పాడి రైతుపై కరువు పోటు
నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో మెట్ట ప్రాంతంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. పాడి ద్వారానైనా జీవనం సాగిద్దామనుకున్న రైతులకు నిరాశే మిగులుతోంది. చినుకు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసినా నీటి చుక్క నేల రాకపోవడంతో వారి పరిస్థితి దారుణంగా తయారైంది. తినడానికి పచ్చిగడ్డి, తాగడానికి నీరు లేక పశువుల పొదుగులు ఎండిపోతున్నాయి. పాల దిగుబడి గణనీయంగా పడిపోయింది. పూటకు ఐదు లీటర్ల పాలిచ్చే గేదె, రెండు లీటర్లు ఇవ్వడం కూడా కష్టంగా మారింది. కళ్ల ముందే గేదెలు నీళ్లు లేక, తిండిలేక శుష్కించిపోవడం చూడలేక పలువురు కబేళాలకు తరలిస్తున్నారు.
ఉదయగిరి: జిల్లాలో వ్యవసాయం తర్వాత పాడి ఆధారంగానే లక్షలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో పంటలు పండక పాడిగేదెల ద్వారానే భృతి కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ఉదయగిరి, ఆత్మకూరు, కావలిలోని మెట్ట మండలాలలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. పంటల సంగతి దేవుడెరుగు. కనీసం పశువులు, జీవాలకు కూడా మేత, నీరు లేదు. అనేక గ్రామాల్లో బోర్లలోనూ నీరు పూర్తిగా అడుగంటాయి. వాగులు, వంకలు, చెరువులు నెర్రెలు బారాయి. ఈ పరిస్థితుల్లో పశువులకు కష్టాలు మొదలయ్యాయి. వీటిని నమ్ముకున్న పాడి రైతుకు కష్టాలు తప్పలేదు.
గణనీయంగా తగ్గిన దిగుబడి
జిల్లాలో రోజుకు సగటున 2 లక్షలకుపైగా లీటర్లు విజయ డెయిరీతో పాటు ప్రైవేటు డెయిరీలు సేకరిస్తాయి. కానీ ఈ ఏడాది జనవరి నుంచే పాల దిగుబడి గణనీయంగా తగ్గుతూ వచ్చింది. సాధారణంగా ఏటా వేసవిలో పాల దిగుబడి తగ్గటం సహజమే. కానీ జూన్‌లో కురిసే తొలకరులతో మళ్లీ పాల దిగుబడి పెరుగుతుంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో జూన్ నెలాఖరులోనూ వరుణుడు కరుణించలేదు. దీంతో మేత కొరత తీవ్రమైంది. నీటి ఆధారంగా సాగుచేసే పచ్చిగడ్డి ఎండిపోయింది. ఎండుగడ్డి ధర ఆకాశాన్నంటడంతో కొనే పరిస్థితి లేదు. ఒక్క ట్రాక్టరు గడ్డి ధర రూ.15 వేల నుంచి రూ.20 వేలు పలుకుతోంది. ఇది రెండు గేదెలకు మూడు నెలలు వస్తుంది. ఇంత ధర పెట్టి రైతులు కొనే పరిస్థితి లేదు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు పాతిక వేల లీటర్ల పాల సేకరణ కూడా జరగడం లేదు. మార్కెట్‌లో చక్రం తిప్పుతున్న తిరుమల, దొడ్ల, హెరిటేజ్, విష్ణుప్రియలాంటి ప్రైవేటు డెయిరీలకు కూడా కరువు పోటు తప్పలేదు.
ధర పెరిగింది..ఖర్చులు పెరిగాయి
ఈ ఏడాది పాల ధర ఆశాజనకంగానే ఉంది. పది శాతం వెన్న ఉంటే లీటరు పాలకు రూ.50 ఇస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంలో రూ.42 ఇచ్చారు. పాల ధర పెరిగినా కరువు పరిస్థితుల్లో దిగుబడి మాత్రం గణనీయంగా తగ్గిం ది. రోజుకు 8 లీటర్లు ఇచ్చే పాడి గేదె ప్రస్తుతం మూడు లీటర్లు కూడా ఇవ్వ డం లేదు. దీనికితోడు దాణా ఖర్చుల తో పాటు ఇతర ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. దీంతో పాల ధర పెరి గినా రైతుకు గిట్టుబాటు కావడం లేదు.
పట్టించుకోని ప్రభుత్వం
ఒకవైపు కరువుతో పంటలు పండక పల్లె జీవనం పూర్తిగా దెబ్బతింది. పంటల ఆధారంగా జీవనం సాగించే రైతు కుటుంబాలు తీవ్ర ఆర్థిక చిక్కుల్లో సతమతమౌతున్నాయి. పాడి ద్వారా అయినా జీవనం సాగిద్దామనుకున్న రైతులకు ఇక్కడా పరిస్థితులు అనుకూలించకపోవడంతో కాలానికి ఎదురీదుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు బాసటగా నిలవాల్సిన ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆదుకునేందుకు ప్రస్తుతానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.