‘చౌక’ దోపిడీ | Rice saleing in Illegal prices | Sakshi
Sakshi News home page

‘చౌక’ దోపిడీ

Published Thu, Feb 6 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM

Rice saleing in Illegal prices

చౌక దుకాణాల్లో కిలో బియ్యం ధర రూపాయి. అవే బియ్యం బహిరంగ మార్కెట్‌లో రూ.15 పైమాటే. కిరోసిన్ ధర రూ.15 కాగా, బ్లాక్‌లో రూ.55పైగా పలుకుతోంది. కిలో చక్కెర రూ.13.50 కాగా, బయటి మార్కెట్‌లో రూ.35 కంటే ఎక్కువే. అంటే..బియ్యంలో రూ.14, కిరోసిన్‌కు రూ.40, చక్కెరలో రూ.31 వరకు అదనపు ఆదాయం. ఇలా అక్రమ వ్యాపారం లావాదేవీలు జిల్లాలో నెలకు రూ. 2 కోట్ల పైగా జరుగుతున్నాయి. అక్రమాలను అరికట్టేందుకు పౌరసరఫరా, రెవెన్యూ, విజిలెన్స్, పోలీసు శాఖలు ఉన్నా ఫలితం శూన్యం.
 
 ఉదయగిరి, న్యూస్‌లైన్ : చౌక బియ్యం, కిరోసిన్, చక్కెర అక్రమ రవాణా ప్రతిరోజూ జిల్లాలో ఏదో ఒకమూల జరుగుతూనే ఉంది. అడపాదడపా తనిఖీల్లో చిక్కుతున్నా గుట్టుచప్పుడు కాకుండా జరిగే వ్యాపారం ఎంతో ఉంది. ప్రజా పంపిణీ వ్యవస్థ గాడి తప్పడంతో కోట్ల రూపాయల విలువైన సరుకులను డీలర్లు దారి మళ్లించి పెద్ద ఎత్తున ఆదాయం గడిస్తున్నారు.
 
 ఈ అక్రమ వ్యాపారంలో కొందరు అధికారులకు కూడా భాగస్వామ్యం ఉండడంతో అడ్డే లేకుండా పోతోంది. అక్కడక్కడా పట్టుబడినా, నామమాత్రపు కేసులతో వదిలిపెడుతుండటంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. జిల్లాలోని 15 మండల స్టాక్ పాయింట్ల నుంచి 10,476 మెట్రిక్ టన్నుల బియ్యం, 1,515 కిలో లీటర్ల కిరోసిన్, 3,55,494 కిలోల చక్కెర, 7,10,988 కిలోల పామోలిన్ సరఫరా అవుతోంది. ప్రస్తుతం బియ్యం, కిరోసిన్, చక్కెర పామోలిన్‌కు గిరాకీ ఉండడంతో కొందరు వ్యాపారులు డీలర్లతో కుమ్మక్కై అధికారుల అండదండలతో సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. కొన్ని సరుకులు స్టాక్ పాయింట్ నుంచి చౌక దుకాణాలకు చేరకుండానే దారిమళ్లుతున్నాయి. మరికొన్ని సరుకులు రేషన్ షాపుల నుంచి బయటకు తరలుతున్నాయి.

 యథేచ్ఛగా
 బియ్యం అక్రమ రవాణా
 కొందరు డీలర్లు వ్యాపారులతో కుమ్మక్కై ప్రతి నెలా చౌక బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. 50 కిలోల బస్తా రూ.50 కాగా, దానిని వ్యాపారులకు రూ.600కు విక్రయిస్తున్నారు. దీనిని వ్యాపారులు మిల్లర్లకు తరలించి రూ.800కు అమ్ముతున్నారు. ఇదే బియ్యాన్ని మిల్లర్లు పాలిష్ చేసి బయట మార్కెట్‌లో వెయ్యి రూపాయలకుపైగా ధరకు వినియోగదారులకు అంటగడుతున్నారు.
 
 చక్కెర, కిరోసిన్‌దీ ఇదే బాట:
 రేషన్ షాపులో కిలో చక్కెర రూ.13.50 కాగా బయట మార్కెట్‌లో రూ.35 అమ్ముతోంది. దీంతో డీలర్లు అరకొరగా లబ్ధిదారులకు చక్కెర పంపిణీ చేసి మిగలిందంతా బ్లాక్ మార్కెట్‌లో అమ్మేస్తున్నారు. గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి ఒక లీటరు, లేనివారికి రెండు లీటర్లు కిరోసిన్ రూ.15 చొప్పున విక్రయిస్తారు.
 
 దీనిని బహిరంగ మార్కెట్‌లో రూ.55 వరకు అమ్ముతున్నారు. కిరోసిన్ తీసుకునే వారు చాలా తక్కువమంది ఉండడంతో డీలర్లకు పంపిణీ చేసిన కిరోసిన్‌లో 50 శాతం పైగా బ్లాక్‌మార్కెట్‌కు తరలుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇదంతా అధికారులకు తెలిసినా మామూళ్ల మత్తులో పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో కొండాపురం, వరికుంటపాడు, సీతారామపురం, వింజమూరు మండలాల్లో చౌక సరుకులను భారీ ఎత్తున డీలర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకున్నారు. దీనిపై కొండాపురంలో రెవెన్యూ అధికారులు తూతూమంత్రంగా విచారణ జరిపి చేతులు దులుపుకున్నారు.
 
 అధికారుల తీరుకు
 నిదర్శనాలివే..
  గతేడాది జూన్‌లో లారీలో అక్రమంగా తరలిస్తున్న 200 బస్తాల బియ్యాన్ని దుత్తలూరు మండలం నర్రవాడ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకుని, రెవెన్యూ అధికారులకు అప్పజెప్పారు. బాధ్యులైన వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
 
  సెప్టెంబరులో జలదంకి మండలం అన్నవరం వద్ద 125 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బియ్యం ఎక్కడివో ఇంత వరకు తేల్చలేదు.
  అక్టోబరులో కావలి మండలం మద్దూరుపాడు నుంచి అక్రమంగా తరలిస్తున్న 1,400 లీటర్ల కిరోసిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పజెప్పారు. అప్పటికప్పుడు దొంగ బిల్లు సృష్టించి ఆ కేసు మాఫీ చేశారు.
 
  కొండాపురం మండలంలో అక్టోబరులో 11 రేషన్ షాపులకు సంబంధించిన సరుకులు ఆయా షాపులకు చేరకుండానే మండల స్టాక్ పాయింట్ నుంచి మాయం చేశారనే ఆరోపణలు వచ్చాయి. దానిపై ఇంతవరకు విచారణ జరగలేదు.
 
  సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో వరికుంటపాడు మండలంలో దాదాపు 20 షాపులకు సంబంధించిన బియ్యం, కిరోసిన్, చక్కెరను బహిరంగ మార్కెట్‌కు తరలించి సొమ్ముచేసుకున్నారు. దీనిపై కొందరు అధికారులకు ఫిర్యాదు     చేసినా ఫలితం శూన్యం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement