బాబుకు తగిన బుద్ధిచెబుతాం
– ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారంటూ మహిళలు ఆగ్రహం
– గడప గడపకూ వైఎస్సార్‌లో తమ సమస్యలు విన్నవించిన ప్రజలు
ఉదయగిరి: గత ఎన్నికల్లో అనేక హామీలిచ్చి అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధిచెబుతామని పలువురు మహిళలు ఉదయగిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ముందు కుండబద్ధలు కొట్టారు. ఉదయగిరిలో బుధవారం జరిగిన ‘గడప గడపకూ వైఎస్సార్’లో అనేకమంది తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో అన్నివిధాలుగా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందామని, టీడీపీ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఉదయగిరి మెయిన్‌రోడ్డు, బీసీ కాలనీలో ఇంటింటికి తిరిగి బాబు వాగ్దానాలపై ప్రజా బ్యాలెట్‌ను స్థానికులకు అందజేసి మార్కులు వేయించారు. ఎక్కువ శాతం హామీలు పూర్తిగా నెరవేర్చలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అబద్ధాలాడి అధికారం..మరచిన హామీలు
అనంతరం స్థానిక పంచాయతీ బస్టాండు వద్ద జరిగిన సమావేశంలో మేకపాటి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేందుకు అనేక అబద్ధాలాడి పగ్గాలు చేపట్టిన తర్వాత అందులో ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదన్నారు. నీరు–చెట్టు పనుల్లో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని తెలుగుతమ్ముళ్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. జన్మభూమి కమిటీలు అర్హులకు మొండిచేయి చూపించి ప్రభుత్వ పథకాలను టీడీపీ వారికే కట్టబెడుతున్నారని మండిపడ్డారు. బీడుభూములు సస్యశ్యామలం చేసేందుకు వెలుగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్‌కు నిధులు మంజూరుచేయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు బి.శ్రీనివాసులు, పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ మార్కెట్ సుభాని, అక్కి భాస్కర్‌రెడ్డి, ఖిల్జీ సలీం, గడియాల్చి ఎస్ధాని, షంషీర్, చేజర్ల సుధాకర్‌రెడ్డి,గౌస్‌మొహిద్దిన్, ఏడుకొండలు, గొల్లపల్లి తిరుపతి, సోమిరెడ్డి, రమణారెడ్డి, నియోజకవర్గ నేతలు గణపం బాలక్రిష్ణారెడ్డి, ఆండ్రా బాలగురవారెడ్డి, గుంటుపల్లి నాగభూషణం, షేక్.అలీఅహ్మద్, పావులూరి మాల్యాద్రిరెడ్డి,బొల్లినేని సత్యనారాయణ, పాలవెల్లి మాలకొండారెడ్డి, యారం నరసింహరావు,పి.విజయభాస్కర్‌రెడ్డి, జి.పుల్లయ్య, తదితరులున్నారు.