ముగిసిన ఒంగోలు పశువుల అందాల ప్రదర్శన
సాక్షి, నెల్లూరు(అగ్రికల్చర్): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పూండ్ల వెంకురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కనుపర్తిపాడు సమీపంలో శుక్రవారం ప్రారంభమైన ఒంగోలు జాతి పశువుల అందాల ప్రదర్శన ఆదివారంతో ముగిసింది. గిత్తల పాలపళ్ల విభాగంలో ఒకటి, రెండు, మూడు జతల పళ్ల విభాగాలకు, గిత్తల విభాగాలకు ఆదివారం పోటీలు నిర్వహించారు.
ఆవుల విభాగంలో చాంపియన్‌గా నెల్లూరు పూండ్ల వెంకురెడ్డి గోశాలకు చెందిన ఆవు, గిత్తల విభాగంలో కర్నూలు జిల్లా కాటం మురళీధర్‌కు చెందిన గిత్త చాంపియన్‌గా నిలిచింది. గిత్త యజమానికి కిలో వెండి, ఆవు యజమానికి అర కిలో వెండిని బహూకరించారు. రాత్రి జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలైన పశువుల యజమానులకు బహుమతులు అందజేశారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు.
ఒంగోలు జాతి పశు సంపదను వృద్ధి చేసేందుకు వారు తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. న్యాయనిర్ణేతలుగా పశువైద్యులు వ్యవహరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి రామనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, పూండ్ల వెంకురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు వెంకురెడ్డి, మేనేజింగ్ డెరైక్టర్ సతీష్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, మేనేజర్ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.