త్రాన్ దాయి క్వాంగ్‌తో మోదీ కరచాలనం
న్యూఢిల్లీ: స్వేచ్ఛ, అభివృద్ధితో కూడిన ప్రాంతీయ భద్రత కోసం కలిసికట్టుగా కృషి చేయాలని భారత్, వియత్నాం అంగీకరించాయి. భారత్‌లో ఉన్న వియత్నాం అధ్యక్షుడు త్రాన్ దాయి క్వాంగ్‌తో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శనివారం విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మూడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. అణు ఇంధనం, వాణిజ్యం, వ్యవసాయం రంగాలతోపాటు ఆయిల్, గ్యాస్ నిక్షేపాల అన్వేషణలో సహకారం పెంచుకునేందుకు అంగీకరించారు. అనంతరం ఇరువురు నేతలు కలిసి విలేకరులతో మాట్లాడారు.
సముద్ర సంబంధ అంశాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇండో– పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, స్వతంత్రం, అభివృద్ధి కోసం ఐక్యంగా పని చేయనున్నామన్నారు. సార్వభౌమత్వం, అంతర్జాతీయ చట్టాలకు లోబడి వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మోదీ చెప్పారు. రక్షణ రంగంలో సహకారం, రక్షణ ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి సంబంధించి కొత్త అవకాశాలను అన్వేషిస్తున్నామన్నారు. ఆసియాన్ దేశాలతో అన్ని రంగాల్లోనూ అనుసంధానత కలిగి ఉండాలన్న భారత్‌ను వియత్నాం అధ్యక్షుడు బలపరిచారు. ఆసియాన్ ప్రాంతంలో స్వేచ్ఛా నౌకాయానం, విమాన యానం ఉండాలని అన్నారు. ఈ ప్రాంతంలో సైనికపరంగా విస్తరిస్తున్న చైనాకు ఈ ప్రకటన ఒక సందేశంగా పనిచేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment