ఆర్సెలర్‌ చేతికి ఎస్సార్‌ పోర్టులు | Essar signs Rs 19,000 crores deal to sell ports business to ArcelorMittal Nippon Steel | Sakshi
Sakshi News home page

ఆర్సెలర్‌ చేతికి ఎస్సార్‌ పోర్టులు

Published Sat, Aug 27 2022 5:05 AM | Last Updated on Sat, Aug 27 2022 5:05 AM

Essar signs Rs 19,000 crores deal to sell ports business to ArcelorMittal Nippon Steel - Sakshi

న్యూఢిల్లీ: పోర్టుల బిజినెస్‌ను మెటల్‌ రంగ దిగ్గజం ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌కు విక్రయించినట్లు ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఎస్సార్‌ గ్రూప్‌ తాజాగా పేర్కొంది. ఇందుకు 2.4 బిలియన్‌ డాలర్ల(రూ. 19,000 కోట్లు) విలువైన తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. కోవిడ్‌–19 తదుపరి దేశీయంగా ఇది అతిపెద్ద డీల్‌కాగా.. నిర్ణీత పోర్టులతోపాటు, విద్యుత్‌ రంగ మౌలిక సదుపాయాలను సైతం ఆర్సెలర్‌కు బదిలీ చేయనున్నట్లు ఎస్సార్‌ తెలియజేసింది. ప్రధానంగా గుజరాత్‌లోని హజీరా స్టీల్‌ ప్లాంటు అవసరాల కోసం ఏర్పాటు చేసిన వీటిని విక్రయించేందుకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు వివరించింది. అంతేకాకుండా డీల్‌లో భాగంగా హజీరాలో వార్షికంగా 4 ఎంటీ సామర్థ్యంగల ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ ఏర్పాటుకు రెండు సంస్థలు 50:50 భాగస్వామ్య సంస్థను సైతం నెలకొల్పనున్నట్లు తెలియజేసింది. హజీరా స్టీల్‌ ప్లాంటును 2018–19లోనే ఆర్సెలర్‌మిట్టల్‌ కొనుగోలు చేసిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం.

3 రాష్ట్రాల్లో...
ఎస్సార్‌ గ్రూప్‌తో కుదిరిన తాజా ఒప్పందంలో భాగంగా గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని పోర్టులతోపాటు హజీరాలోగల రెండు విద్యుత్‌ ప్లాంట్లు సొంతం కానున్నట్లు ఆర్సెలర్‌ మిట్టల్‌ విడిగా ఒక ప్రకటనలో పేర్కొంది. విద్యుత్‌ ప్రసార లైన్‌ సైతం దీనిలో భాగమేనని తెలియజేసింది. 2018–19లో దివాలా చట్ట చర్యలలో భాగంగా రూ. 42,000 కోట్లకు ఎస్సార్‌ స్టీల్‌ను ఆర్సెలర్‌ మిట్టల్‌ కొనుగోలు చేసింది. తద్వారా పోర్టు లైసెన్స్‌ కార్యకలాపాల హక్కులు సైతం దక్కినట్లు ఆర్సెలర్‌మిట్టల్‌ పేర్కొన్నప్పటికీ ఎస్సార్‌ బల్క్‌టెర్మినల్‌ దీనిని వ్యతిరేకించింది. దివాలా చర్యల్లోకి ఇవి రావని వాదించింది. దీంతో ఈ వివాదం కోర్టులకు చేరింది. అయితే ప్రస్తుతం రెండు సంస్థలూ వీటిపై ఒక ఒప్పందానికి రావడం గమనార్హం!

వైజాగ్‌ టెర్మినల్‌ సైతం
హజీరాలోని డీప్‌ డ్రాఫ్ట్‌ బల్క్‌ పోర్ట్‌ టెర్మినల్‌లోని 25 ఎంటీపీఏ జెట్టీతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలోగల 16 ఎంటీపీఏ డీప్‌ డ్రాఫ్ట్‌ టెర్మినల్‌ డీల్‌లో భాగమని ఆర్సెలర్‌ మిట్టల్‌ పేర్కొంది. అంతేకాకుండా ఇక్కడగల 8 ఎంటీపీఏ ఐరన్‌ ఓర్‌ పెల్లెట్‌ ప్లాంటుతో అనుసంధానమైన సమీకృత కన్వేయర్‌ కూడా ఉన్నట్లు తెలియజేసింది. ఇదేవిధంగా ఒడిశాలోని 12 ఎంటీపీఏ పారదీప్‌ డీప్‌ వాటర్‌ జెట్టీ, కన్వేయర్‌ ఒప్పందంలోకి వస్తాయని వివరించింది. వీటితోపాటు హజీరాలోని 270 మెగావాట్ల మల్టీ ఇంధన ప్లాంట్, 515 మెగావాట్ల గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ప్లాంటు ఉన్నట్లు వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement