతుపట్టని ప్రశ్నగా మారింది. జిల్లాలో ఈ పథకం మే 1 నుంచి అమల్లోకి వచ్చింది. 2000లో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు బాలికా శిశుసంరక్షణ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. మహానేత వైఎస్సార్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక 2005లో ఈ పథకానికి కొద్దిగా మార్పులు చేసి ఆడబిడ్డలకు మరింత ప్రయోజనం చేకూరే విధంగా రూపకల్పన చేశారు. తొలి కాన్పులో ఆడబిడ్డ జన్మిస్తే రూ.30 వేలు, రెండో కాన్పులో తిరిగి ఆడబిడ్డ పుడితే మరో రూ.30 వేలు ప్రభుత్వం వారి పేరుపై డిపాజిట్ చేసేది. ఒక్క ఆడబిడ్డకే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి రూ.1 లక్ష డిపాజిట్ చేసేది. ఈ పథకం కింద జిల్లాలో సుమారు 17 వేల మంది దరఖాస్తు చేసుకోగా 15,500 మందికి బాండ్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు వాటిని ఇంత వరకు అందజేయలేదు. మరో 1500 పెండింగ్‌లో ఉన్నాయి. ‘బంగారుతల్లి’: ఆడబిడ్డలకు ఉజ్వల భవిష్యత్తు కల్పించేలా సీఎం కిరణ్ అనేక విమర్శలను తోసిరాజని బంగారుతల్లి పథకానికి చట్టం చేశారు. ఆడబిడ్డ జన్మిస్తే రూ.2 లక్షలుపైగా లబ్ధిపొందే విధంగా రూపకల్పన చేశారు. బిడ్డ పుట్టిన నాటి నుంచి 21 ఏళ్ల వరకు దశల వారీగా నగదు వచ్చే విధంగా పథకానికి రూపకల్పన చేశారు. ఇంటర్మీడియెట్ పాసైతే రూ.50 వేలు, డిగ్రీ పాసైతే రూ.1 లక్ష ఇచ్చే విధంగా పథకాన్ని తీర్చిదిద్దారు. చెప్పుకునేందుకు బాగానే ఉన్నా ఆచరణలో అపహాస్యమవుతోంది. పెండింగ్‌లో దరఖాస్తులు గడిచిన ఏడు నెలల్లో బంగారుతల్లి పథకానికి 3,500 దరఖాస్తులు అందినట్లు సమాచారం. వీటిలో ఇంతవరకు 134 బాండ్లు మాత్రమే గత రచ్చబండలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగతా దరఖాస్తులన్నీ కూడా ప్రభుత్వం ఆమోదం కోసం వేచి ఉన్నాయి.