చైనాకు చెక్ పెట్టేందుకు..!
హనోయ్: శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అన్న సూత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుసరిస్తున్నట్లు ఆయన వియత్నాం పర్యటనను గమనిస్తే అర్థమౌతోంది. చైనా దూకుడుకు కళ్లెం వేసే దిశగా ప్రధాని మోదీ హనోయ్ పర్యటన కొనసాగుతోంది. వియత్నాంకు భారీ ఎత్తున రక్షణ సహకారం, నిధులను అందించేందుకు మోదీ అంగీకరించారు. దీంతో ఆగ్నేయ ఆసియాలో భారత ప్రమేయాన్ని పెంపొందించే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
వియత్నాంతో సంబంధం వ్యూహాత్మక భాగస్వామ్యం నుంచి 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం'గా మారిందని శనివారం మోదీ ప్రకటించారు. ఆ దేశ ప్రధాని యువాన్ ఫుసితో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడిన మోదీ.. ఇరుదేశాల మధ్య వాణిజ్యపరమైన సంబంధాలు బలోపేతమయ్యేలా ఒప్పందాలు చేసుకున్నామన్నారు. రక్షణ రంగంలో సహకారాన్ని పెంపొందించుకుంటున్నామని, వియత్నాం రక్షణరంగానికి మరో 500 మిలియన్ డాలర్ల రుణాన్ని భారత్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. పెట్రోల్ బోట్స్, సైబర్ సెక్యురిటీ లాంటి పలు అంశాల్లో ఇరుదేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. గత 15 ఏళ్లలో భారత ప్రధాని వియత్నాంలో పర్యటించడం ఇదే తొలిసారి.