బాబు బూటక పాలన ఇంకెన్నాళ్లు?
గడపగడపకు వైస్సార్‌లో ప్రజాగ్రహం
విశాఖపట్నం: రాష్ట్రంలో పాలన ఉందో లేదో అంతుపట్టడం లేదని.. ఈ పాలనను ఇంకెన్నాళ్లు భరించాలో అర్ధం కావడం లేదని పలువురు తీవ్రస్వరంతో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. రెండున్నరేళ్లయినా ఒక్కటంటే ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఈ ప్రభుత్వానికి తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. గడపగడపకు వైఎస్సార్ ఉద్యమంలా సాగుతోంది. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో మంగళవారం ఆయా కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది.
విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ జీవీఎంసీ 35వ వార్డు తాటిచెట్లపాలెం పరిధి సంతోషనగర్‌లో నిర్వహించిన గడపగడపకు వైఎస్సార్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. బాబును నమ్మి ఓట్లేస్తే మాకు సరైన బుద్ధి చెప్పాడని, బాబు పాలనలో ఒరిగిందేమీ లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 128 గడపలకు వెళ్లి బ్యాలెట్ పత్రాల్లో ప్రశ్నలకు జవాబులను అడిగి తెలుసుకున్నారు. నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, సత్తి రామకృష్ణారెడ్డి, బర్కత్ ఆలీ తదితరులు పాల్గొన్నారు.
విశాఖ దక్షిణ కో ఆర్డినేటర్ కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీలు 21వ వార్డులో గడప గడపకు వైఎస్సార్ నిర్వహించారు. వార్డ్‌బాయ్ లైన్, తాడివీధి, ఏనుగులవీధి, జెండాచెట్టు తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఆయా ప్రాంతాల్లోని 152 గడపలను సందర్శించి అధికార టీడీపీ వైఫల్యాలను, చంద్రబాబు చేపడుతున్న పలు ప్రజావ్యతిరేక విధానాలను వివరించారు. గాజువాక కో ఆర్డినేటర్ తిప్పల నాగిరెడ్డి 60వ వార్డు పరిధిలోని డ్రైవర్స్ కాలనీలో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన 100 హామీల వైఫల్యంపై వైఎస్సార్‌సీపీ రూపొందించిన ప్రజాబ్యాలెట్‌ను అందజేశారు. వైఎస్సార్‌సీపీ నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, నగర అధికార ప్రతినిధి ఉరుకూటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.