సామాన్యులం బతకలేకున్నాం
కడప అగ్రికల్చర్ : తమ పార్టీ అధికారంలోకి రాగానే నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని, ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత కల్పిస్తామని ఎన్నికల సమయంలో పదేపదే టీడీపీ నేతలు చెప్పారని, అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదని ప్రజలు వైఎస్సార్‌సీపీ నేతల ఎదుట వాపోయారు. శనివారం గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలం సుంకేసులలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, పార్టీ మండల నాయకులు కొమ్మా పరమేశ్వరరెడ్డి, శివచంద్రారెడ్డి, మండల యూత్ కన్వీనర్ శివారెడ్డి, సర్పంచులు మనోహర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ కృపాకర్‌రెడ్డి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేశారు.
ఆ సమయంలో సుంకేసులకు చెందిన కూలీ నాగయ్య మాట్లాడుతూ కూలీ పనులు చేసుకునే తమలాంటి వాళ్లం ఇప్పుడున్న ధరల్లో నిత్యావసరాలను కొనలేకపోతున్నామని తెలిపారు. ప్రభుత్వం ధరల తగ్గింపుపై ఏమాత్రం శ్రద్ధచూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో ఉన్న 17, 18 వార్డుల్లో పార్టీ సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి, కౌన్సిలర్ దివ్య, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ విశ్వభార్గవరెడ్డి, మాజీ ఎంపీటీసీ సురేంద్రనాథరెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు గంగా శివారెడ్డిలు ప్రజలను కలుసుకుని 100 ప్రశ్నల కరపత్రాలను అందజేశారు.
ఆ సమయంలో నాగేంద్రారెడ్డి అనే యువకుడు మాట్లాడుతూ యువతకు చిరు పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు ఇస్తామని, అలాగే కొన్నేళ్ల పాటు ఆయా పరిశ్రమలు ఏర్పాటుకు భూమిని కూడా కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తలేదని దుయ్యబట్టారు. బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల మండలం పుల్లివీడులో పార్టీ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య, ఎంపీపీ విజయప్రతాప్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సి.బాషాలు గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పుల్లివీడులో వృద్ధురాలు గంగోజి మాట్లాడుతూ వేలిముద్రలు సరిపడలేదని రేషన్‌కార్డు, పింఛన్ తొలగించారని కన్నీళ్ల పర్యంతమైంది.
రాజంపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు సాతుపల్లెలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ పోలా శ్రీనివాసులురెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాథరెడ్డి, మాజీ కౌన్సిలర్ దండు చంద్రలీల ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంలో పలువురు మహిళలు తమకు డ్వాక్రా రుణమాఫీ జరగలేదని, ఇప్పటికీ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకున్నామని ప్రభుత్వంపై నిప్పులు చెరిగాయి. మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు మండలం పెద్ద జొన్నవరంలో ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి, మండల అధ్యక్షురాలు కానాల చంద్రావతమ్మ, స్థానిక నాయకులు పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సయ్యద్ జాన్ మాట్లాడుతూ మైనార్టీ రుణాలు అందిస్తామని, దుల్హాన్ పథకం కింద పారితోషికం ఇస్తామని చెప్పినా తమకు మాత్రం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నేడు కార్యక్రమం ఇలా..
సాక్షి, కడప : జిల్లాలోని రాజంపేట, బద్వేలు నియోజకవర్గాల్లో ఆదివారం కూడా గడపగడపకు వైఎస్‌ఆర్ కార్యక్రమం జరగనుంది. అందుకు సంబంధించి రాజంపేట పట్టణంలోని రామ్‌నగర్‌లో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి పాల్గొనున్నారు. అలాగే బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల మండలం బుళ్లివీడు గ్రామపంచాయతీలోని చెన్నారెడ్డిపేటలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, బద్వేలు సమన్వయకర్త వెంకటసుబ్బయ్యల ఆధ్వర్యంలో గడప గడపకు వైఎస్‌ఆర్ కార్యక్రమం జరగనున్నది. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.